మరుగుదొడ్లలో అవినీతి కంపు..!

Corruption in toilet scheme alleged - Sakshi

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఓడీఎఫ్‌ (బహిరంగ మల, మూత్ర విసర్జన నివారణ)లో ప్రధాని నుంచే ప్రసంశలం దుకున్న విజయనగరం జిల్లాలో వాస్తవ పరి స్థితులు భిన్నంగా ఉన్నాయి. జిల్లాకు 3.70 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరుకాగా వాటిలో ఇప్పటి వరకు 3.30 లక్షలు పూర్తి చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పూర్తయ్యాయని చెబుతున్న వాటిలో 20 శాతం మరుగుదొడ్లు లేనే లేవు. 30 శాతం మరుగుదొడ్లు అరకొరగా వినియోగానికి పని కి రాకుండా ఉన్నాయి. ఒక్కో మరుగుదొడ్డికి రూ.15 వేలు చొప్పున చెల్లిస్తున్నారు. ఈ లెక్కన రూ.కోట్లల్లో నిధులు అక్రమార్కుల జేబుల్లోకి చేరిపోయాయి. చచ్చిపోయిన వారిపేరున కూడా మరుగుదొడ్లు కట్టేసి, నిధులు కాజేశారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణాలు త్వరిత గతిన పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునే సాకుతో కాంట్రాక్టర్లు, అధికా రులు కుమ్మకై చేయని పనులను చేసినట్లు, లేని లబ్ధిదారులను ఉన్నట్లు చూపించి నిధులు మింగేశారు.

నిర్మించకుండానే..
నెల్లిమర్ల మండలం మల్యాడ గ్రామం.. చుట్టూ పచ్చని చెట్లు.. పంట చేల సుగంధం నడుమ ఆధునికతకు కాస్త దూరంగా ఉంటారు ఇక్కడి జనం. వీరికి సర్పంచ్‌ చెప్పిందే వేదం, చేసిందే చట్టం. అతను అన్యాయం చేస్తున్నాడని కూడా తెలుసుకోని అమాయకత్వం వారిది. దీనినే ఆసరాగా చేసుకుని పాలకులు, కాంట్రాక్టర్లు కుమ్మకయ్యారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్‌ మిషన్‌లో భాగంగా జిల్లాలను సంపూర్ణ ఓడీఎఫ్‌గా మార్చాలని జిల్లా అధికారులకు గట్టిగా ఆదేశాలివ్వడంతో వారు లక్ష్యాలను చేరుకోవడంపైనే దష్టి సారించారు. ఈ ఒక్క పంచాయతీలోనే 310 మంది లబ్ధిదారులకు రూ.45.90 లక్షల నిధులు మంజూరు చేశారు. దీంతో లెక్కల్లో మా యలు చేసి మరుగుదొడ్లు నిర్మించకుండా, పాత మరుగుదొడ్లకు బిల్లులు చేసుకుని ఈ మొత్తంలో సగానికిపైగా ప్రభుత్వ ధనాన్ని కొందరు కాజేస్తున్నారు.

ఒకే మరుగుదొడ్డికి రెండేసి బిల్లులు..
గ్రామంలో అప్పటికే నిర్మించిన మరుగుదొడ్డికి మరలా దరఖాస్తు చేసి, ఒక సారి నిధులు తీసుకున్నదానికి మరలా నిధులు మంజూరు చేయిం చుకుని సొమ్ము చేసుకున్నారు. పప్పలరాము, పప్పల రాజినాయుడు, పొట్నూరు అప్పలనాయుడు, పొట్నూరు కళావతి, పప్పల వరహా లమ్మ, పప్పల శ్రీనివాసరావు, పల్లి అప్పలనర్సి, పల్లి పైడిరాజు, కర్నపు రాజప్పడు, పొట్నూ రు నారాయణమ్మ, దుర్గాసి రాముల పేరుమీద రెండేసి సార్లు నిధులు డ్రా చేసేశారు.  ఒకే రేషన్‌కార్డుపై రెండు మరుగుదొడ్లు బిల్లులు చేశారు. రెడ్డి స్వామినాయుడు, రెడ్డి సుబ్బలక్ష్మి భార్యభర్తలు పేరుపై రెండు మరుగుదొడ్లు నిర్మించినట్లు నిధులు తీసేసుకున్నారు.

ఇదంతా ఎలా చేశారు..
ఇంత దారుణంగా జనాన్ని మోసం చేసి, ప్రభుత్వ ధనాన్ని దర్జాగా కాజేయడానికి అక్రమార్కులు ఎంచుకున్న మార్గాలను అన్వేషిస్తే ఆశ్చర్యం కలుగక మానదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారుల గహాల వద్ద వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకునే ప్రదేశాన్ని ట్యాబ్‌లో ఫొటోతీసి ఆర్‌డబ్య్లూఎస్‌ వెబ్‌సైట్లో నమోదు చేయాలి. నిర్మాణ పనులు ప్రారంభించిన తర్వాత లబ్ధిదారులతో గుంత ఫొటో, పూర్తి చేసిన తర్వాత మరో ఫొటోను వెబ్‌సైట్‌లో ఉంచాలి. అయితే ఈ గ్రామంలో లబ్ధిదారులకే తెలియకుండా వారి ఫొటోలు వెబ్‌సైట్‌లోకి చేరిపోయాయి. కొందరికి పాత మరుగుదొడ్లు ఉన్నప్పటికీ వాటినే కొత్తవిగా చూపించారు. ఇంత జరుగుతుంటే పంచాయతీ స్పెషల్‌ æఆఫీసర్, పంచాయతీ కార్యదర్శి పట్టించుకోకపోవటాన్ని బట్టి వారికి తెలిసే ఈ వ్యవహారం జరిగినట్లు అర్థమవుతోంది.

ఉన్నతాధికారులు దర్యాప్తు చేయాలి:
మా గ్రామంలో ఓడీఎఫ్‌ నిర్మాణాల్లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణాల్లో అవకతవకలు జరిగినట్లు సష్టంగా తెలు స్తోంది. అలాగే, మరుగుదొడ్ల నిర్మాణాలను ప్రైవేటు కాంట్రాక్టర్‌కు అప్పజెప్పడంతో పనులన్నీ నాసిరకంగానే జరిగాయి. చాలా మరుగుదొడ్లను అసంపూర్తిగా నిర్మించి వదిలేశారు. ఉన్నతాధికారులు దర్యాప్తు చేపడితే జరిగిన అక్రమాలు బయటపడతాయి.
–రెడ్డి అప్పలనాయుడు, మాజీ సర్పంచ్, మల్యాడ గ్రామం

లబ్ధిదారులకు తెలియకుండానే..
తమ పేరుమీద మరుగుదొడ్డి మంజూరైందని, నిధులు కూడా వస్తే తీసుకుని వాడుకున్నామనే విషయాలు లబ్ధిదారులకే తెలియదు. ఈ గ్రామంలోని మామిడి అచ్చియ్యమ్మ, యడ్ల అసిరి నాయుడు, రెడ్డి అప్పలనాయుడు, గేదెల రాము, గేదెల లక్ష్మణరావుల ఒక్కొక్కరి పేరుమీద రూ.15వేలు చొప్పున మరుగుదొడ్ల నిధులు మంజూరైనట్లు తేలింది. వారిని విచారించగా తమకసలు ఆ నిధులు వచ్చినట్లుగానీ, మరుగుదొడ్డి మంజూరైనట్లుగానీ తెలియదని స్పష్టం చేశారు. తమ ఇళ్ల వద్ద మరుగుదొడ్లు కూడా నిర్మించలేదని వాపోయారు. ఇదెలా సాధ్యమో అక్కిడి పాలకులు, అధికారులే అడగాలి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top