వెనామీకి ‘స్పాట్’


ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: రొయ్యలు సాగుచేసే రైతుల ఆశలు ఆవిరయ్యాయి. రెండేళ్లుగా లాభాల బాటలో నడిచిన వెనామీ రైతులను ఒక్కసారిగా సమస్యలు చుట్టుముట్టాయి. ప్రతికూల వాతావరణానికి తోడు..వైట్‌స్పాట్ తెగులు వ్యాపించడం రొయ్యల రైతులకు శాపంగా పరిణమించాయి. జీరో సెలనిటీలో సైతం జీవించగల వెనామీ రొయ్యలు వ్యాధుల బారిన పడటం మొదలైంది. టైగర్ రొయ్య కనుమరుగయ్యేందుకు కారణమైన వైట్‌స్పాట్ వెనామీ రొయ్యలకు సోకడంతో రైతులు అర్ధంతరంగా చెరువులను ఖాళీ చేస్తున్నారు. ఐదు రోజుల నుంచి ధరల పతనం

 ఐదు రోజుల నుంచి రొయ్యల ధరలు పతనమవుతున్నాయి.  ఆశాజనకంగా ఉన్న ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. కిలో రొయ్యలు రూ.100 నుంచి రూ.200 వరకు తగ్గింది. భారీగా ఖర్చుపెట్టి సాగు చేసిన పంటకు ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో ఇంకా ఎక్కడ పూర్తిగా తగ్గిపోతాయేమోనని వచ్చిన కాడికి చెరువుల్లో రొయ్యలు పట్టేస్తున్నారు. ప్రతికూల వాతావరణం:

 వాతావరణం ప్రతినుకూలంగా ఉండడంతో వెనామీ రొయ్యలు తట్టుకోలేకపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ దాటడం వల్ల ఆక్సిజన్ అందక ఎదుగుదల పూర్తిగా నిలిచిపోయింది. పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడం, రాత్రి వేళల్లో మంచు కురవడంతోపాటు 20 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడం కూడా రొయ్యలు అనారోగ్యం బారిన పడడానికి కారణ మైంది. ఎన్ని ఏరేటర్స్ పెట్టినా అవి వాతావరణ పరిస్థితులు తట్టుకోలేక వృద్ధి మందగించింది. రైతులు సాగులో ఉన్న రొయ్యలను ఏ విధంగా కాపాడుకోవాలా అని మదనపడుతుంటే పుండుమీద కారంలా రొయ్యల వ్యాపారులు సిండికేట్‌గా మారి రొయ్యల ధరలను తగ్గించేస్తున్నారు. ఊపిరి సలుపుకోని రైతులు వ్యాపారుల ఎత్తుగడకు తలొగ్గక తప్పలేదు. సాధారణంగా 30 కౌంట్ వచ్చే వరకు ఉంచాల్సిన రొయ్యలను 60 కౌంట్ లేదా 70 కౌంట్‌కే చెరువులను ఖాళీ చేయాల్సిన పరిస్థితి నెలకొంటోంది. లాభాలు రాకపోయినా ఫరవాలేదు, పెట్టుబడులు వస్తే చాలన్న ఆలోచనలో రైతులున్నారు. సగానికి పడిపోయిన సాగు

 వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రొయ్యల చెరువుల సాగు విస్తీర్ణం ఇప్పటికే సగానికి పడిపోయింది. సాధారణంగా డిసెంబర్ నుంచే రొయ్యల సాగుకు ఉపక్రమిస్తారు. జనవరిలో రొయ్య పిల్లలను వదులుతారు. అప్పటికే రొయ్యల సీడ్ నాణ్యమైనది దొరక్కపోవడంతో కొంతమేర సాగు చేయలేదు. జిల్లాలో మొత్తం 5 వేల ఎకరాల్లో గతేడాది రొయ్యల సాగు చేపట్టారు. అలాంటిది ఈ ఏడాది వెయ్యి ఎకరాలకు పైగా సాగు చేయకుండా వదిలేశారు. నాలుగైదు చెరువులు సాగు చేసే రైతులు మూడు చెరువులకు కుదించుకున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో 1500 ఎకరాల మేర చెరువుల్లో వేసిన రెండు నెలలకే వచ్చిన వరకు తీసేశారు. వాతావరణం అనుకూలించకపోవడంతోపాటు వైట్‌స్పాట్ వ్యాధి సోకడంతో ఇంకా ఉంచితే నష్టపోతామని చెరువులను ఖాళీ చేశారు. వైట్‌స్పాట్‌తోపాటు, లూజ్‌షెల్ వ్యాధి కూడా సోకి ఎదుగుదలను కట్టడి చేసింది. వీటికి తోడు ఫంగస్ వ్యాధి కూడా రొయ్యలను వెంటాడుతోంది. జిల్లాలో దాదాపు 2500 ఎకరాల్లోపు మాత్రమే ప్రస్తుతం సాగులో ఉన్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top