హిందూపురంలో కరోనా కలకలం

దంపతులకు వైరస్ లక్షణాలు
హిందూపురం: హిందూపురం పట్టణంలో కరోనా అనుమానిత కేసు బుధవారం వెలుగుచూసింది. హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి దుబాయ్ నుంచి మార్చి 10వ తేదిన భారతదేశానికి వచ్చాడు. భార్య పిల్లలు హిందూపురంలోని సీపీఐ కాలనీలో పుట్టింటిలో ఉండడంతో వారిని కలిశాడు. మూడు రోజుల నుంచి అతనికి దగ్గు, గొంతు నొప్పి, జ్వరంగా ఉండడంతో కరోనా అనుమానంతో ఉందని వైద్యులకు సమాచారం అందింది. దీంతో హుటాహుటిన అతన్ని, భార్యను హిందూపురం ఐసోలేషన్ వార్డుకు తరలించారు. వైద్యులు చికిత్సలు అందించారు. ఇతనికి తీవ్రమైన దగ్గుతో పాటు జ్వరం ఉంది.
దీంతో పాటు కరోనా లక్షణాలు కనిపించడంతో అతన్ని తక్షణం అనంతపురం పెద్దాస్పత్రికి తరలించాల్సిందిగా సూచించారు. అలాగే అతని భార్యను కూడా విచారించగా ఆమెకు కూడా రెండు రోజులుగా ఒళ్లు నొప్పులతో పాటు జ్వరం వస్తోందని తెలిపింది. ఇరువురిని గట్టి వైద్య భద్రతతో అనంతపురం తరలించారు. బెంగళూరు నుంచి పలువురు బంధువులు వీరిని ఇటీవల కలిసినట్లు సమాచారం. వీరు ఉన్న ఇంటిలోనే వీరి మూడేళ్ల బాబు, అత్తయ్య కూడా ఉన్నట్లు తెలిసింది. మిగతావారిని ఇంట్లో క్వారంటైన్ ఉండాలని వైద్యులు సూచించారు. కాగా కరోనా అనుమానిత వ్యక్తి హిందూపురంకు వచ్చినప్పటి నుంచి గోరంట్ల, అనంతపురం, హిందూపురం ప్రాంతాల్లో సంచరించినట్లు డాక్టర్లకు వివరించారు. ఈ అనుమానిత కేసు వెలుగుచూడడంతో పట్టణంలో ఒక్కసారిగా ప్రచారం సాగి ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి