breaking news
Ishwar Rao
-
కీచక గురువు
విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తన సెల్ఫోన్లు, వీడియో చిత్రీకరణ నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నానంటూ వేధింపులు నిలదీసిన సర్పంచ్, బాధితురాలి బంధువులు నక్కపల్లి: విద్యార్థిని వేధిస్తున్న ఉపాధ్యాయుడిని ఆమె బంధువులు, గ్రామస్తులు నిలదీశారు. మండలంలోని జానకయ్యపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలిలావున్నాయి. ఇదే స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న చినతీనార్లకు చెందిన బాలికపై ఇదే పాఠశాలకు చెందిన ఇంగ్లీష్ టీచర్ ఈశ్వరరావు కొద్దికాలంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. సెల్‌ఫోన్‌తో ఫొటో లు, వీడియోలు తీస్తూ నువ్వంటే నాకు ఇష్టమని చూడకుండా ఉండలేకపోతున్నానంటూ ఇబ్బంది పెడుతున్నాడు. ఉపాధ్యాయుడు కావడంతో భయపడి ఈవిషయాన్ని ఆమె ఎవరికి చెప్పలేదు. ఇతని చేష్టలు రోజురోజుకు శ్రుతిమించిపోతున్నాయి. నిన్ను చూస్తూ బైక్ నడపడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నానని చెప్పేవాడు. అతని బర్త్‌డే కేక్‌పై బాలిక ఫొటోను డిజైన్ చేశాడని వేధిస్తున్నాడని విద్యార్థిని కన్నీటిపర్యంతమైంది. వేధిస్తాడన్న భయంతోనే ఈ విషయం ఎవరికీ చెప్పలేదని ఆమె వాపోయింది. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఆమె తండ్రి వేట నిమిత్తం పూరీ వెళ్లాడు. ఆమె తల్లి వద్ద ఉంటోంది. విద్యార్థిని వేధింపుల విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ ఎరిపల్లి శ్రీను, పెదతీనార్ల సర్పంచ్ కొర్లయ్య, గ్రామ నాయకులు ముసలయ్య తదితరులు పాఠశాలకు వెళ్లి వేధిస్తున్న ఉపాధ్యాయుడిని నిలదీశారు. విద్యాబుద్ధులు నేర్పుతూ కన్నపిల్లలా చూడాల్సింది పోయి ఇలా దుర్బుద్ధితో ప్రవర్తించడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అమ్మాయి బాగా చదువుతుందని దానివల్ల నువ్వంటే నాకిష్టమని చెప్పానని అంతే తప్ప మరో ఉద్దేశం లేదని ఉపాధ్యాయుడు చెబుతున్నాడు. ఫోటోలు, వీడియోలు ఎందుకు తీశారని ప్రశ్నిస్తే పాఠశాలలో స్వచ్ఛభారత్ కార్యక్రమం సందర్భంగా తీశానని తెలిపాడు. ఇలా చేయడం తప్పేనని ఒప్పుకున్నాడు. పాఠశాల హెచ్ఎం నూకరాజుతోపాటు, గ్రామస్తులు అతనిని మందలించారు. అయితే బాదితురాలు మాత్రం ఈశ్వరరావు ఈ పాఠశాలలో పనిచేస్తే తాను ఇక్కడ చదవనని చెబుతోంది. ఇటువంటి సమస్య మరే ఆడపిల్లకు రాకూడదని తక్షణమే సదరు ఉపాధ్యాయుడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
మృత్యువుకు దొరికారు
నిండు జీవితాల్ని బలిగొన్న కొత్త కారు {బేక్ వేసేందుకు బదులు యాక్సిలేటర్ నొక్కిన డ్రయివర్ వాయువేగంతో దూసుకొచ్చిన వాహనం ఇద్దరు మృతి... 15 మందికి తీవ్ర గాయాలు పోలీసుల అదుపులో రావికమతం మాజీ మండల ఉపాధ్యక్షుడు ఈశ్వరరావు బుధవారం ఉదయం 9 గంటలు. కొత్త కారు బయల్దేరింది. చూస్తుండగానే వేగం అందుకుంది. ఒక్కసారిగా దూసుకొచ్చింది. ఏం జరిగిందో తెలియలేదు... అడ్డొచ్చినవాళ్లందరినీ ఢీకొంది. రహదారి రక్తం చిమ్మింది. ఇద్దరి ప్రాణం గాల్లో కలిసిపోయింది. పదిహేను మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ముచ్చట పడి కొనుక్కున్న కారు మృత్యుపాశమై నిలిచిం ది. కారు నడపడంలో అనుభవ రాహిత్యం నిండుప్రాణాల్ని బలిగొంది. రావికమతంలో టీడీపీ నేత, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు గంటా ఈశ్వరరావు కారు నడుపుతూ బ్రేక్‌కు బదులు ఎక్స్‌లేటర్‌ను నొక్కేయడం ఇంతటి విషాదానికి కారణమైంది. రావికమతం : రావికమతం మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు గంటా ఈశ్వరరావు కారు కొన్నారు. భార్యతో కలిసి కారులో బుధవారం ఉదయం చోడవరం బయల్దేరారు. ఇంటికి సమీపంలోనే అడ్డొచ్చిన ఒక ఐస్ పెట్టె వ్యాపారిని తప్పించబోయారు. బ్రేక్ వేయడానికి బదులు యాక్సిలేటర్ నొక్కేయంతో కారు వాయువేగంతో దూసుకుపోయింది. రోడ్డుపై సైకిల్‌పై వెళ్తున్న గుమ్మాళ్లపాడుకు చెందిన డొంకిన పోతురాజు (47)ను ఢీకొంది. అతని తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం ఆటోను బలంగా ఢీకొట్టడంతో అది గాలిలో ఎగిరిపడింది. అందులో ప్రయాణిస్తున్న పిల్లవానిపాలేనికి చెందిన పుప్పాల అప్పలకొండ (62) తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అనంతరం బైక్‌పై వెళ్తున్న మళ్ళ రమణబాబు (52), శీర నూకరాజు (47)లపై నుంచి దూసుకుపోవడంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. సైకిల్, బైక్ నుజ్జునుజ్జయ్యాయి. ఆటోలోని గుమ్మాళ్లపాడుకు చెందిన గొర్లె రాజిబాబు, కోటవురట్ల మండలానికి చెందిన పల్లా రమణ), బంగారుమెట్టకు చెందిన మొల్లి పెంటమ్మ, దొండపూడికి చెందిన పొలుమూరి రాజారావు, మజ్జి అప్పారావు, రావికమతానికి చెందిన ముక్కా సత్తిబాబు, ఆటో డ్రయివర్ రెడ్డి మహేష్, టి.అర్జాపురానికి చెందిన ఒకే కుటుంబంలోని రొంగలి రమణమ్మ, కొండమ్మ, శైతి, నమ్మి రామకృష్ణ, మరుపాకకు చెందిన పుర్రె గణేష్, పెదగొట్టివాడకు చెందిన శీర చినతల్లి, నర్సీపట్నానికి చెందిన డిగ్రీ విద్యార్థిని టి.శ్రావణిలకు తీవ్ర గాయాలయ్యాయి. కొత్తకోట ఇన్చార్జి సీఐ దాశరథి, ఎస్ఐ శిరీష్‌కుమార్, రావికమతం ఎస్ఐ సురేష్‌కుమార్ క్షతగాత్రులను నర్సీపట్నం, అనకాపల్లి ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, జిల్లా బీజేపీ నేత గల్లా రాజేశ్వరరావు మృతుల బంధువులను ఓదార్చి క్షతగాత్రులను పరామర్శించారు. కారు యజమాని గంటా ఈశ్వరరావును ఎస్ఐ అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.