రగులుతున్న ‘దేశం’ | Different 'country' | Sakshi
Sakshi News home page

రగులుతున్న ‘దేశం’

Mar 14 2014 2:39 AM | Updated on May 3 2018 3:17 PM

రగులుతున్న ‘దేశం’ - Sakshi

రగులుతున్న ‘దేశం’

చంద్రబాబునాయుడు సమక్షంలో జరిగిన తెలుగుదేశం ప్రజాగర్జన విశాఖ జిల్లా పార్టీలో గ్రూపు రాజకీయాలను పెంచింది.

  • ప్రజాగర్జన తర్వాత రెండు గ్రూపులు
  • అయ్యన్న వ్యాఖ్యలపై గంటా వర్గం గరంగరం
  • చింతకాయలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
  • సందిగ్ధంలో అధిష్టానం
  • గంటా బృందంతో నష్టమేనని ఆవేదన
  •  సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: చంద్రబాబునాయుడు సమక్షంలో జరిగిన తెలుగుదేశం ప్రజాగర్జన విశాఖ జిల్లా పార్టీలో గ్రూపు రాజకీయాలను పెంచింది. బుధవారం నాటి ప్రజాగర్జన తర్వాత పార్టీలోని నేతలు పాత వారు, కొత్తగా చేరిన వారుగా విడిపోయి రాజకీయాలు ప్రారంభించారు.  చంద్రబాబు సమక్షంలోనే ప్రజాగర్జన సభలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు కొత్తగా చేరిన గంటా బృందంతో విరుచుకుపడడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. తమ చేరిక సందర్భంగా నిర్వహించిన సభలోనే అయ్యన్న తమపై చంద్రబాబు ఎదుటే విరుచుకుపడితే తమకు గౌరవమేముంటుందని గంటా వర్గీయులు మండిపడుతున్నారు.

    తన నిరసనను వ్యక్తం చేయడంలో భాగంగా గురువారం ఉదయం గంటా వర్గీయులు విమానాశ్రయంలో చంద్రబాబు వీడ్కోలుకు వెళ్లలేదు. గురువారం ఉదయం దసపల్లా హోటల్‌లో జరిగిన నియోజక వ ర్గ స్థాయి సమీక్ష సమావేశాలకు కూడా వీరు డుమ్మా కొట్టారు. అయ్యన్నకు వ్యతిరేకంగా గురువారం మధ్యాహ్నం గంటా శ్రీనివాసరావు ఇంట్లో సమావేశమైన ఆయన అనుచరులు అయ్యన్నకు వ్యతిరేకంగా మంతనాలు జరిపారు.

    పార్టీ పరిశీలకుడిగా వచ్చిన నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ కూడా ఈ సమావేశంలో పాల్గొని గంటా వర్గీయులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయ్యన్నపాత్రుడుపై పార్టీ కఠినంగా వ్యవహరించకుంటే తాము క్రీయాశీలంగా వ్యవహరించలేమని గంటా స్పష్టం చేసినట్టు తెలిసింది. పారిశ్రామిక వేత్తలు, రియల్టర్లు గంటాతో ఉండగా, నిజమైన తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు, బీసీలు అయ్యన్నతో ఉండడంతో  పార్టీ అధిష్టానానికి దిక్కుతోచడం లేదు. అయ్యన్నపై ఏమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే బీసీలకు అన్యాయం చేశామనే భావన ప్రజల్లోకి వెళుతుందని పార్టీ నేతలు భయపడుతున్నారు.

    గంటా వర్గీయులను శాంతిపజేసేందుకు వెళ్లిన నారాయణ కూడా వారికి నిర్దిష్టమైన హామీని ఇవ్వలేకపోయారు. ప్రజాగర్జన సభలో అయ్యన్న అలా మాట్లాడి ఉండాల్సింది కాదని చంద్రబాబు పేర్కొనడంతో గంటా వర్గం కాస్త  ఊరట చెందింది. కానీ గంటా వర్గం గ్రూపు రాజకీయాలను అయ్యన్న ప్రశ్నిస్తున్నారు. పార్టీలో చేరిన రెండు రోజులకు గ్రూపులు కట్టి అధిష్టానాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్న గంటాతో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరిస్తున్నారు.

    గంటా వర్గం చేరిక ద్వారా పార్టీకి మేలు జరగకపోగా ఉన్న పరువు పోయిందని మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల మందితో జరగాల్సిన గర్జన సభకు 30 వేల మంది కూడా హాజరుకాకపోవడం గంటా వర్గీయులు వైఫల్యంగా చూపించే ప్రయత్నం జరుగుతోంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement