బంకుల్లో నిలువు దోపిడీ.!

Department Of Weights And Measures Not Taking Any Action Against Petrol Bunks In Vizianagaram  - Sakshi

నిలువ నీడలేక మాడిపోవాలి. గుక్కెడు నీళ్లు దొరక్క అల్లాడిపోవాలి. భద్రత లేక బంకుల్లో బిక్కుబిక్కుమనాలి. ఇంధనం తక్కువ పోసినా.. చిల్లర దోపిడీ సాగుతున్నా భరించాలి. పెట్రోలు బంకుల్లో కొలతల్లో మోసాలు సాగిపోతున్నాయి. అధికారుల దాడులు అరుదై పోతున్నాయి. ఫలితంగా వినియోగదారుల జేబుకు చిల్లులు పడుతున్నాయి.

సాక్షి, విజయనగరం : పెట్రోలు బంకుల్లో కొలతల్లో మోసాలకు అంతులేకపోవటంతో వినియోగదారులు దోపిడీకి గురవుతున్నారు. బంకుల్లో కనీసం తాగునీరు, మరుగుదొడ్లు, నీడ లేకపోయినా అధికారులు పట్టించుకోవటంలేదు. నిర్ణీత మొత్తానికి డిజిటల్‌ మీటర్లు ఫిక్స్‌ చేసినా.. ఇంధనం పోసే సమయంలో చేతివాటం చూపుతున్నారు. లీటరుకు కనీసం 25 మిల్లీలీటర్లు నుంచి 100 మిల్లీలీటర్లు వరకు తరుగు వస్తుందని వినియోగదారుల ఆరోపణ.

ఇలా ప్రతీ బంకులో రోజూ పదుల లీటర్లలోనే దోపిడీ యథేచ్ఛగా సాగిపోతోంది. మరికొన్ని చోట్ల చిల్లర దోపిడీ జరుగుతోంది. వాహన టైర్లలో గాలి ఒత్తిడి సరిగా లేకపొతే ఇంధనం అధికంగా వినయోగమవుతోంది. ఇంధన వృథాను అరికట్టేందుకు గాలి నింపే యంత్రాలను కచ్చితంగా నెలకొల్పాలి. ఎక్కడా వీటి జాడే లేదు. చాలా చోట్ల స్పీడ్, పవర్‌ పెట్రోలు అంటూ... లీటరుకు రూ.5 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.

కానరాని భద్రత
జిల్లా వ్యాప్తంగా 98 పెట్రోలు బంకులున్నాయి. వీటిలో కనీస భద్రత చర్యలు తీసుకోవటం లేదు. బంకుల్లో అలంకార ప్రాయంగా ఇసుక బకెట్లు, అగ్ని నివారణ పరికరాలు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల మరుగుదొడ్లు నిర్వహణ ఘోరంగా ఉండటంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. బంకుల్లో సెల్‌ఫోన్లను నిషేధించినా అమలు కావటంలేదు. సాక్షాత్తు సిబ్బంది ఫోన్లను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. పెట్రోలు కొట్టే సమయంలో మొబైల్‌ వాడితే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. చెత్త డబ్బాలు సైతం కానరావు. తూకాల్లో తేడాలపై జిల్లా అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top