మూడు లేయర్లలో ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరాన్ని నిర్మిస్తామని సీఆర్డీఏ కమిషనర్ ఎన్.శ్రీకాంత్ తెలిపారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ..
విజయవాడ : మూడు లేయర్లలో ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరాన్ని నిర్మిస్తామని సీఆర్డీఏ కమిషనర్ ఎన్.శ్రీకాంత్ తెలిపారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రాజధాని ప్రాంత భూముల్లో రెండోపంటకు అనుమతి లేదని, జనవరి నెలాఖరుకు 10వేల ఎకరాల భూ సమీకరణ పూర్తి చేస్తామన్నారు. రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న గ్రామాలు అలాగే ఉంటాయన్నారు. వాటిని కలుపుకునే మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామన్నారు. రాజధాని పరిధిలోని వ్యవసాయ భూముల్లో లేఅవుట్లకు అనుమతి లేదన్నారు.
కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఆక్రమణలపై గుంటూరు కలెక్టర్ను నివేదిక ఇవ్వమని ప్రభుత్వం ఆదేశించినట్లు శ్రీకాంత్ పేర్కొన్నారు. అందుబాటులో లేని భూయజమానులు ఆన్లైన్లో అఫిడవిట్లు సమర్పించేందుకు అవకాశం కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. భూ సమీకరణకు 30మంది అధికారులను నియమిస్తే ఇప్పటిదాకా 19మంది విధుల్లో చేరినట్లు చెప్పారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంపై అధికారుల బృందం సింగపూర్ పర్యటన ముగిసినట్లు శ్రీకాంత్ తెలిపారు. రాజధాని పరిసరాల్లో ప్రయివేట్ వాహనాల వినియోగం ఉండకుండా చూస్తామన్నారు.