అడిగింది ఇవ్వకుంటే కూల్చేస్తాం !

Courruption In Town Planing Department Krishna - Sakshi

నగరంలో పోస్ట్‌ వెరిఫికేషన్‌ మాయాజాలం

భవననిర్మాణ అనుమతులు ఉన్నా.. ఏదోవంకతో కూల్చేస్తామని బెదిరింపులు

తమకు దక్కాల్సింది దక్కేంతవరకు రాయబారాలు

తీరుమారని టౌన్‌ప్లానింగ్‌ విభాగం

విధించాల్సిన పన్నుల్లో తగ్గింపు

వీఎంసీ ఆదాయానికి గండి

విజయవాడలో జరుగుతున్న నిర్మాణాలకు సంబంధించి వెరిఫికేషన్‌కు వెళ్లే అధికారులు అనుమతుల పేరుతో అడ్డగోలు దోపిడీ చేస్తున్నారు. వీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగంలో అంతులేని అవినీతి చోటుచేసుకుంటుందని ఫిర్యాదులు వస్తున్నా.. సాక్షాత్తు వీఎంసీ ఇతర విభాగాల సిబ్బంది చెబుతున్నా, అధికారులలో ఎలాంటి మార్పురాకపోగా మరింతగా విజృంభిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

పటమట: ఆ విభాగంలో అంతా పకడ్బందీగా జరుగుతుంది. ఇల్లుకట్టాలనుకున్న సామాన్యుల కలను అధికారులు వెరిఫికేషన్‌ పేరుతో కల్లగా మారుస్తున్నారని, భవన నిర్మాణానికి అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు పొందినప్పటికీ కొంతమంది టౌన్‌ప్లానింగ్‌ విభాగం అధికారులు ఓఉన్నతాధికారి సహకారంతో అందినకాడికి దండుకుంటూ వెరిఫికేషన్‌లో అనుకూల/ప్రతికూల రిపోర్టులు ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తమను సంతృప్తి పరచకపోతే అన్ని రకాల అనుమతులు ఉన్నా అప్పోసొప్పో చేసి కట్టుకుంటున్న నిర్మాణాలను కూల్చివేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అనుమతులకు విరుద్దంగా ఎలాంటి నిర్మాణాలు జరిగినా అధికారులకు లంచాలు ముట్టచెబితే చూసీచూడనట్లు వ్యవహరిస్తారని ఆరోపణలు.

అడ్డగోలు దోపిడీ..
చుట్టుగుంట వద్ద ఏలూరు రోడ్డు వెంబడి జరుగుతున్న ఓ ఇంటి నిర్మాణ అనుమతులకు సంబంధించి పోస్ట్‌ వేరిఫికేషన్‌కు వెళ్లిన బిల్డింగ్‌ ఇన్స్‌పెక్టర్‌ తాను రిపోర్టు చేస్తేనే అనుమతి వస్తుందని, అనుకూలంగా రిపోర్టు ఇవ్వాలంటే రూ. 3 లక్షలు ఇచ్చుకోవాల్సిందేనని పట్టుపట్టడంతో వెలగపూడిలోని సెక్రటేరియట్‌లోని ఓ సీనియర్‌ ఉద్యోగి రాయభారంతో రూ.1.25 లక్షలకు బేరం కుదిరింది. సకాలంలో భవన యజమాని సొమ్ములు చెల్లించకపోవటంతో గత వారం డీవియేషన్స్‌ జరుగుతున్న ప్రాంతాన్ని కూల్చేయటానికి వెళ్లగా అప్పటికప్పుడు రూ. 75వేలు చెల్లిస్తేగానీ కూల్చకుండా వదిలేశారని సమాచారం.  రామలింగేశ్వరనగర్‌లోని ఎస్‌టీపీ ప్లాంట్‌కు సమీపంలో ఓ భవన నిర్మాణానికి సంబంధించి పోస్ట్‌ వెరిఫికేషన్‌కు వెళ్లిన అధికారులను మెప్పించకపోవటంతో నిర్మాణ అనుమతికి సంబందించి కొర్రిపెట్టి ఇంటి నిర్మాణాన్ని నిలుపుదల చేశారు. వెరిఫికేషన్‌కు వెళ్లిన అధికారుల బృందం రూ. 2 లక్షలు డిమాండ్‌ చేయగా తానెందుకు చెల్లించాలని భవన యజమాని ప్రశ్నించటంతో అనుమతులకు విరుద్ధంగా నిర్మాణం జరుగుతుందని, ఇలా నిర్మా ణం చేపడితే కూల్చేస్తామని, తమకు ‘సహకరిం చకపోతే’ కూల్చేస్తామని అధికారులే బెది రింపులకు దిగుతున్నారని బా«ధితుడు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు నగరంలోని అన్ని ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్నా వీఎంసీ ఉన్నతాధికారి దృష్టిసారింకచకపోవటంపై పలు అనుమానాలకు తావిస్తోంది.

వీఎంసీ ఆదాయానికి గండి..
నగర పాలక సంస్థ పరిధిలో భవనాలకు ఇంటి పన్న వేసే సమయంలో ప్లింత్‌ ఏరియా, నిర్మాణం స్వభావం, ఉపయోగవిధానం(రెసిడెన్షియల్‌/కమర్షియల్‌/ఇతర), పరిశీలించి అధికారులు పన్ను లు విధించాల్సి ఉండగా ఆయా నిర్మాణాల వద్దకు పోస్ట్‌ వెరిఫికేషన్‌ సర్వేకు వెళ్తున్న అధికారులు కొలతల్లో, కేటగిరీల్లో మాయాజాలం చేస్తున్నారు. కొంతమంది వాణిజ్యప్రాంతాల్లో భవనాలు నిర్మిం చి కేవలం నివాస ప్రాంతాలుగానే పన్ను చెల్లింపులు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. భవన నిర్మాణ యజమానుల నుంచి అధికారులు ప్రత్యేకంగా  పన్నులు తగ్గించేలా ‘రహస్య’ ఒప్పందాలు చేసుకుంటున్నారు. దీనివల్ల నగర పాలక సంస్థకు రావాల్సిన ఆదాయానికి గండి పడుతుంది.

వన్‌టౌన్‌లోని అత్యంత రద్దీగా ఉండే ప్రదేశంలో జరుగుతున్న ఓ భవన నిర్మాణం పోస్ట్‌ వెరిఫికేషన్‌కు వెళ్లిన పట్టణ ప్రణాళిక అధికారులు చెప్పిన విషయాలు విన్న ఆ భవన నిర్మాణ యజమానికి అధికారుల డిమాండ్‌ విని దిమ్మతిరిగిపోయింది. 150 గజాల స్థలంలో ఆన్‌లైన్‌లో అనుమతి పొంది జీప్లస్‌–2 నిర్మాణం చేసుకుంటుండగా, ప్లాన్‌లో చూపిన విధంగా మెట్లు సక్రమంగా లేవని, పోర్టికో నాలుగు అడుగులు ముందుకు వచ్చిందని డీవియేషన్స్‌ ఉన్న ప్రాంతాన్ని కూల్చేస్తామని, ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణం జరుగుతుందని ఓ అధికారి రూ.5లక్షలు డిమాండ్‌ చేశారు. స్థానిక కార్పొరేటర్‌ సహాయంతో ఎమ్మెల్సీని కలిస్తే చివరికి రూ.1.5 లక్షలకు  సెటిల్‌మెంట్‌ జరిగినట్లు సమాచారం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top