టెర్మినల్ బెనిఫిట్స్ దాతృత్వం కాదు.. అవి వారి హక్కు, ఆస్తి
ఏళ్ల పాటు సేవలు చేయించుకుని ప్రయోజనాలు ఇవ్వకపోవడం అమానవీయం
రాజ్యాంగ విరుద్ధం కూడా.. అవి ఉద్యోగుల జీవనోపాధిలో అంతర్భాగం
నలుగురు ఉద్యోగుల బెనిఫిట్స్‌ను 10 శాతం వడ్డీతో చెల్లించండి
రాష్ట్ర ప్రభుత్వం, డీసీసీబీలకు హైకోర్టు ఆదేశం
టెర్మినల్ బెనిఫిట్స్ కోసం పిటిషన్లు దాఖలు చేసిన వారు 70, 80, 90 ఏళ్ల సీనియర్ సిటిజన్లు. ఈ వయస్సులో అనేక ఆరోగ్య సమస్యలతో పాటు ఇతర సమస్యలు ఎదుర్కొంటుంటారు. వీరి నుంచి జీవితాంతం సేవలు తీసుకున్నారు. పదవీ విరమణ తర్వాత 16 ఏళ్లకు కూడా వారికి పదవీ విరమణ ప్రయోజనాలను ఇవ్వకపోవడం అమానవీయం. రాజ్యాంగ విరుద్ధం. – ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
సాక్షి, అమరావతి: పదవీ విరమణ అనంతరం ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఉద్యోగాంతర ప్రయోజనాలైన (టెర్మినల్ బెనిఫిట్స్) గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్ మెంట్ తదితరాలను చెల్లించడంలో ప్రభుత్వం, దాని పర్యవేక్షణలోని సంస్థలు చేస్తున్న అసాధారణ జాప్యంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఏళ్ల తరబడి సేవలు చేయించుకుని వారికి టెర్మినల్ బెనిఫిట్స్‌ను చెల్లించకపోవడం చట్ట విరుద్ధమే కాక రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది.
టెర్మినల్ బెనిఫిట్స్ ప్రభుత్వాల దాతృత్వం కాదని, అవి ఉద్యోగుల హక్కు అని స్పష్టం చేసింది. ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న సాకుతో ఉద్యోగులకు రాజ్యాంగం కలి్పస్తున్న సామాజిక భద్రత హక్కును ప్రభుత్వం, దాని సంస్థలు కాలరాయలేవని పేర్కొంది. పదవీ విరమణ చేసిన 16 ఏళ్లకు కూడా ఉద్యోగులకు టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లించకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఆ ఉద్యోగులు వడ్డీతో సహా బకాయిలను పొందేందుకు అర్హులని హైకోర్టు తేల్చి చెప్పింది.
నాటి నుంచి టెర్మినల్ బెనిఫిట్స్ పొందని పిటిషనర్లు..
చిట్టిబోయిన భారతరావు, పి. చంద్రమౌళీశ్వరరావు, బండ శివరామకృష్ణ ప్రసాద్, ఏ.సాయిబాబు పెయిడ్ సెక్రటరీలుగా కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో పనిచేశారు. తరువాత వారి పోస్టులు డీ–కేడరైజ్డ్ చేసి సెక్రటరీలుగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలోకి (పీఏసీఎస్) బదిలీ చేశారు. నాబార్డ్ మార్గదర్శకాల ప్రకారం వారిని 2009 మార్చి 2న తిరిగి పెయిడ్ సెక్రటరీలుగా డీసీసీబీలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి పదవీ విరమణ వరకు వారు ఎలాంటి మచ్చ లేకుండా పని చేశారు.
రిటైర్ అయినప్పటికీ, వారికి గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి టెర్మినల్ బెనిఫిట్స్‌ను చెల్లించలేదు. వీటి కోసం ప్రభుత్వం, డీసీసీబీలతో పోరాడి అలసిపోయిన ఆ వృద్ధులు 2016లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై డీసీసీబీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, పిటిషనర్లు కొంత కాలం పీఏసీఎస్‌లలో పనిచేసినందున, అవి వారి వాటా బెనిఫిట్స్‌ను చెల్లించాలని, ఆ మొత్తం రాగానే దానితో కలిపి టెర్మినల్ బెనిఫిట్స్ ఇస్తామన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కుంచెం మహేశ్వరరావు ఇటీవల కీలక తీర్పు వెలువరించారు.
16 ఏళ్ల తరువాత కూడా ప్రయోజనాలు చెల్లించరా...?
‘రిటైర్ అయిన 16 ఏళ్లకు కూడా వారికి ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం అమానవీయం. రాజ్యాంగ విరుద్ధం. ప్రభుత్వం, డీసీసీబీ, పీఏసీఎస్‌లు పిటిషనర్ల నుంచి వారి జీవిత కాల సేవలు పొందాయి. ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు లేకపోయినా బెనిఫిట్స్‌ను చెల్లించలేదు. అది పిటిషనర్ల చట్టబద్ధమైన, రాజ్యాంగ హక్కులను హరించినట్లే. గ్రాట్యుటీ చెల్లింపు చట్టం సెక్షన్ 7 ప్రకారం ఉద్యోగి పదవీ విరమణ చేసి దరఖాస్తు చేసుకున్న నాటి నుంచి 30 రోజుల్లోపు చెల్లించాలి. లేదంటే
ఆ రోజు నుంచి వడ్డీ కూడా చెల్లించాలి. దీని ప్రకారం ఈ కేసులో పిటిషనర్లు చట్ట ప్రకారం వడ్డీ పొందేందుకు అర్హులు.
ఇది యజమాని విచక్షణపై ఆధారపడి ఉండదు. గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్ మెంట్, ఇతర ప్రయోజనాలను పిటిషనర్లు లేదా వారి కుటుంబ సభ్యులకు 10 శాతం వార్షిక వడ్డీతో చెల్లించాలి. ఫ్యామిలీ మెంబర్ సరి్టఫికెట్లు పరిశీలించి, ఆ తరువాత 8 వారాల్లో చెల్లించాలి. కోర్టు ఖర్చుల కింద పిటిషనర్లు ఒక్కొక్కరికి రూ.10 వేలు ప్రభుత్వం, డీసీసీబీ, పీఏసీఎస్ చెల్లించాలి. టెర్మినల్ బెనిఫిట్స్‌లో పీఏసీఎస్ నుంచి రావాల్సిన వాటాను వసూలు చేసుకునే హక్కు డీసీసీబీకి ఉంది. పీఏసీఎస్ వాటా చెల్లించలేదు కాబట్టి పిటిషనర్లకు టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లించలేకపోయామన్న డీసీసీబీ వాదన చట్టబద్ధం కాదు’ అని జస్టిస్ మహేశ్వరరావు తన తీర్పులో పేర్కొన్నారు.


