నోట్ల రారాజు...!

Currency Collection - Sakshi

లక్కవరపుకోట: ఆయన ఉద్యోగం బ్యాంకు మేనేజర్‌. నిత్యం నోట్లకట్టల మధ్యనే విధుల నిర్వహణ. ఆ నోట్లలో ఫ్యాన్సీ నంబర్ల సేకరణపై ఆసక్తి పెంచుకున్నారు. వివిధ రకాల ఫ్యాన్సీ, స్టార్‌ నోట్లు సేకరించి అందరినీ అబ్బుర పరుస్తున్నారు. గిన్నిస్‌ బుక్‌లో స్థానం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆయనే.. ఎల్‌.కోట ఎస్‌బీఐ పూర్వపు మేనేజర్‌ ఎస్‌ఎస్‌ఎన్‌ రాజు. ఆయన నోట్ల సేకరణ ఆసక్తిని ఓ సారి పరికిస్తే...

చిత్రవిచిత్రమైన నంబర్‌ నోట్లు... 

ఒక్క రూపాయి నోటు నుంచి 2 వేల రూపాయల నోటు వరకు స్టార్స్‌ ఉన్న నోట్లు, ఫ్యాన్సీ నోట్లు ఆయన వద్ద ఉన్నాయి. మనం వినియోగిస్తున్న కరెన్సీ నోట్లు నంబర్ల మధ్యలో స్టార్‌ గుర్తులు అప్పుడుప్పుడూ కనిపిస్తాయి. స్టార్‌ గుర్తులు ఉన్న నోట్లు పరిశీలించి కొందరు ఆందోళనకు గురవుతుం టారు. అయితే, స్టార్‌ గుర్తు ఉన్న నోట్లు అరుదైనవి. లక్షల నోటుల్లో ఒక్కటి మాత్రమే ఇటువంటివి ఉంటాయి.

కరెన్సీ నోట్లు ముంద్రించే విషయంలో రిజర్వుబ్యాంకు సిబ్బంది అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తుంటారు. కరెన్సీ నోట్లపై సీరియల్‌ నంబర్‌ కేటాయించే ముందు ఆల్ఫాబెటిక్‌ ఆర్డర్‌లో మూడు నంబర్లు ముద్రిస్తారు. వాటి నుంచి కొంత ఖాళీ ఉంచి తర్వాత ఆరు నంబర్లు ముద్రిస్తారు. సీరియల్‌ నంబర్‌ ఆధారంగా వంద నోట్లను ఒక కట్టగా కడతారు. అయితే, ముద్రణా లోపం వల్ల కొన్ని నోట్లు పాడైపోతే అటువంటి నోట్లు స్థానంలో స్టార్‌ గుర్తుపెట్టి వేరొక సీరియల్‌ నంబర్‌తో కొత్తనోటు ముద్రించి అటువంటి నోట్లు స్థానంలో పెడతారు.

స్టార్‌ నోటు ఉన్న కట్టపై ప్రత్యేకంగా స్టార్‌ గుర్తును కూడా ముద్రిస్తారు. దీంతో ఆ కట్టలో స్టార్‌ గుర్తు ఉన్న నోటు ఉందని తెలుసుకోవచ్చు. ఈ తరహా నోట్లు అరుదుగా లభిస్తాయి. అలాంటి నోట్లు రాజు వద్ద రూ.2, రూ.5, రూ.10, రూ.20, రూ.50  రూ.100, రూ.200, రూ.500, రూ.2వేల నోట్టు వరకు గల 839 నోట్లను ఆయన సేకరించారు. మరో విచిత్రం ఏమిటంటే స్టార్‌ గుర్తు ఉన్న ఒకే సీరియల్‌లో గల ఒక్క రూపాయి కట్టను (వందనోట్లు) సేకరించడం గమనార్హం.  

ఫ్యాన్సీ నంబర్లు... 

ఫ్యాన్సీ నంబర్లు ఉన్న నోట్లను సేకరించడం రాజుకు ఇష్టం. రూపాయి నోట్లలో 111111, 222222, 333333 నంబరు కలిగిన నోట్లు ఆయన వద్ద ఉన్నాయి. ఈ తరహా నోట్లు రూ.2వేల నోట్లు వరకు సుమారు 281 నోట్లు ఉన్నాయి.

2006 నుంచి సేకరిస్తున్నా... 

నేను స్టార్‌ గుర్తుల గల నోట్లను రిజర్వుబ్యాంకు 2006 నుంచి ముద్రించడం ప్రారంభించింది. అప్పటి నుంచి అరుదైన నోట్లను సేకరించడం ప్రారంభించాను. మనం నిత్యం వాడే కరన్సీ నోట్లలో ఎన్నో చిత్ర విచిత్రాలు ఉంటాయి. వాటిని ఎవరూ పట్టించుకోరు. అలాంటి విషయాలు తెలియపర్చాలనే ఉద్దేశంతోనే నోట్ల సేకరణ ప్రారంభించాను. ఈ తరహా నోట్లను ప్రపంచంలో ఎక్కడా సేకరించే దాఖలాలు లేవు.    –ఎస్‌.ఎస్‌.ఎన్‌.రాజు,ఎల్‌.కోట స్టేట్‌బ్యాంక్‌ పూర్వపు మేనేజర్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top