మాది గొప్ప సంబంధం.. మళ్లీ కలవడం ఆనందంగా ఉంది | Trump Xi Jinping Meet In South Korea After 6 Years Videos Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

మాది గొప్ప సంబంధం.. మళ్లీ కలవడం ఆనందంగా ఉంది

Oct 30 2025 8:59 AM | Updated on Oct 30 2025 10:21 AM

Trump Xi Jinping meet in South Korea After 6 Years Videos Viral

వాణిజ్య ఉద్రిక్తతల వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ముఖాముఖి మాట్లాడుకున్నారు. దక్షిణ కొరియా బుసాన్‌లో గురువారం ఆసియా–పసిఫిక్‌ ఆర్థిక సహకార సదస్సు(APEC) సమ్మిట్ వేదికగా ఈ ఇరు దేశాధినేతలు భేటీ అయ్యారు. దాదాపు ఆరేళ్ల తర్వాత.. కరచలనం చేసుకుంటూ నవ్వుకుంటూ ఇద్దరూ మీడియా ముందు ఫోజులిచ్చారు.  ఆపై ఇరు దేశాల ప్రతినిధులతో ప్రత్యేక భేటీ జరిపారు.

‘‘మా మధ్య మంచి పరిచయం ఉంది. మాది గొప్ప సంబంధం. మళ్లీ ఇలా కలుసుకోవడం ఆనందంగా ఉంది. వాణిజ్య ఒప్పందం వీలైనంత త్వరగానే కుదిరే అవకాశం ఉంది అంటూ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. మీరు తిరిగి అధ్యక్షుడయ్యాక మూడుసార్లు ఫోన్‌లో మాట్లాడాం, చైనా-అమెరికా ఆర్థిక సంబంధాలు స్థిరంగా ఉన్నాయి. అమెరికాను గొప్ప దేశంగా మార్చే దృష్టితో చైనా అభివృద్ధి సాగుతోంది అని జిన్‌పింగ్‌ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా.. ఇరు దేశాల సంబంధాలు స్నేహపూర్వకంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. అదే సమయంలో.. 

చైనా-అమెరికా.. రెండు ప్రపంచ శక్తులు. అవి ఎప్పుడూ ఒకే అభిప్రాయంలో ఉండకపోవడం సహజం. పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటం కూడా సహజమే. కానీ వాటిని ద్వైపాక్షిక సంబంధాల చర్చల ద్వారా అధిగమించి ముందుకు ఎలా సాగుతామనేదే ముఖ్యం అని జిన్‌పింగ్‌ వ్యాఖ్యానించడం కొసమెరుపు. 

మరోవైపు.. గాజా కాల్పుల విరమణలో ట్రంప్ పాత్రపై జిన్‌పింగ్‌ ప్రశంస గుప్పించారు. ప్రపంచ శాంతికి ఈ ఒప్పందం మీరు చేసిన గొప్ప కృషి  అని అన్నారాయన. ఇలాంటి శాంతి చర్చలకు చైనా మద్దతు తప్పకుండా ఉంటుందని పేర్కొన్నారు. అంతకు ముందు.. 

తమ భేటీ విజయవంతం అవుతుందనే ట్రంప్‌ ధీమా వ్యక్తం చేశారు. ‘‘నాకు ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆయన(జిన్‌పింగ్‌) చాలా కఠినమైన చర్చాకర్త. అది ఏమాత్రం మంచిది కాదు’’ అంటూ అక్కడ నవ్వులు పూయించారు. 

ఇదిలా ఉంటే.. 2018లో ప్రారంభమైన ట్రంప్-చైనా వాణిజ్య యుద్ధం 2025లో మళ్లీ ఉద్రిక్తతలకు దారితీసింది. ట్రంప్‌ సుంకాల బెదిరింపులు..  చైనా కూడా తన "రేర్ ఎర్త్ మినరల్స్" ఎగుమతులపై నియంత్రణలను విధించడంతో పరిస్థితి క్షీణించసాగింది. ఈ తరుణంలో..  

తాజా భేటీ చైనా–అమెరికా మధ్య వాణిజ్య సంబంధాల పునరుద్ధరణకు దారితీసే అవకాశం ఉందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జియాకున్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలతోపాటు ద్వైపాక్షిక అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చిస్తారని, ఆసియా–పసిఫిక్‌ ఆర్థిక సహకార సదస్సులో జరుగుతున్న భేటీ సానుకూలమైన ఫలితాలు వస్తాయన్న నమ్మకం ఉందన్నారు.    

అయితే ట్రంప్‌-జిన్‌పింగ్‌ల భేటీ కంటే ముందే ట్రేడ్‌ డీల్‌కు సంబంధించిన ఒప్పందం ఖరారైనట్లు సంకేతాలు అందుతున్నాయి. దీని ప్రకారం.. అమెరికా సుంకాలను నిలిపివేయడం, అలాగే.. చైనా కూడా తన "రేర్ ఎర్త్ మినరల్స్" నియంత్రణలను ఒక సంవత్సరం పాటు వాయిదా వేయడం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement