రచ్చ.. రచ్చే! | Sakshi
Sakshi News home page

రచ్చ.. రచ్చే!

Published Sat, Oct 7 2017 12:16 PM

DCCB conflicts in Ongole

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పీడీసీసీబీ గొడవ ఇప్పట్లో సర్దుమణిగేలా కనిపించటం లేదు. చైర్మన్‌ ఈదర మోహన్‌ అవినీతికి పాల్పడ్డాడంటూ ఆరోపణలకు దిగి ఏకంగా ముఖ్యమంత్రికే ఫిర్యాదు చేసిన మెజార్టీ డైరెక్టర్లు ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. శుక్రవారం సైతం టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసిన డైరెక్టర్లు చైర్మన్‌ ఈదర మోహన్‌ ముందు పదవి నుంచి తప్పుకోవాల్సిందేనంటూ డిమాండ్‌ చేశారు. తాము కూడా ఏ విచారణకైనా సిద్ధమని అయితే మెజార్టీ సభ్యులు వ్యతిరేకిస్తున్నందున చైర్మన్‌ ముందు పదవి నుంచి దిగిపోవాలని వారు డిమాండ్‌ చేశారు. మరోవైపు చైర్మన్‌ ఈదర మోహన్‌ తనపై ఆరోపణలు చేస్తున్నది కొందరు ఆర్థిక నేరగాళ్లేనంటూ ఎదురుదాడికి దిగారు.

మాటలతో సరిపెట్టకుండా ఆరు మంది డైరెక్టర్లు మరికొంత మంది బ్యాంకు ఉద్యోగులు, మాజీ ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు చేశారు. ఆ వివరాలను సైతం ముఖ్యమంత్రికి లేఖ ద్వారా పంపి గొడవను పతాకస్థాయికి చేర్చారు. డైరెక్టర్లు, చైర్మన్‌ పరస్పర ఆరోపణలతో డీసీసీబీ రచ్చ మరింత తీవ్ర స్థాయికి చేరింది. గొడవను సర్దుబాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినా ఫలితం కనిపించలేదు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ ఈ నెల 4న ఇరువర్గాలతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే సమావేశానికి డైరెక్టర్లు మాత్రమే హాజరయ్యారు. చైర్మన్‌ ఈదర మోహన్‌ హాజరుకాలేదు. తాను అక్కడకు వెళ్లి చెప్పుకోవాల్సిందేమీ లేదంటూ ఆయన సెల్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకున్నారు.

 దీంతో చేసేదేం లేక జనార్దన్‌ సమావేశాన్ని వాయిదా వేశారు. శనివారం జిల్లా మంత్రి శిద్దా రాఘవరావుతో కలిసి డైరెక్టర్లు, ఇటు చైర్మన్‌తో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఇరువర్గాలను ఒప్పించి రాజీ ప్రయత్నాలు కుదర్చాలని అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో మంత్రి శిద్దా సమక్షంలో దామచర్లతో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ తదితరులు సమావేశంలో పాల్గొని ఇరువర్గాలను ఒప్పించే ప్రయత్నాలు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి కూడా ఈదర మోహన్‌ రావటం ప్రశ్నార్థకంగా మారింది. కానీ నేడు సమావేశం జరిగే పరిస్థితి కనిపించడం లేదు.

 మంత్రి శిద్దా కూడా జిల్లాలో ఉండే అవకాశం లేకపోవడంతో సమావేశం మరోమారు వాయిదా పడేలా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో డీసీసీబీ గొడవ పెరగడం తప్ప ఇప్పట్లో సర్దుమణిగేలా లేదు. మరోవైపు డైరెక్టర్లు సైతం అమీతుమీకి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే  చైర్మన్‌ ఈదర మోహన్‌పై అవిశ్వాసం నోటీస్‌ ఇచ్చినందున ఆ మేరకు చర్యలు చేపట్టాలని వారు సహకార శాఖ రిజిస్ట్రార్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. 

Advertisement
Advertisement