బతుకు బండికి భరోసా

Deputy Speaker Kona Raghupathi Speech In Guntur - Sakshi

ఆటో డ్రైవర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ల ఫిట్‌ నెస్, బీమా, మరమ్మతులకు ఆర్థిక సాయం 

ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేత

ఆర్థిక పరిస్థితి బాగోలేదు.. బండికి బ్రేక్‌ ఎలా చేయించాలి..? బీమా ప్రీమియం కోసం ఎక్కడ అప్పు చేయాలి?.. అన్న ఆందోళన అవసరం లేదు.. ఇక నుంచి బ్రేక్‌ చేయించలేదని.. బీమా ప్రీమియం చెల్లించలేదని పోలీసులు, రవాణాశాఖ అధికారులు జరిమానాలు విధిస్తారన్న భయం అసలే అవసరంలేదు.. ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్ల కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చుతూ ‘వైఎస్సార్‌ వాహన మిత్ర’ పథకాన్ని అమలులోకి తెచ్చారు. ఈ పథకం కింద సొంత వాహనం ఉన్న ప్రతి డ్రైవర్‌కు రూ.10 వేల ఆర్థిక సాయం పంపిణీ పథకం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం ప్రారంభోత్సవం శుక్రవారం జరిగింది. 

సాక్షి, గుంటూరు: ‘వాహనాలకు బ్రేక్‌ చేయించుకోలేక.. బీమా ప్రీమియం చెల్లించలేక.. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆటో, మ్యాక్సీ క్యాబ్, ట్యాక్సీల డ్రైవర్లు ఇకపై పోలీసులు, రవాణా శాఖ అధికారులకు భయపడుతూ తిరగాల్సిన అవసరం లేదు. డ్రైవర్ల గౌరవాన్ని పెంచడం కోసమే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘వైఎస్సార్‌ వాహన మిత్ర’ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా వాహనాలకు ఫిట్‌నెస్, బీమా, మరమ్మతుల కోసం ఏటా రూ.10 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది’ అని శాసనసభ డెప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి అన్నారు. గుంటూరు నగరంలోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శుక్రవారం జరిగిన వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం ప్రారంభోత్సవంలో కోన రఘుపతి, మత్స్య, పశు సంవర్ధక, మార్కెటింగ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, అన్నాబత్తు్తని శివకుమార్, కిలారి వెంకట రోశయ్య, విడదల రజని, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు, కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా అధ్యక్షతన జరిగిన సభలో కోన రఘుపతి మాట్లాడుతూ కుల, మత, రాజకీయాలకు అతీతంగా పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ ప«థకాలు అమలుచేస్తున్నారని, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ లను నాలుగు నెలల్లో అమలు చేసిన ఘనత ఆయనకే దక్కిం దని అన్నారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా రూ.400 కోట్లు కేటాయించారని తెలిపారు. 

రాష్ట్రంలో జనరంజక పాలన
మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనదైన శైలిలో జనరంజకమైన పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో 90 శాతం నాలుగు నెలల వ్యవధిలో అమలు చేసి చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. అవినీతి రహిత పారదర్శకమైన పాలన అందిస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపేదిశగా జగన్‌ ముందుకు సాగుతున్నారని వివరించారు. చంద్రబాబు పాలనలో ప్రజాసంక్షేమం విస్మరిం చిన టీడీపీ నాయకులు అనేక అక్రమాలు, అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని గుర్తుచేశారు. రాష్ట్రాభివృద్ధిని విస్మరించి సంక్షేమ పథకాలను పక్కన పెట్టి అక్రమాలతో రాష్ట్ర ఖజా నాను ఖాళీ చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిం దని విమర్శించారు. సామాన్యుల కోసం రైతు బజార్ల ద్వారా కిలో ఉల్లిని రూ.25లకే అందిస్తున్నామని అన్నారు.

ఆటో డ్రైవర్ల మేలు సీఎం లక్ష్యం
ఎంపీ నందిగం సురేష్‌ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల మేలు కోసం సీఎం అనుక్షణం ఆలోచిస్తున్నారని అన్నారు. మద్యం తాగి వాహనాలను నడపవద్దని, ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చాలని డ్రైవర్లకు సూచించారు. ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ ప్రతి కుటుం బంలో సంతోషం నింపడమే లక్ష్యంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని వివరించారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల కష్టాలను దగ్గరగా చూసి వారికి ఇచ్చిన హామీలను అమలు చేసిన నాయకుడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చూసి ఓవర్వలేక చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ రాజకీయ వ్యవస్థలో ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న నాయకుడు సీఎం జగన్‌ అని కొనియాడారు. 

కులమతాల తేడా లేని పాలన
ఎమ్మెల్యే విడదల రజని మాట్లాడుతూ కులం, మతం, ప్రాంతం, రాజకీయాలకు తావులేకుండా అర్హులైతే చాలు అన్న నినాదంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన ఉందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ మాట్లాడుతూ డ్రైవర్లకు రూ.10 వేల ఆర్థిక సహాయంతో ఎంతో మేలు చేకూరనుందని అన్నారు. కలెక్టర్‌ ఐ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ మాట్లాడుతూ సెప్టెంబర్‌ 14న ప్రారంభమైన ఈ పథకంలో జిల్లా వ్యాప్తంగా 14,312 ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లు  దరఖాస్తు చేసుకోగా 13,992 మందిని అర్హులుగా గుర్తించి ఆర్థిక సాయం చేస్తున్నామని వివరించారు.

ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఏలూరులో జరిగిన ఆర్థిక ససాయం ప్రారంభ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగాన్ని చూసి డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. ప్రసంగం ముగిం పులోనే వైఎస్‌ జగన్‌ కంప్యూటర్‌లో బటన్‌ ప్రెస్‌ చేయడంతోనే బ్యాంకు ఖాతాల్లో సెకన్ల సమయంలోనే నగదు జమ కావటంతో ఆటో డ్రైవర్లు సంబర పడిపోయారు. అనంతరం లబ్ధి దారులకు ప«థకం కింద మంజూరు పత్రాలను అందజేశారు. జాయింట్‌ కలెక్టర్‌ దినేష్‌కుమార్, జేసీ–2 సత్యనారాయణ, డీటీపీ ఇవ్వల మీరా ప్రసాద్, ఆర్డీఓ భాస్కరరెడ్డి, ఆర్టీఓలు రమేష్, రామస్వామి, అధికారులు అధిక సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లబ్ధిదారులకు రాసిన లేఖను డీటీసీ మీరా ప్రసాద్‌ చదివి వినిపిం చారు. అనంతరం వైఎస్సార్‌ వాహన మిత్ర లబ్ధి దారులకు డెప్యూటీ స్పీకర్, మంత్రి, ప్రజాప్రతినిధులు గుర్తింపు పత్రాలను అందజేశారు.

దరఖాస్తు గడువు పెంపు
లైసెన్సు ఉండి కుటుంబ సభ్యుల పేరుతో ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ ఉన్న వారందరూ వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం లబ్ధి పొందడానికి అర్హులు. ఇప్పటి వరకూ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోలేని వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. వారు ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది.  

మా బాగోగులు పట్టించుకున్న సీఎం జగన్‌
నేను 30 ఏళ్లుగా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నా. ఏ ఒక్కరూ మా బాగోగుల గురించి ఆలోచించిన దాఖలాలు లేవు. మొట్టమొదటి సారిగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరే మా కష్టాలను గుర్తించారు. ఎన్నికలకు ముందు మాకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న రూ.10వేల ఆర్థిక సాయం మాకు ఎంతగానో తోడ్పడుతుంది.  – ఖాసీం ఖాన్, గుంటూరు

సీఎంకు కృతజ్ఞతలు
నేను ఆటో నడుపుతూ కుమారుడిని ఇంటర్, కుమార్తెను తొమ్మిదో తరగతి చదివిస్తున్నా. ఆటోకు ఫిట్‌నెస్‌ చేయించుకోవడం కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఓ వైపు పిల్లల చదువులు, మరోవైపు బీమా, రోడ్‌ ట్యాక్స్‌లు, ఫిట్‌నెస్‌ చార్జీల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి. మా కష్టాలను చూసి ఆర్థిక సాయం చేస్తున్న జగనన్నకు కృతజ్ఞతలు. ఆటో డ్రైవర్లందరం రుణపడి ఉంటాం.  – కమల, గుంటూరు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top