మళ్లీ నెత్తిన గ్యాస్ ‘బండ’! | cooking gas price increased | Sakshi
Sakshi News home page

మళ్లీ నెత్తిన గ్యాస్ ‘బండ’!

Dec 4 2013 3:58 AM | Updated on Sep 2 2017 1:13 AM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు పేదోడి బతుకు‘భారం’ చేస్తున్నాయి. అసలే వరుస తుపానులతోనూ, అకాల వర్షాలతోనూ పంటలు పాడై నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటున్న తరుణంలో గ్యాస్ ధర పెంచాలని తీసుకున్న నిర్ణయం సామాన్యుని పాలిట శాపంగా పరిణమిస్తుంది.

 సాక్షి, మచిలీపట్నం :

 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు పేదోడి బతుకు‘భారం’ చేస్తున్నాయి. అసలే వరుస తుపానులతోనూ, అకాల వర్షాలతోనూ పంటలు పాడై నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటున్న తరుణంలో గ్యాస్ ధర పెంచాలని తీసుకున్న నిర్ణయం సామాన్యుని పాలిట శాపంగా పరిణమిస్తుంది. ఇప్పటికే ఆధార్ మెలికతో సతమతవుతున్న గ్యాస్ వినియోగదారుల నెత్తిన ధరాఘాతమనే పిడుగు పడింది. కొద్ది రోజుల క్రితం డీజిల్ ధర  పెంచిన కేంద్రం సోమవారం నుంచి ఒక్కో గ్యాస్ సిలెండర్‌పై రూ.66.50 పెంచింది.

 

   అంతర్జాతీయ చమురు సంస్థలు ధరలు పెంచిన ప్రతీసారి గ్యాస్ ధర పెరుగుతుండటంతో భారంగా మారింది. పెరిగిన గ్యాస్ సిలెండర్ల ధరలను బట్టి గృహావసరాలకు ఉపయోగించే 14.2కిలోల గ్యాస్ సిలెండర్ పాత ధర రూ.1,042.50పైసలు కాగా, కొత్త ధర రూ.1,109.00పైసలు.  వాణిజ్య అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలెండర్ 19కిలోలకు రూ.105 పెరిగింది. పాత ధర రూ.1,777.00 నుంచి  1,882.00కి పెరిగింది. ఈ సిలెండర్లపై నగదు బదిలీ పథకంలో ప్రభుత్వం పాత ధరలో రూ.577.50సబ్సీడీగా ఇస్తే పెరిగిన ధరలో రూ.638.77పైసలు సబ్సీడీ ఇవ్వనుంది. జిల్లాలో 74గ్యాస్ ఏజన్సీలుండగా 10,87,319 గృహ వినియోగపు గ్యాస్ కనెక్షన్లున్నాయి. ఒక్కో సిలెండర్‌పై రూ.66.50చొప్పున పెరగడంతో జిల్లాలోని గ్యాస్ వినియోగదారులపై రూ.7,23,06, 713.50 అదనపు భారం పడనుంది.

 

 ఆధార్ మెలికతో అందని సబ్సీడీ

 నగదు బదిలీ పథకానికి ఆధార్ కార్డును ముడిపెట్టవద్దని న్యాయస్థానాలు ఆదేశిస్తున్నా, పలు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు గగ్గోలు పెడుతున్నా పాలకుల తీరు మాత్రం మారలేదు. ఇవేమి తమకు పట్టనట్టు జిల్లాలోని గ్యాస్ ఏజన్సీలు గ్యాస్ వినియోగదారులపై వత్తిడి చేసి మరీ ఆధార్ కార్డులు అడుగుతున్నారు. ఆధార్ కార్డు ఇవ్వకుంటే సబ్సీడీ లేకుండా గ్యాస్ కొనుక్కోవాలని బెదిరిస్తున్నారు. జిల్లాలో దాదాపు ఏడు లక్షల గ్యాస్ వినియోగదారులకు ఆధార్ కార్డు నెంబర్లను గ్యాస్ ఏజన్సీలకు ఇచ్చారు. వారిలో కేవలం సుమారు నాలుగు లక్షల మంది మాత్రమే ఆధార్ కార్డు, బ్యాంకు ఎక్కౌంట్లకు అనుసంధానం చేసుకున్నారు. కాగా, ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చిన గ్యాస్ వినియోగదారుల నుంచి ఆయా గ్యాస్ ఏజన్సీలు సబ్సీడీ లేకుండా గ్యాస్ ధర మొత్తాన్ని వసూలు చేస్తున్నారు.  వాటికి సంబంధించిన సబ్సీడీ మొత్తం వారి బ్యాంక్ ఎక్కౌంట్లలో జమ కావడంలేదని పలువురు గగ్గోలు పెడుతున్నారు. ఆధార్ విషయంలో జిల్లా యంత్రాంగం దృష్టిపెట్టి వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement