
నేటి నుంచి దసరా మహోత్సవాలు
తొమ్మిది రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై అంగరంగవైభవంగా జరిగే దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు గురువారం నుంచి వచ్చే నెల 3 వతేదీ వరకు జరగనున్నాయి.
- వినాయకుడు గుడి నుంచి ప్రత్యేక క్యూలైన్లు
- స్నానఘట్టాలు, కేశఖండనశాలల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు
- భక్తుల సౌకర్యార్థం రూట్ మ్యాప్
- రంగంలోకి దిగిన అదనపు పోలీసు బలగాలు
సాక్షి, విజయవాడ : తొమ్మిది రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై అంగరంగవైభవంగా జరిగే దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు గురువారం నుంచి వచ్చే నెల 3 వతేదీ వరకు జరగనున్నాయి. ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలన్నీ అమ్మవారి నామస్మరణతో మార్మోగుతున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 5లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ దేవస్థానం అధికారులు చేశారు.
ముఖ్యంగా స్నానఘట్టాలు, కేశఖండనశాలలు, క్లోక్‌రూమ్‌లు, చెప్పులు భద్రపరచుకునే ప్రదేశాలను ఏర్పాటు చేశారు. బస్టాండ్, రైల్వేస్టేషన్‌కు చేరుకున్న వారికి దేవస్థానానికి చేరుకునేందుకు వీలుగా ఎక్కడకు అక్కడ రూట్ మ్యాప్‌లు ఏర్పాటు చేశారు. తొలిరోజున అమ్మవారు స్వర్ణకవచాలంకృత కనకదుర్గాదేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
ఉత్సవాలపై అధికారుల ప్రత్యేక దృష్టి
ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే కలెక్టర్ రఘునందన్‌రావు, పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు, జాయింట్‌కలెక్టర్ మురళి, సబ్‌కలెక్టర్ నాగలక్ష్మి సమీక్షా సమావేశాలు నిర్వహించడమే కాకుండా భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లను బుధవారం దేవాదాయ శాఖ కమిషనర్ అనూరాధ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
కాగా మూలనక్షత్రం, దుర్గాష్టమి, విజయదశమి రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో దసరా ఉత్సవాలకు అదనంగా ఆరువేల మంది పోలీసులను ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా ఇతర దేవస్థానాల నుంచి సిబ్బందిని రప్పించి వారి సేవలు వినియోగిస్తున్నారు.