చెత్తాచెదారం.. దుర్వాసన | dirty chamber allotted to ysrcp chief Y S Jagan mohan reddy | Sakshi
Sakshi News home page

చెత్తాచెదారం.. దుర్వాసన

Jul 19 2014 1:45 AM | Updated on Aug 27 2018 8:57 PM

సచివాలయంలో వైఎస్ జగన్కు కేటాయించిన గది. (ఇన్సెట్లో) గది పరిసరాల్లో చెత్తాచెదారం - Sakshi

సచివాలయంలో వైఎస్ జగన్కు కేటాయించిన గది. (ఇన్సెట్లో) గది పరిసరాల్లో చెత్తాచెదారం

చెత్తాచెదారంతో భరించలేని కంపు.. అగ్గిపెట్టె లాంటి చీకటి గుహను తలపించే గది... వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కేటాయించిన చాంబర్ పరిసరాల్లోని దుస్థితి ఇదీ.

 విపక్షనేత వైఎస్ జగన్‌కు కేటాయించిన కార్యాలయమిదీ
 పనికిరాని వస్తువులతో డంపింగ్ యార్డును తలపిస్తున్న వైనం
 67 మంది ఎమ్మెల్యేలున్న పార్టీకి ఒకేఒక్క గది!
 చీఫ్ విప్, విప్‌లకు రెండేసి గదులు

 
 సాక్షి, హైదరాబాద్: చెత్తాచెదారంతో భరించలేని కంపు.. అగ్గిపెట్టె లాంటి చీకటి గుహను తలపించే గది... వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కేటాయించిన చాంబర్ పరిసరాల్లోని దుస్థితి ఇదీ. ఏపీ శాసనసభ కార్యదర్శి కె.సత్యనారాయణరావు తాజా గా జారీ చేసిన సర్క్యులర్‌లో ప్రతిపక్ష నేతతోపాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, విప్‌లకు కేటాయించిన చాంబర్ల వివరాలను వెల్లడించారు. డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, విప్‌లకు రెండేసి గదులను కేటాయిస్తున్న ట్లు సర్క్యులర్లో పేర్కొన్న అధికారులు.. 67 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా ఆవిర్భవించిన వైఎస్సార్‌సీపీని మాత్రం ఒకే గదికి పరిమితం చేశారు. అది కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న భవనంలో కాకుండా అసెంబ్లీ సచివాలయ పరిపాలనా భవనంలోని జీ 4 గదిని ప్రతిపక్ష నేతకు కేటాయించారు.

ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ అదనపు కార్యదర్శి గోపాలకృష్ణ గతంలో ఈ చాంబర్‌లోనే విధులు నిర్వహించారు. రెండేళ్ల క్రితం అవినీతి ఆరోపణలపై ఆయన సస్పెండ్ కావడంతో నాటి నుంచి ఈ గదిని సీజ్ చేశారు. అగ్గిపెట్టెను తలపించే ఈ గదిలో పట్టుమని పదిమంది కూర్చునే స్థలం లేదు. అలాంటి చాంబర్‌ను ఏకంగా 67 మంది ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్న ప్రతిపక్ష నేతకు కేటాయించడం గమనార్హం. ప్రతిపక్ష నేత పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కావాలంటే వేరే చోటును వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు కాగా ఆ గది చుట్టూ ఉన్న పరిసరాలు భయానకంగా ఉన్నాయి. చీకటిగుహను తలపించే ఆ గదిలో ఎటుచూసినా చెత్తాచెదారం దర్శనమిస్తోంది. పనికిరాని వస్తువులన్నీ అక్కడే పడేసి డంపింగ్ యార్డ్‌గా మార్చేశారు. ముక్కుపుటాలు అదిరిపోయేలా దుర్వాసన వెదజల్లే పరిసరాల్లో ప్రతిపక్షనేతకు చాంబర్ కేటాయించడం చర్చనీయాంశమైంది. శాసనసభ అధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళితే వారు నోరు మెదపకపోవడం గమనార్హం. సీఎం చంద్రబాబు, టీడీపీకి చాంబర్ల కేటాయింపు అంశాన్ని మాత్రం ఈ సర్క్యులర్లో ప్రస్తావించలేదు. ప్రస్తుతం కొనసాగుతున్న టీడీపీ శాసనసభాపక్ష కార్యాలయాన్ని ఆ పార్టీకే యథాతథంగా కేటాయించినట్లు అధికారవర్గాలు తెలిపాయి.

(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement