చెరకు రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు అదనంగా టన్నుకు రూ.365 చెల్లిస్తున్నామని...
శేరినరసన్నపాలెం (హనుమాన్‌జంక్షన్ రూరల్), న్యూస్‌లైన్ : చెరకు రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు అదనంగా టన్నుకు రూ.365 చెల్లిస్తున్నామని డెల్టా సుగర్స్ కర్మాగారం సీఈవో ఎం. సుబ్బరాజు తెలిపారు. బాపులపాడు మండలం శేరినరసన్నపాలెంలోని డెల్టా సుగర్స్ కర్మాగారంలో 2013-14వ సంవత్సరం క్రషింగ్‌ను ఆయన గురువారం ప్రారంభించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడారు. చెరకు సాగును ప్రోత్సహించడానికి రైతులకు అవసరమైన సామగ్రి, ఎరువులను సబ్సిడీపై పంపిణీ చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం చెరకు ధర టన్నుకు రూ.2,125 మద్దతు ధర ప్రకటించగా, రాష్ట ప్రభుత్వం కొనుగోలు పన్ను రూ.60తో కలిపి రూ.2,185గా నిర్ణయించామని పేర్కొన్నారు. రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మార్కెట్టులో పంచదార ధర తక్కువగా ఉన్నప్పటికీ అదనంగా టన్నుకు రూ.365 కలిపి రూ.2,550 చొప్పున రైతులకు చెల్లిస్తామన్నారు.
జనరల్ మేనేజరు ఎం.రాజబాబు, కేన్ మేనేజర్ కె.వెంకట్రావు, ఆంధ్రప్రదేశ్ చెరకు ఉత్పత్తిదారుల సంఘం కార్యదర్శి నండూరు సత్యవెంకటేశ్వరశర్మ, హనుమాన్ సుగర్స్ మాజీ చైర్మన్ గుండపనేని ఉమవరప్రసాద్, రేమల్లె సర్పంచి కలపాల జగన్మోహనరావు, వేలేరు మాజీ సర్పంచి వేములపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.