మృత్యువుకు దొరికారు | Death were taken | Sakshi
Sakshi News home page

మృత్యువుకు దొరికారు

Dec 4 2014 12:38 AM | Updated on Aug 11 2018 8:45 PM

మృత్యువుకు దొరికారు - Sakshi

మృత్యువుకు దొరికారు

బుధవారం ఉదయం 9 గంటలు. కొత్త కారు బయల్దేరింది. చూస్తుండగానే వేగం అందుకుంది.

నిండు జీవితాల్ని బలిగొన్న కొత్త కారు
{బేక్ వేసేందుకు బదులు యాక్సిలేటర్ నొక్కిన డ్రయివర్
వాయువేగంతో దూసుకొచ్చిన వాహనం
ఇద్దరు మృతి... 15 మందికి తీవ్ర గాయాలు
పోలీసుల అదుపులో రావికమతం
మాజీ మండల ఉపాధ్యక్షుడు ఈశ్వరరావు

 
బుధవారం ఉదయం 9 గంటలు. కొత్త కారు బయల్దేరింది. చూస్తుండగానే వేగం అందుకుంది. ఒక్కసారిగా దూసుకొచ్చింది. ఏం జరిగిందో తెలియలేదు... అడ్డొచ్చినవాళ్లందరినీ ఢీకొంది. రహదారి రక్తం చిమ్మింది. ఇద్దరి ప్రాణం గాల్లో కలిసిపోయింది. పదిహేను మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ముచ్చట పడి కొనుక్కున్న కారు మృత్యుపాశమై నిలిచిం ది. కారు నడపడంలో అనుభవ రాహిత్యం నిండుప్రాణాల్ని బలిగొంది. రావికమతంలో టీడీపీ నేత,  మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు గంటా ఈశ్వరరావు కారు నడుపుతూ బ్రేక్‌కు బదులు ఎక్స్‌లేటర్‌ను నొక్కేయడం ఇంతటి విషాదానికి కారణమైంది.
 
రావికమతం : రావికమతం మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు గంటా ఈశ్వరరావు కారు కొన్నారు. భార్యతో కలిసి కారులో బుధవారం ఉదయం చోడవరం బయల్దేరారు. ఇంటికి సమీపంలోనే అడ్డొచ్చిన ఒక ఐస్ పెట్టె వ్యాపారిని తప్పించబోయారు. బ్రేక్ వేయడానికి బదులు యాక్సిలేటర్ నొక్కేయంతో కారు వాయువేగంతో దూసుకుపోయింది. రోడ్డుపై సైకిల్‌పై వెళ్తున్న గుమ్మాళ్లపాడుకు చెందిన డొంకిన పోతురాజు (47)ను ఢీకొంది. అతని తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

అనంతరం ఆటోను బలంగా ఢీకొట్టడంతో అది గాలిలో ఎగిరిపడింది. అందులో ప్రయాణిస్తున్న పిల్లవానిపాలేనికి చెందిన పుప్పాల అప్పలకొండ (62) తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అనంతరం బైక్‌పై వెళ్తున్న మళ్ళ రమణబాబు (52), శీర నూకరాజు (47)లపై నుంచి దూసుకుపోవడంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. సైకిల్, బైక్ నుజ్జునుజ్జయ్యాయి. ఆటోలోని గుమ్మాళ్లపాడుకు చెందిన గొర్లె రాజిబాబు, కోటవురట్ల మండలానికి చెందిన పల్లా రమణ), బంగారుమెట్టకు చెందిన మొల్లి పెంటమ్మ, దొండపూడికి చెందిన పొలుమూరి రాజారావు, మజ్జి అప్పారావు, రావికమతానికి చెందిన ముక్కా సత్తిబాబు, ఆటో డ్రయివర్ రెడ్డి మహేష్, టి.అర్జాపురానికి చెందిన ఒకే కుటుంబంలోని రొంగలి రమణమ్మ, కొండమ్మ, శైతి, నమ్మి రామకృష్ణ, మరుపాకకు చెందిన పుర్రె గణేష్, పెదగొట్టివాడకు చెందిన శీర చినతల్లి, నర్సీపట్నానికి చెందిన డిగ్రీ విద్యార్థిని టి.శ్రావణిలకు తీవ్ర గాయాలయ్యాయి. కొత్తకోట ఇన్‌చార్జి
 సీఐ దాశరథి, ఎస్‌ఐ శిరీష్‌కుమార్, రావికమతం ఎస్‌ఐ సురేష్‌కుమార్ క్షతగాత్రులను నర్సీపట్నం, అనకాపల్లి ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, జిల్లా బీజేపీ నేత గల్లా రాజేశ్వరరావు మృతుల బంధువులను ఓదార్చి క్షతగాత్రులను పరామర్శించారు. కారు యజమాని గంటా ఈశ్వరరావును ఎస్‌ఐ అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement