నేను మారానో మొర్రో అని చెప్పుకుని ఎన్నికల సమయంలో ప్రజలను నయవంచన చేసి అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు...
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల
ఏడాది పాలనపై సీఎంకు బహిరంగలేఖ
పట్నంబజారు (గుంటూరు) : నేను మారానో మొర్రో అని చెప్పుకుని ఎన్నికల సమయంలో ప్రజలను నయవంచన చేసి అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన నిజస్వరూపాన్ని బయటపెట్టారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో ఆశలు రేపి ఏడాది గడిచిన తరువాత వాగ్దానాలు అమలు చేయడం కుదరదని చెప్పడం విశ్వాస ఘాతుకమేనని ధ్వజమెత్తారు. కొత్తపేటలోని సీపీఐ కార్యాలయంలో ఆయన ఆదివారం ఏడాది పాలనపై సీఎంకు రాసిన బహిరంగ లేఖను విడుదల చేశారు.
విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు ప్రజలకు ఏమి ఒరగబెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిత్యం అబద్ధాలు చెప్పుకుంటూ అధికారం కోసం అర్రులు చాచే మనస్తత్వం ఆయనదని విమర్శించారు. హమీలను అమలు పరచడంలో ఏ మాత్రం చిత్తశుధ్ధి లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అధికారం చేపట్టిన నాటి నుంచి విదేశాల పేరు చెప్పుకుని విహారయాత్రలు చేయడం, విలాసజీవితం గడుపుతున్న మీకు పేదల బతుకులు ఎలా అర్ధమవుతాయని ప్రశ్నించారు.
రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులు, డ్వాక్రా రుణాలు మాఫీ అని మహిళలను వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. మిమ్మల్ని నమ్ముకుని ఓట్లు వేసుకున్న యువత భోరుమని విలపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న భూములను పారిశ్రామికవేత్తలకు దోచిపెడుతూ, బ్యాంకు బ్యాలెన్స్‌లను నింపుకుంటున్నారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయకపోతే ఎంతటి పోరాటాలకు వెనుకాడబోయేది లేదని హెచ్చరించారు.
పార్టీ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ఏమాత్రం చొరవ చూపకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రజల పక్షాన ఎర్రజెండాలు ఉన్నాయన్న విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సమావేశంలో సీపీఐ నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి ఉన్నారు.