మన రొయ్య...మళ్లీ వెళ్తుందయ్యా | India preparing to ship 40000 tonnes of shrimp to US after tariff pause | Sakshi
Sakshi News home page

మన రొయ్య...మళ్లీ వెళ్తుందయ్యా

Published Tue, Apr 15 2025 5:58 AM | Last Updated on Tue, Apr 15 2025 5:58 AM

India preparing to ship 40000 tonnes of shrimp to US after tariff pause

ట్రంప్‌ ట్యాక్స్‌ పెంపు వాయిదాతో ఊరట

అమెరికాకు ఎగుమతికి సిద్ధంగా 2వేల కంటైనర్లు

ప్రస్తుతానికి పాత సుంకాలతోనే ఎగుమతులు

కొత్త ట్యాక్స్‌ వాయిదాతో రూ.600 కోట్ల ఆదా

కోల్డ్‌ స్టోరేజ్‌ల్లోనూ మరో 2,500 కంటైనర్ల సరుకు

సాధ్యమైనంత త్వరగా ఎగుమతి చేసేందుకు సన్నాహాలు

సాక్షి, అమరావతి: దిగుమతి సుంకాల అమలు మూడు నెలల పాటు వాయిదా వేస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం రొయ్యల ఎగుమతిదారులకు ఊరటనిచ్చింది. దీంతో రొయ్యలను అమెరికాకు తరలించేందుకు భారతీయ సముద్ర ఆహారోత్పత్తుల ఎగుమతుదారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఎగుమతికి సిద్ధంగా 40వేల టన్నులు 
చైనా మినహా భారత్‌తో సహా మిగిలిన దేశాలపై టారిఫ్‌ అమలును 3 నెలల పాటు వాయిదా వేస్తున్నట్టు ట్రంప్‌ ప్రకటించడం ఎగుమతిదారులకు కలిసొచ్చింది. దీంతో ఎగుమతికి సిద్ధంగా ఉన్న 2వేల కంటైనర్ల (40వేల టన్నులు) సరుకును పాత టారిఫ్‌ ప్రకారం అమెరికాకు పంపేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని పరిశ్రమ వర్గాలు సోమవారం తెలిపాయి. ఇదిలా ఉండగా సుంకాల భయాలున్నప్పటికీ  ఆర్డర్లు తగ్గలేదని భారతీయ సముద్ర ఆహారోత్పత్తుల ఎగుమతుదారుల సమాఖ్య కార్యదర్శి కేఎన్‌ రాఘవన్‌ ప్రకటించారు.

భారత్‌కు అతిపెద్ద మార్కెట్‌ అమెరికా
రొయ్యల ఎగుమతుల్లో భారత్‌కు అతిపెద్ద మార్కెట్‌ అమెరికా. అగ్రరాజ్యానికి ఆహార, మత్స్య ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశాల్లో 42.3%తో భారత్‌ మొదటి స్థానంలో నిలవగా, 26.9 % తో ఈక్విడార్‌ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత ఇండోనేషియా (15.4%), వియత్నాం (7.2 %), థాయిలాండ్‌(2.4%), అర్జెంటీనా (2.1%)  ఉన్నాయి. 2023–24 సీజన్‌లో అమెరికాకు 2.7 బిలియన్‌ డాలర్ల విలువైన రొయ్యలను భారత్‌ ఎగుమతి చేసింది.

ట్రంప్‌ ప్రతీకార నిర్ణయంతో ప్రతికూలతలు 
ఈ నెల 4న ట్రంప్‌ ప్రభుత్వం విధించిన ప్రతీకార టారిఫ్‌ (26 శాతం) దేశీయంగా ఆక్వా రంగాన్ని కుదిపేసింది. ఈ పెంపు ఈ నెల 9 నుంచి అమలులోకి వచ్చి ఉంటే కౌంటర్‌ వెయిలింగ్‌ డ్యూటీ 5.77 శాతం, యాంటీ డంపింగ్‌ డ్యూటీ 3.88 శాతంతో పాటు తాజాగా విధించిన 26 శాతం కలిపి 34 శాతం సుంకాలు చెల్లించాల్సి వచ్చేది. ఆ మేరకు ఇప్పటికే సిద్ధంగా ఉన్న 2 వేల కంటైనర్లపై సుంకాల భారం రూ.600 కోట్లపైగా పడేది.

ఇక కోల్డ్‌ స్టోరేజ్‌ల్లో ఉన్న మరో 2,500 కంటైనర్ల సరుకుపై పడే భారం కలిపితే రూ.1300 కోట్లకుపైగా ఉండేది. ఈ పరిణామం ఎగుమతిదారులను కలవరానికి గురిచేసింది. ఇదే సమయంలో ట్రంప్‌ ట్యాక్స్‌ సాకుతో అమెరికాకు ఎగుమతి కాని కౌంట్‌ ధరలను కూడా కంపెనీలు తగ్గించడంతో ఆక్వా రైతులు నష్టాల బారిన పడ్డారు. అయితే మరో మూడు నెలలపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో ఉన్న తక్కువ సమయాన్ని అందిపుచ్చుకునేందుకు  ఎగుమతిదారులు ప్రయత్నిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement