ఇదేం రోగం ? | Disease thoughts? | Sakshi
Sakshi News home page

ఇదేం రోగం ?

Jan 14 2014 2:27 AM | Updated on Jun 1 2018 8:47 PM

రాణాలు పోయాల్సిన వైద్యులు తమ మధ్య ఉన్న విభేదాలతో ప్రాణాపాయస్థితిలో ఓ క్షతగాత్రుడు గంటల కొద్దీ ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఎమర్జెన్సీ వార్డులో కొట్టుమిట్టాడుతున్నా ఏ మాత్రం పట్టించుకోలేదు.

అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్: ప్రాణాలు పోయాల్సిన వైద్యులు తమ మధ్య ఉన్న విభేదాలతో ప్రాణాపాయస్థితిలో ఓ క్షతగాత్రుడు గంటల కొద్దీ ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఎమర్జెన్సీ వార్డులో కొట్టుమిట్టాడుతున్నా ఏ మాత్రం పట్టించుకోలేదు. గాయపడిన వ్యక్తి వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఉద్యోగి అయినా డాక్టర్లు స్పందించకపోవడంపై ఆస్పత్రి వర్గాలు ఆవేదన వ్యక్తం చేశాయి. వివరాల్లోకి వెళితే.. ముదిగుబ్బ పీహెచ్‌సీ అటెండర్ జయచంద్ర(45), ఆయన మేనల్లుడు ఆంజినేయులు(19) సోమవారం ఉదయం 9.30 గంటలకు ద్విచక్ర వాహనంలో అనంతపురం వస్తుండగా అదుపుతప్పి రోడ్డుపక్కన మైలురాయిని ఢీ కొన్నారు. ప్రమాదంలో జయచంద్ర తలకు తీవ్ర గాయమైంది. ఆయనను అక్కడి పీహెచ్‌సీ సిబ్బంది హుటాహుటిన సర్వజనాస్పత్రికి ఉదయం 11 గంటలకు తీసుకువచ్చారు. అప్పటికే బాధితుని తల పగిలి, అధిక రక్తస్రావం అవుతూ ఉంది. అక్కడున్న కాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చౌదరి రోగిని పరీక్షించి, ఆక్సిజన్ అందించారు. తలకు కుట్టువేయాలన్నా, మెరుగైన వైద్యం అందించాలన్నా సర్జన్ రావాల్సిందేనని తెలిపారు.
 
 డ్యూటీలో ఉన్న స్టాఫ్ నర్సులు ఈ విషయాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వరరావుకు తెలిపారు. ఈ మేరకు సమాచారం సర్జన్‌కు తెలియజేయాలని ఆయన నర్సులకు సూచించారు. సర్జికల్ విభాగం వైద్యురాలు విజయలక్ష్మికి ఫోన్ చేసి చెప్పారు. ఆమె ఆస్పత్రిలోనే ఉంటూ సమాచారం అందిన గంట తర్వాత వచ్చారు. గాయపడిన ఉద్యోగిని చూసి పరిస్థితి విషమంగా ఉందని, హయ్యర్ ఇన్‌స్టిట్యూట్‌కు పంపాలని చెప్పి ఆమె వెళ్లిపోయారు. బాధితుడికి కనీసం కుట్లు కూడా వేయకుండా డాక్టర్ వెళ్లిపోవడంతో కాజువాలిటీ సిబ్బంది ఆశ్చర్యపోయారు. చివరకు స్టాఫ్ నర్సు రక్తస్రావం ఆపేందుకు  కట్టుకట్టారు.
 
 పట్టించుకున్న పాపానపోలేదు..
 గాయపడిన వ్యక్తికి సెలైన్ ఎక్కించారు. ఆక్సిజన్ పెట్టినా అది సరిగ్గా అతనికి అందడంలేదు. ఇలా గంటసేపు బాధితుడు కాజువాలిటీలో విలవిల్లాడుతూ ఉండిపోయాడు. ఈయన పరిస్థితిని చూడలేక ఆస్పత్రి సిబ్బంది మరోసారి సర్జికల్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మురళీకృష్ణకు ఫోన్ చేశారు. విషయమేమిటని ఆయన ప్రశ్నించగా .. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తికి తల పగిలి తీవ్ర రక్తస్రావం అవుతోందని, ఇప్పుడే డాక్టర్ విజయలక్ష్మి వచ్చి బాధితుడ్ని చూసి వెళ్లారని సిబ్బంది ఆయనకు వివరించారు.
 
 ఆ డాక్టర్ ఏమి చెప్పారని డాక్టర్ మురళీకృష్ణ తిరిగి ప్రశ్నించగా.. కర్నూలు తీసుకెళ్లాలని సూచించారని తెలపడంతో మరి కర్నూలుకు తీసుకెళ్లమనండి అంటూ ఆయన చెప్పారు. మిమ్మల్ని వెంటనే రావాలని సూపరింటెండెంట్ తెలిపారని చెప్పగా.. ‘ఆయనే నాకు ఫోన్ చేయమనండి’ అంటూ జవాబిచ్చారు. చివరకు డాక్టర్ మురళీకృష్ణ వచ్చి వైద్యం అందించారు. అనంతరం కుటుంబ సభ్యులు బాధితుడ్ని కర్నూలుకు తీసుకెళ్లారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
 
 స్పందించని వైద్య ఆరోగ్య శాఖ
 గాయపడిన అటెండర్ జయచంద్రను తోటి సిబ్బంది 108 వాహనంలో ఆస్పత్రికి తీసుకువచ్చారు. రెండు గంటలైనా వైద్యులు ఆయనను పట్టించుకోలేదు. పీహెచ్‌సీ సిబ్బంది ఈ విషయాన్ని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు తెలిపినా ప్రయోజనం లేకపోయింది. తమ శాఖకు చెందిన ఓ ఉద్యోగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిసీ, ఆస్పత్రికి నాలుగడుగుల దూరంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు రాకపోవడంతో సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement