రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం కేబినెట్ నోట్ ప్రకటిస్తే అది ఆ పార్టీకి సూసైడ్ నోట్ అవుతుందని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్య నిర్వాహక మండలి సభ్యురాలు ఆర్కే రోజా అన్నారు.
పుత్తూరు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం కేబినెట్ నోట్ ప్రకటిస్తే అది ఆ పార్టీకి సూసైడ్ నోట్ అవుతుందని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్య నిర్వాహక మండలి సభ్యురాలు ఆర్కే రోజా అన్నారు. సోమవారం పుత్తూరులో నిర్వహించిన సమైక్య రైతు శంఖారావంలో ఆమె మాట్లాడారు. విభజన అంశంపై సీమాంధ్ర ఉద్యమకారులు ఏదైనా చెప్పుకోవాలంటే ఆంటోని కమిటీ పరిశీలిస్తుందని తెలిపిన కాంగ్రెస్ పెద్దలు ఆ కమిటీ నివేదిక ఇవ్వక ముందే తెలంగాణా పై నోట్‌ను ఎందుకు వేగవంతం చేస్తున్నారని ప్రశ్నించారు.
సమైక్యాంధ్ర ఉద్యమంపై కొందరు హేళనగా మాట్లాడటం సరికాదన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం పేద ప్రజల రెక్కల్లోనించి వచ్చిందన్నారు. జీతాల కన్నా జీవితాలే ముఖ్యమంటూ ఉద్యోగులు సైతం ముందుకొస్తున్నారన్నారు. విద్యార్థులు కూడా తమ భవిష్యత్తును ఫణంగా పెట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి చేస్తున్న ఉద్యమాన్ని ఎవరైనా హేళన చేసి మాట్లాడితే వారికి పుట్టగతులుండవన్నారు. సీమాంధ్ర ఉద్యమంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు అధిష్టానంతో ఎందుకు గట్టిగా మాట్లాడలేక పోతున్నారని ప్రశ్నించారు. వారంతా తమ పదవులు కాపాడుకునేందుకే ఢిల్లీ వదలి రావడం లేదని, ఒకవేళ వస్తే ఆ యా నియోజకవర్గాల్లో ప్రజలు కొడతారనే భయం వారిని వెంటాడుతోందన్నారు.
ట్రాక్లర్ల ర్యాలీ
సమైక్య రైతు శంఖారావంలో భాగంగా సోమవారం పుత్తూరులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో ఆర్కే. రోజా ట్రాక్టర్ నడిపి నిరసన వ్యక్తం చేశారు. ముందుగా స్థానిక ఆరేటమ్మ ఆలయం నుంచి ర్యాలీ ప్రారంభమై కాపు వీది, బజారు వీధి నుంచి అంబేద్కర్ సర్కిల్ మీదుగా గేట్ పుత్తూరు, ఆర్డీఎం సర్కిల్ వరకు సాగింది. అనంతరం రోజా ఎండ్ల బండిపై ఎక్కి ప్రదర్శనగా అంబేద్కర్ సర్కిల్‌కు చేరుకుని విగ్రహానికి పూలమాల వేసి విభజన అంశం రద్దు చేసేవిధంగా కాంగ్రెస్ పెద్దలకు బుద్ధి ప్రసాదించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ముందుగా ట్రాక్టర్ ర్యాలీని జిల్లా కన్వీనర్ నారాయణస్వామి ప్రా రంభించారు. సత్యవేడు సమన్వయకర్త ఆదిమూలం, జెడ్పీటీసీ మాజీ సభ్యులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఎం. సురేంద్రరాజు, నగరి, పుత్తూరు, నిండ్ర, వడమాలపే ట, విజయపురం నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.