దిబ్బరొట్టె.. వదిలితే ఒట్టే

Dibba Rotte Is Top In Godavari Foods - Sakshi

గోదావరి రుచుల్లో పాలకొల్లు రొట్టెకూ అగ్రస్థానం

రుచిలో మేటి.. సినిమా వాళ్లకీ భలే ప్రీతి  

కాగితం కంటే పల్చగా.. నాన్‌స్టిక్‌ పెనంలో నూనె వేయకుండా కాల్చే తెల్ల దోసెలు తినడానికి అలవాటు పడిన వారికి పాలకొల్లు దిబ్బరొట్టె గురించి చెబితే కడుపు నిండిపోతుందేమో. ఇంత మందాన, ఎర్రగా కాలిన ఆ దిబ్బ రొట్టె రుచే వేరు. బొగ్గుల కుంపటిపై పాత కాలం మూకుడు పెట్టి.. అందులో పిండివేసి.. దానిపై మూతవేసి.. ఆపైన ఎర్రటి నిప్పులు వేసి దోరగా కాల్చే మినప రొట్టెను ఓసారి రుచి చూస్తే.. లొట్టలేసుకుని మరీ తినాల్సిందే. 

సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమ గోదావరి పాలకొల్లు పేరు చెప్పగానే గుర్తొచ్చేది పంచారామ క్షేత్రాల్లో ఒకటైన క్షీరా రామలింగేశ్వరస్వామి క్షేత్రం. ఈ ప్రాంతం ఎందరో కళామతల్లి ముద్దుబిడ్డలకు జన్మస్థానం. నిప్పులపై కాల్చే మినప దిబ్బరొట్టెకూ పాలకొల్లు ప్రసిద్ధి. దీనిని ఒక్కసారి రుచి చూసిన వారు మళ్లీ మళ్లీ తినాలనుకుంటారు. ఇతర జిల్లాల నుంచి పాలకొల్లు వచ్చే ప్రతి ఒక్కరూ ‘పాలకొల్లు దిబ్బరొట్టె దొరికేదెక్కడ’ అని అడ్రస్‌ అడిగి మరీ వెళ్లి తింటుంటారు. పట్టణంలోని మారుతి థియేటర్‌ క్యాంటీన్‌లో కాల్చే దిబ్బరొట్టె గోదావరి జిల్లాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. చింతామణి చట్నీ (శనగ పిండిని ఉడికించి.. తాలింపు వేసిన చట్నీ)తో ఆ రొట్టెను తింటే నాలుక చిమచిమలాడాల్సిందే. 

ఇలా కాలుస్తారు..
ముందుగా బొగ్గుల పొయ్యి (కుంపటి)లో బొగ్గులను వేసి నిప్పు రాజేస్తారు. దానిపై పాత కాలం నాటి మూకుడు పెట్టి అందులో కొంచెం నూనె వేస్తారు. ఆ తరువాత రవ్వ కలిపిన మినప పిండిని వేసి దానిపై మూత పెడతారు. ఆ మూతపై మరికొన్ని నిప్పులు వేసి రొట్టెల్ని కాలుస్తారు. ఒక్కో రొట్టె కాలడానికి సుమారు 20 నిమిషాలు పడుతుంది.

వారంతా రుచిచూశారు..
పాలకొల్లు వచ్చిన ఏ సినిమా నటుడైనా మారుతీ హాల్‌ క్యాంటీన్‌కు వెళ్లాల్సిందే. ఈ థియేటర్‌ ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణకు చెందినది. ఆయన పాలకొల్లులో ఏటా లలిత కళాంజలి నాటకోత్సవాలు నిర్వహించేవారు. ఈ కార్యక్రమాలకు పెద్దఎత్తున సినిమా నటులు హాజరయ్యేవారు. వారంతా ఇక్కడి దిబ్బరొట్టెను లొట్టలేసుకుని తినేవారు. మెగాస్టార్‌ చిరంజీవి మొదలుకొని ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు, ధవళ సత్యం, రవిరాజా పినిశెట్టి వంటి వారంతా ఈ దిబ్బరొట్టె రుచి చూసిన వారే.

నిత్యం 500 రొట్టెలకు పైనే..
ప్రతిరోజూ ఇక్కడ సుమారు 30 కేజీలు మినప్పప్పు నానబెడతారు. రోజుకు 500 రొట్టెలు పైనే అమ్ముతుంటారు. ఒక్కో రొట్టె ధర రూ.30. సగం రొట్టె ధర రూ.15. బొగ్గుల పొయ్యి (నిప్పుల కుంపటి) పైనే వీటిని కాలుస్తారు. ఉదయం 6 గంటలు మొదలు రాత్రి 9 గంటల వరకూ ఎప్పుడు చూసినా 20 పొయ్యిలపై వీటిని కాలుస్తూనే ఉంటారు. రొట్టె తినాలంటే నిప్పులపై  కాలేవరకూ కనీసం అరగంట సేపు వేచి ఉండాల్సిందే. సెల్ఫ్‌ సర్వీస్‌ కావడం వల్ల ఈ క్యాంటీన్‌కు వచ్చే ప్రముఖులు, సామాన్యులు సైతం కార్లలోను, రోడ్డుపైనే నిలబడి భుజిస్తుంటారు. ఇప్పుడు పాలకొల్లులో వివిధ ప్రాంతాల్లో దిబ్బరొట్టె తయారు చేసే హోటళ్లు వెలిశాయి. అయితే, మారుతీ క్యాంటీన్‌లో వేసే దిబ్బరొట్టెకు ఉన్నంత గుర్తింపు వీటికి దక్కలేదు.

ఆరు దశాబ్దాల చరిత్ర
మారుతి థియేటర్‌ నిర్మించి 60 సంవత్సరాలు దాటింది. అప్పటినుంచీ ఇక్కడ దిబ్బరొట్టె ప్రాముఖ్యత సంతరించుకుంది. మా చిన్నతనంలో రొట్టెను నాలుగు ముక్కలు చేసి అమ్మేవారు. ఈ క్యాంటీన్‌ను 8 సంవత్సరాల క్రితం లీజుకు తీసుకున్నాను. ఇక్కడి రొట్టెకు గల ప్రాముఖ్యత దృష్ట్యా దిబ్బరొట్టెల్ని వేస్తూనే ఉన్నాం.
– మట్టా విజయభాస్కర్, క్యాంటీన్‌ యజమాని 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top