భిక్షగాళ్లు, చిత్తుకాగితాలేరుకునే వారికి రక్ష

COVID 19 Kits For Beggers in Krishna Distributing Today - Sakshi

కరోనా బారిన పడకుండా ‘కోవిడ్‌–19’ కిట్‌లు

రాష్ట్రంలోనే తొలిసారి కృష్ణాలో అమలు

రూ.70 విలువ కిట్‌ పంపిణీ

ఆరు మాస్క్‌లు.. రెండు సబ్బులు

నేడు ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ

సాక్షి, మచిలీపట్నం: కరోనా మహమ్మారి.. చాపకింద నీరులా రోజుకు రోజుకు విస్తరిస్తోంది. పేద, ధనిక తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కర్ని గడగడ లాడిస్తోంది. భిక్షగాళ్లు, చిత్తుకాగితాలు ఏరుకునే వారు, ఎలాంటి ఆధారం లేకుండా చెట్ల కింద, బస్టాండ్లలో కాలక్షేపం చేసే వారి పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. కోవిడ్‌ బారిన వీరు పడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కోవిడ్‌పై అవగాహన కల్పించాలని నిర్ణయించింది. అంతే కాకుండా ఆరు మాస్కులు, రెండు çసబ్బులతో కూడిన కిట్లులు అందించనుంది. నగరాలు, పట్టణాల్లో సంచ రించే వీరికి మెప్మా ద్వారా రూ.70 విలువైన కిట్‌ పంపిణీ చేయాలని నిర్ణయించింది.

అందుకోసం విజయవాడ కార్పొరేషన్‌తో సహా జిల్లా వ్యాప్తంగా నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న భిక్షగాళ్లు, చిత్తుకాగితాలు ఏరుకునే వారు, రోడ్డుపక్క ఎలాంటి ఆధారం లేకుండా జీవిస్తున్న వార్ని ఇప్పటికే మెప్మా సహకారంతో గుర్తించారు. ఈ విధంగా విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలో 997 మంది ఉన్నారు. అదే విధంగా మచిలీపట్నం కార్పొరేషన్‌ పరిధిలో 230 మంది, గుడివాడ పట్టణ పరిధిలో 300 మంది, తిరువురూలో 94 మంది, జగ్గయ్యపేటలో 80 మంది, నందిగామలో 68, నూజివీడులో 60 మంది పెడనలో 58 మంది, ఉయ్యూరులో 34 మంది కలిపి మొత్తం 1991 కుటుంబాలును గుర్తించారు. రాష్ట్రంలోనే తొలిసారి బుధవారం కృష్ణా జిల్లాలో ఈ కిట్‌లను పంపిణీ చేయనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఈ కిట్‌లు పంపిణీ చేయనున్నట్లు మెప్మా పీడీ డాక్టర్‌ ఎన్‌ ప్రకాశరావు ‘సాక్షి’కి తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top