అమ్మవు నీవే అఖిల జగాలకు.. 

Devi Navaratri celebrations In Kota Durgamma Temple In Srikakulam - Sakshi

బాలాత్రిపుర సుందరిదేవిగా నీలమణి దుర్గ

భక్తులతో కిటకిటలాడిన ఆలయం

వాహనాలకు ప్రత్యేక పూజలు

అమ్మలగన్న అమ్మ.. ముగురమ్మల మూలపటమ్మ కొలువుదీరింది. దేవీ నవరాత్రులు ప్రారంభమైన సందర్భంగా ప్రతి ఊరిలో ప్రతి వాడలో అమ్మవారిని నెలకొల్పారు. పాలకొండలోని కోటదుర్గమ్మను దర్శించేందుకు తొలి రోజే అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మంత్రులు కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ దర్శించిన వారిలో ఉన్నారు. ఎమ్మెల్యే కళావతి అమ్మవారికి పట్టు వస్త్రాలు  సమర్పించారు. పాలకొండ కోటదుర్గమ్మ, పాతపట్నం నీలమణిదుర్గ, రాజాం నవదుర్గమ్మ, ఇచ్ఛాపురం స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. మరోవైపు గ్రామాల్లోనూ ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేసి దేవీ విగ్రహాలను ప్రతిష్టించారు. తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించేలా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు.
– సాక్షి నెట్‌వర్క్‌   

సాక్షి, పాతపట్నం(శ్రీకాకుళం) : దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పాతపట్నం నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆదివారం తెల్లవారు జామున నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. తొలిరోజు అమ్మవారిని బాలాత్రిపురసుందరిదేవిగా ప్రత్యేకంగా అలంకరించారు. హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా  ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎన్‌.కుమారస్వామి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.   

కరుణించమ్మా కోటదుర్గమ్మ
 కోటదుర్గమ్మ.. కరుణించు మాయమ్మ అన్న నామస్మరణతో పాలకొండ పట్టణం మారుమోగింది. ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం కోటదుర్గమ్మ దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారు జామున నాలుగు గంటలకు స్థానిక భక్తులు అమ్మవారి మాలధారణ కార్యక్రమంతో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 5 సమయంలో మూహూర్తపురాటను అర్చకులు దార్లపూడి లక్ష్మిప్రసాదశర్శ వేయించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి తొలిపూజ చేసి ఉత్సవాలను ప్రారంభించారు. 

పోటెత్తిన భక్తజనం....
ఏడాదిలో ఒక్కసారి అమ్మ నిజరూపదర్శనం చేసుకుంటే జీవితకాల పుణ్యం చేకూరుతుందన్న నమ్మకంతో భక్తులు దేవస్థానానికి పోటెత్తారు. తొలిరోజు సుమారు 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఈవో టి.వాసుదేవరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.ఛి

వారాహి అమ్మవారికి విశేష పూజలు 
జలుమూరు: దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగంలో వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు  అమ్మవారిని వారాహి అమ్మవారిగా అలంకరించారు. ముందుగా అర్చకులు గణపతి పూజతో ప్రారంభించి ప్రత్యేక అర్చనలు చేశారు. మహిళలు కుంకమ పూజలు చేశారు.


పూజలందుకుంటున్నవారాహి అమ్మవారు 

శ్రీచక్రపురంలో ప్రత్యేక పూజలు
ఎచ్చెర్ల క్యాంపస్‌: మండలంలోని కొంచాలకూర్మయ్యపేటలోని శ్రీచక్రపురంలో దేవీ శరన్నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాజరాజేశ్వరి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.ఎచ్చెర్ల క్యాంపస్‌: మండలంలోని కొంచాలకూర్మయ్యపేటలోని శ్రీచక్రపురంలో దేవీ శరన్నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాజరాజేశ్వరి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
నగిరికటకంలో దసరా సరదా 

జలుమూరు: దసరా ఉత్సవాలు సంసృతీ సంప్రదాయాలకు ప్రతీకలని నగిరికటకం ప్రాథమికోన్నత పాఠశాల హెచ్‌ఎం పైల సూర్యనారాయణ అన్నారు. దేవీ నవరాత్రి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ఆదివారం పాఠశాల విద్యార్థులతో సంప్రదాయ వస్త్రధారణ, ప్రత్యేక అలంకరణలతో ప్రదర్శన చేయించారు. వీధివీధికీ వెళ్తూ ‘దసరాకు వచ్చాము విస సలు వద్దు..’ అంటూ పాటలు పాడారు. వెదురు కర్రతో బాణాలు చేసి పువ్వులు,పత్రితో కోలాటాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె.నీలవేణి, ఎం.స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.

శైలపుత్రికగా స్వేచ్ఛావతి అమ్మవారు 
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం గ్రామదేవత  స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేదపండితులు లక్ష్మికాంత్‌పాఢీ ఆధ్వర్యంలో స్వేచ్ఛావతి అమ్మవారికి ప్రత్యేక పూజలు, దీపారాధన నిర్వహించారు. దేవీ నవరాత్రి పూజ మండపంలో మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ పిలక రాజలక్ష్మి, పలువురు భక్తులు సామూహిక దీపారాధన కార్యక్రమంలను  నిర్వహించారు. దేవీ నవరాత్రులు ప్రారంభంలో భాగంగా తొలిరోజు అమ్మవారు శైలపుత్రికగా భక్తులకు దర్శనమిచ్చారు. వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్‌ స్వేచ్ఛావతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

భక్తిశ్రద్ధలతో మాలధారణ
నరసన్నపేట: స్థానిక పైడితల్లి ఆలయం వద్ద ఆదివారం దేవీ మాలధారణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. 56 మంది భక్తులు భవానీ మాల ధరించారు. పైడితల్లి ఆలయ అర్చకులు లకు‡్ష్మడు ప్రత్యేక పూజలు చేశారు. తొమ్మిది రోజుల మాలధారణ చేసిన అనంతరం విజయవాడ దుర్గ గుడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటామని నిర్వాహక కమిటీ ప్రతినిధి గూర్జా రమణ తెలిపారు.

అంబరాన్నంటిన సంబరాలు
పాలకొండ రూరల్‌: దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకుని పాలకొండ పట్టణంలోని చిన్న, పెద్ద గొల్ల వీధులకు చెందిన ప్రజలు సామూహిక సంబరాలు చేపట్టారు. ఆదివారం సాయింత్రం పెద్ద ఎత్తున మహిళలు æముర్రాటలతో ముందుకు సాగారు. తొలుత ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం కోటదుర్గమ్మను దర్శించుకుని అక్కడి నుంచి పాలకొండ– వీరఘట్టం రహదారిలోని గారమ్మ వద్దకు చేరుకుని మొక్కులు చెల్లించారు. 

నవదుర్గా నమోస్తుతే..! 
రాజాం : రాజాం బస్టాండ్‌ ఆవరణలోని నవదుర్గామాత ఆలయంలో ఎమ్మెల్యే కంబాల జోగులు ప్రత్యేక పూజలు చేసి శరన్నవరాత్రి వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఈఓ శ్యామలరావు, అర్చకులు వేమకోటి రవికిరణ్‌శర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భగుడిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు అనంతరం జ్ఞాన సరస్వతీ ఆలయంలో పూజలు చేశారు. ఈ ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా చేయాలని దేవదాయశాఖ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో పార్టీ రాజాం టౌన్‌ కన్వీనర్‌ పాలవలస శ్రీనివాసరావు, రాజాం మండలం కన్వీనర్‌ లావేటి రాజగోపాలనాయుడు. యూత్‌ కన్వీనర్‌ వంజరాపు విజయ్‌కుమార్, గొర్లె బ్రదర్స్, పారంకోటి సుధ, ఆసపు సూర్యం తదితరులు పాల్గొన్నారు. 

నవదుర్గకు ప్రత్యేక పూజలు
రాజాం సిటీ: స్థానిక నవదుర్గ అమ్మవారి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవ మూర్తిని మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ పి.శ్యామలరావు, ట్రస్టీ వానపల్లి నర్సింగరావు, పర్యవేక్షకులు కూరాడ వెంకటరావు, భక్తులు పాల్గొన్నారు. 


 మంత్రి కృష్ణదాస్‌కు అమ్మవారి చిత్రపటం అందిస్తున్న ఎమ్మెల్యే కళావతి 

అమ్మవారి సేవలో మంత్రులు, ఎమ్మెల్యేలు..
మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యరనారాయణ, ఝాన్సీ దంపతులు, రోడ్లు భవనాల శాఖ మంత్రి దర్మాన కృష్ణదాస్, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, వైఎస్సార్‌ సీపీ ముఖ్య నాయకులు మజ్జి శ్రీని వాసరావు, తమ్మినేని చిరంజీవినాగ్‌ తదితరులు కోటదుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. వీరికి స్థానిక ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, దేవదాయశాఖ అధికారులు సాదర స్వాగతం పలికారు. అమ్మవారి జ్ఞాపికలు అందించారు. వీరితో పాటు వైఎస్సార్‌ సీపీ రాష్ట్రకార్యదర్శి పాలవలస విక్రాంత్, ఆర్డీవో టి.వి.ఎస్‌.కుమార్, డీఎస్పీ పి.రారాజు ప్రసాద్, తహసీల్దార్‌ జల్లేపల్లి రామారావు, నగర కమిషనర్‌ వై.లిల్లీపుష్పనాథంతోపాటు ఉత్సవకమిటీ సభ్యులు, ఇతర జిల్లాకు చెందిన అధికారులు అమ్మవారిని దర్శించుకున్నారు.

భారీ బందోబస్తు...
వేలాదిమంది భక్తులు తరలిరావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఐ ఆదాం నేతృత్వంలో పాలకొండ, రేగిడి, సంతకవిటి, వీరఘట్టం, ఎస్‌ఐలు, సిబ్బందితోపాటు పలు కళాశాల సీపీవోలు స్వచ్ఛందంగా సేవలుందించారు. మధ్యాహ్నం పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top