కార్పొరేషన్‌లో అయోమయం | Confused Corporation | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్‌లో అయోమయం

Dec 4 2014 2:09 AM | Updated on Jul 11 2019 6:33 PM

కార్పొరేషన్‌లో అయోమయం నెలకొంది. ఇటీవల కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్వర్వులిచ్చారు. వారిని రిలీవ్ చేసేందుకు ఉన్నతాధికారులు నిరాకరిస్తున్నారు.

 నెల్లూరు సిటీ: కార్పొరేషన్‌లో అయోమయం నెలకొంది. ఇటీవల కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్వర్వులిచ్చారు. వారిని రిలీవ్ చేసేందుకు ఉన్నతాధికారులు నిరాకరిస్తున్నారు. మరి కొందరు బదిలీపై వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నప్పటికీ..గడువు ముగియడంతో నిరాశకు లోనయ్యారు.
 
 ఈ పరిస్థితులన్నీ అయోమయానికి దారి తీస్తున్నాయి. బదిలీ కోరుకుంటున్న వారు, బదిలీ అయిన వారు విధులపై శ్రద్ధ చూపడం లేదనే విమర్శలున్నాయి. దీంతో రోజువారీ పనుల్లో జాప్యం జరుగుతోంది. కార్పొరేషన్ ఇంజనీరింగ్  విభాగంలో ముగ్గురు ఈఈలు ఉన్నారు. రెండు వారాల కిందట ముగ్గురిని వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఉత్తర్వులిచ్చింది. వీరిలో సంపత్‌కుమార్‌ను మాత్రమే ఉన్నతాధికారులు రిలీవ్ చేశారు. పారిశుధ్య, తాగునీటి విభాగాల ఏఈలు వెంకటరావు, శ్రీనివాసరావులను రిలీవ్ చేయలేదు. ఈఈ శ్రీనివాసరావు స్థానంలో గ్రేటర్ విశాఖపట్నం నుంచి కేవీఎన్ రవి రానున్నారు. ఆయన వచ్చే వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈఈ వెంకటరమణ స్థానంలో ఎవరినీ కేటాయించలేదు. దీంతో వెంకటరమణనే కొనసాగే అవకాశం ఉంది. బదిలీపై నెల్లూరుకు వచ్చేందుకు అధికారులు ఇష్టపడలేని సమాచారం.
 
 ఇదే సమయంలో బదిలీలను రద్దు చేయించుకునేందుకు నెల్లూరుకు రావాల్సిన ఈఈలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సమాచారం. దీంతో ఇక్కడ పని చేస్తున్న వారిని వెంటనే రిలీవ్ చేసేందుకు ఉన్నతాధికారులు అంగీకరించడం లేదు. కొత్తవారు విధుల్లో చేరకపోతే ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అయితే ఇక్కడ రాజకీయ ఒత్తిళ్లు అధిగమించాలంటే బయటకు వెళ్లడమే మంచిదనే అభిప్రాయంలో బదిలీ ఉత్తర్వులు అందుకున్న ఈఈలు ఉన్నారు.
 
 బదిలీ కోసం ఏడుగురు
 ఏఈలు దరఖాస్తు
 కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగంలో పని చేస్తున్న ఏడుగురు ఏఈలు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో జీఎస్‌ఆర్ ప్రసాద్, ఎస్‌కే ముజాహుద్దీన్‌లకు మాత్రమే స్థానభ్రంశం కలిగింది. ప్రసాద్‌ను మాత్రమే అధికారులు రిలీవ్ చేశారు. ముజాహుద్దీన్‌ను బదిలీ చేసినప్పటికీ ఆయన స్థానంలో ఎవరినీ కేటాయించలేదు. దీంతో ఆయన కొనసాగుతున్నారు.
 
 విధుల్లోకి కొత్త డీఈలు
 ఐదుగురు డీఈలకు గాను ముగ్గురు బదిలీ అయ్యారు. వీరి స్థానంలో కొత్తవారు చేరారు. నెల్లూరు కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగంలో గతంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలు తమ మెడకు చుట్టుకోకమునుపే బయటకు వెళ్లేందుకు పలువురు అధికారులు సిద్ధమయ్యారు. కార్పొరేషన్ రాజకీయాల్లో ఎత్తులు, పైఎత్తుల్లో తాము బలికాక తప్పదనే భయం కొందరిలో ఉంది.
 
 అంతేకాకుండా కమిషనర్‌గా ఐఏఎస్ అధికారిని నియమించడంతో ఇకపై తమ ఆటలు సాగవని కొందరు భావిస్తున్నారు. మొత్తంమీద ఇంజనీరింగ్ విభాగం ప్రక్షాళన జరిగినందుకు సంతోషించాలో, కొత్త అధికారులు ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపనందుకు బాధపడాల్లో తెలియక ఉన్నతాధికారులు ఆందోళనకు గురవుతున్నారు. నెల్లూరు నగర పాలక సంస్థపై పూర్తి అవగాహన కలిగిన ఇమాముద్దీన్ సూపరింటెండెంట్‌గా రావడం కొంత మేలు చేసే అంశం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement