బాబు వంచన సహించం | Deception launches | Sakshi
Sakshi News home page

బాబు వంచన సహించం

Jul 27 2014 2:27 AM | Updated on Sep 2 2017 10:55 AM

రుణమాఫీ విషయంలో అటు రైతులు, ఇటు డ్వాక్రా మహిళలను సీఎం చంద్రబాబు వంచించడాన్ని సహించబోమని, వారికి న్యాయం జరిగేంతవరకు ఉద్యమిస్తామని నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు డాక్టర్ అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు.

సాక్షి, నెల్లూరు: రుణమాఫీ విషయంలో అటు రైతులు, ఇటు డ్వాక్రా మహిళలను సీఎం చంద్రబాబు వంచించడాన్ని సహించబోమని, వారికి న్యాయం జరిగేంతవరకు ఉద్యమిస్తామని నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు డాక్టర్ అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. ఎన్నికల సందర్భంగా టీడీపీ అధినేత ఇచ్చిన రుణమాఫీ హామీని పూర్తిగా అమలు చేయనందుకు నిరసనగా వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు శనివారం గాంధీబొమ్మ సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. చంద్రబాబు వ్యతిరేక నినాదాలతో నిరసన కార్యక్రమం హోరెత్తింది. రుణ మాఫీని పూర్తిస్థాయిలో అమలు చేయడంతో పాటు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని పార్టీ శ్రేణులు డిమాండ్ చేశాయి. సిటీ ఎమ్మెల్యే అనిల్ మాట్లాడుతూ చంద్రబాబు హామీలను తుంగలో తొక్కి రైతులు, మహిళలను వంచించాడన్నారు. రూ.1.5 లక్షకు పైగా రుణం తీసుకున్న రైతులను దొంగలని సంబోధించడం బాబు దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. మోసం మాటలు చెప్పడం, వంచించడం జగన్‌కు తెలియదన్నారు. లేకపోతే ఇంతకు రెట్టింపు హామీలు ఇచ్చి అధికారం దక్కించుకొనేవారమన్నారు. ఎర్రచందనం అమ్మి రుణమాఫీ చేస్తానంటూ బాబు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నాడని అనిల్ విమర్శించారు.
 
 చందనం అమ్మితే వచ్చేది రూ.300 కోట్లు మాత్రమేనన్నారు.  ఇప్పటికైనా చంద్రబాబు రుణమాఫీ హామీని నిలబెట్టుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో తొలిసంతకం పవిత్రమైనదన్నారు. అప్పట్లో ఎన్టీఆర్ మద్యపాన నిషేధాన్ని తొలిసంతకంతో అమలు చేస్తే, దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్ ఉచిత విద్యుత్, విద్యుత్ బకాయిలు రద్దు చేసి తొలిసంతకం విలువ పెంచారన్నారు. అయితే తొలిసంతకంతో రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు కమిటీతో సరిపెట్టి దాని పవిత్రతను మంటగలిపారన్నారు. ఇటు రాష్ట్ర, అటు కేంద్ర ప్రభుత్వాలు రుణమాఫీ చేయక ప్రజలను వంచించడం దారుణమన్నారు.
 
 తాము ప్రజల పక్షాన నిలిచి ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. నగర డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల హామీలన్నింటినీ తుంగలో తొక్కారన్నారు. గంటపాటు జరిగిన ఆందోళనతో గాంధీబొమ్మ సెంటర్‌లో ట్రాఫిక్ స్తంభించింది.
 
 కార్యక్రమంలో కార్పోరేటర్లు వేలూరు సుధారాణి, ఓబిలి రవిచంద్ర, దామవరపు రాజశేఖర్, మాదాల ధనమ్మ, ఊటుకూరు మాధవయ్య, ఎ.బాలకోటేశ్వరరావు, జి.నాగరాజు, వందవాసి పద్మ, ప్రశాంత్‌కుమార్, అశోక్, ఎస్‌కే సల్మా, పార్టీ నేతలు లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సంక్రాంతి కల్యాణ్, మునీర్‌సిద్ధిక్, దార్ల వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, పోలంరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి, నాగిరెడ్డి, సుధీర్, సుభాన్, వెంకటేశ్వర్లు, మురళీకృష్ణ, శ్రీనివాసులు, సురేష్, నరేంద్ర, సుధీర్‌బాబు, ఆనంద్, జెస్సీ, సుభాషిణి, రజని, హుసేనమ్మ, శ్రీదేవి, మనమ్మ తదితరులు పాల్గొన్నారు.
 
 రుణమాఫీ గందరగోళం..
 రైతుల రుణమాఫీపై కేబినెట్ నిర్ణయం తీసుకుందని ప్రకటించారు.అధికార పార్టీ నేతలు సంబరాలు కూడా చేసుకున్నారు. కానీ ఎప్పుడు, ఎలా చేస్తారనేది చెప్పడం లేదు.బ్యాంకులకు వెళితే అక్కడ అధికారులు మాకు ఎటువంటి మార్గదర్శకాలు రాలేదంటున్నారు.
 కారవళ్ల రవీంద్రారెడ్డి, నల్లపరెడ్డిపల్లి, ఆత్మకూరు
 
 ఆచరణకు నోచుకోని హామీ
 రైతు రుణమాఫీపై టీడీపీ నేతలు రకరకాల అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. విడ్డూరమైన ప్రతిపాదనలు ముందుకు తెస్తున్నారు. ఎర్రచందనం చెట్లను తాకట్టు పెడతారట. నదుల్లో తవ్వే ఇసుకపై సెస్ వేస్తారట. ఆచరణ సాధ్యంకాని ప్రతిపాదనలు తెరమీదకు తెచ్చి మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
  లక్ష్మీనారాయణరెడ్డి, గండ్లవేడు, ఆత్మకూరు
 
 పంటల బీమా నష్టపోయాం
 సీఎం చంద్రబాబునాయుడు హామీ ని నమ్మి పాత రుణాలు బ్యాంకులకు చెల్లించలేదు. రుణాలు సకాలంలో చెల్లించకపోవడంతో పం టల బీమా నష్టపోయాం. గడువులోపు వడ్డీ కట్టి ఉంటే డబ్బులు మిగిలి ఉండేవి. వడ్డీ శాతాన్ని పెంచారు. దీంతో మరింత నష్టం .జరిగింది.
  గణేశం రమేశ్‌రెడ్డి, నాగులవరం సర్పంచ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement