ఇక కంటైనర్‌ చెక్‌పోస్టులు

Container Check Posts For Marijuana Smugglers - Sakshi

గంజాయి అక్రమ రవాణాకు ఎక్సైజ్‌ చెక్‌

త్వరలో ఐదు చోట్ల ఏర్పాటు

రాష్ట్రంలో తొలిసారిగా జిల్లాలోనే ..

సాక్షి, విశాఖపట్నం: దేశంలోని వివిధ ప్రాంతా లకు గంజాయి అక్రమ రవాణా చేసే ప్రాంతాల్లో  విశాఖ జిల్లా అగ్రస్థానంలో ఉంది. విశాఖ ఏజెన్సీలో ఏటా పది వేల ఎకరాల్లో గంజాయి సాగవుతోంది. డిసెంబర్‌ నాటికి గంజాయి సాగు పూర్తవుతుంది. జనవరి నుంచి గంజాయి రవాణా  ఊపందుకుంటుంది. దీంతో స్మగ్లర్లు గంజాయి రవా ణాకు ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటున్నారు.

ఎక్సైజ్, పోలీసుల కళ్లుగప్పి స్మగ్లర్లు గంజా యిని వివిధ వాహనాలు, రైళ్లలో ఇతర ప్రాంతా లు, రాష్ట్రాలకు తరలించుకుపోతూనే ఉన్నారు. గంజాయి సాగు సీజను ముగిశాక   స్మగ్లర్లు వాటి రవాణాపైనే దృష్టి సారిస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని గంజాయి అక్రమ రవాణాకు చెక్‌ పెట్టడానికి చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలని ఎక్సైజ్‌ శాఖ అధికారులు ఎప్పట్నుంచో ఆలోచన చేస్తున్నారు. తొలుత విశాఖ జిల్లాలో పది చోట్ల వీటిని ఏర్పాటు చేయాలని భావించారు. అయితే ఇందుకు స్థలం సమస్య అడ్డంకిగా మారింది. కొన్నిచోట్ల రెవెన్యూ, మరికొన్ని చోట్ల అటవీ భూములు ఉన్నాయి. ఆ స్థలాల్లో చెక్‌పోస్టులకు అవసరమైన నిర్మాణాలకు ఆయా శాఖల నుంచి అనుమతులు రావాలంటే సుదీర్ఘ కాలం పడుతుంది.

దీంతో చెక్‌పోస్టుల ఏర్పాటు ఆలోచన ఉన్నా అడుగు ముందుకు పడడం లేదు. తాత్కాలికంగా కొన్ని ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నా అంతగా ఫలితం ఉండడం లేదు. ఫలితంగా గంజాయి రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ఎక్సైజ్‌ కమిషనర్‌ లక్ష్మీనరసింహం కొత్త ఆలోచన చేశారు. చెక్‌పోస్టుల నిర్మాణాలకు జాప్యం జరుగుతుందన్న ఉద్దేశంతో కంటైనర్‌ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటికయితే భూమి కేటాయింపులకు అవసరమైన ప్రక్రియలో పెద్ద జాప్యం ఉండదు.కంటైనర్లను కొనుగోలు చేసి వాటిని నిర్దేశిత ప్రాంతాలకు తరలిస్తారు. అక్కడ వాటిని చెక్‌పోస్టులకు వీలుగా మార్పులు చేసి వినియోగంలోకి తెస్తారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఒక్కో కంటైనర్‌ను రూ.4.50 లక్షలు వెచ్చించి కొనుగోలు చేయనున్నారు. కాగా కంటైనర్‌ చెక్‌పోస్టులను ఇప్పటిదాకా రాష్ట్రంలో ఎక్కడా ఏర్పాటు చేయలేదు.  రాష్ట్రంలోనే విశాఖలో తొలిసారిగా ఏర్పాటు చేస్తుండడం విశేషం.  

వంద మందికి పైగా అవసరం..
ఒక్కో చెక్‌పోస్టులో షిఫ్టుకు ఒక సీఐ/ఎస్‌ఐ, ఏడెనిమిది మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబు ళ్లు అవసరమవుతారు. ఈ లెక్కన ఒక్కో చెక్‌పోస్టుకు 20–25 మంది చొప్పున ఐదింటిలో 100 మందికి పైగా సిబ్బంది కావల్సి ఉంటుంది. ఇప్పటికే ఎక్సైజ్‌ శాఖ సిబ్బంది కొరతతో సతమతమవుతోంది. అయినప్పటికీ గంజాయి రవాణాకు చెక్‌ పెట్టాలన్న లక్ష్యంతో సిబ్బందిని చెక్‌పోస్టులకు సర్దుబాటు చేయాలని ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు యోచిస్తున్నారు.

ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే..
ఏజెన్సీ నుంచి వివిధ ప్రాంతాలకు గంజాయి రవాణా జరిగే ప్రధాన జంక్షన్లయిన కేడీపేట సమీపంలోని భీమవరం, చింతపల్లి రోడ్డులోని డౌనూరు, పాడేరు సమీపంలోని వంట్లమామిడి, అరకు  చేరువలో ఉన్న సీతన్నపాలెం, దేవరాపల్లిలో  ఈ   చెక్‌పోస్టులను ఏర్పాటు చేయనున్నారు. తమ శాఖ కమిషనర్‌ ప్రతిపాదించిన కంటైనర్‌ చెక్‌పోస్టులు సాధ్యమైనంత త్వరలోనే కార్యరూపం దాల్చే అవకాశం ఉందని ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ టి.శ్రీనివాసరావు ‘సాక్షి’కి చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top