భూసేకరణపై కసరత్తు | collectors busy on land acquisition | Sakshi
Sakshi News home page

భూసేకరణపై కసరత్తు

Sep 26 2014 1:50 AM | Updated on Apr 3 2019 8:42 PM

నూతన రాజధాని నిర్మాణానికి కావాల్సిన భూమిని సేకరించే ప్రయత్నాలను ప్రభుత్వం ముమ్మరం చేసింది.

సాక్షి, గుంటూరు: నూతన రాజధాని నిర్మాణానికి కావాల్సిన భూమిని సేకరించే ప్రయత్నాలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. భూ సేకరణకోసం ఏర్పాటైన మంత్రుల కమిటీతో గురువారం గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లు సమావేశమై జిల్లాలోని మొత్తం భూముల వివరాలు అందించినట్లు తెలుస్తోంది. ఇందులో ఎక్కువ శాతం ప్రభుత్వ, అటవీ భూములు లేకపోవడంతో రాజధాని నిర్మాణానికి అవసరమైన భూములను రైతుల నుంచి ఎలా సేకరించాలి, వారికి ఏ విధమైన ప్యాకేజీ ఇవ్వాలి అనే దానిపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.

జిల్లాకు సంబంధించి మొత్తం 28,13,510 ఎకరాల భూమి ఉండగా, . ఇందులో మొత్తం 4,00157.29 ఎకరాల అటవీ భూములని రెవెన్యూ రికార్డులు తెలుపుతున్నాయి. మూడు నెలలుగా రెవెన్యూ అధికారులు, లాండ్ సర్వే అధికారులు భూముల స్థితిగతులు గుర్తించారు. వివరాలను సర్వే బృందాలు పరిశీలించి ఓ మ్యాపు తయారు చేసినట్టు తెలుస్తోంది. హైవే పక్కన అందుబాటులో ఉన్న భూములు, మండల వ్యాప్తంగా ఉన్న భూములు, కృష్ణానదీ పరివాహక ప్రాంతంలోని భూములు, ఉడా పరిధిలోని 27 మండలాలకు సంబంధించిన భూముల వివరాలు, మ్యాపులను వివిధ కోణాల్లో తయారు చేయించి నివేదికను హైదరాబాద్ తీసుకెళ్లిన కలెక్టర్ మంత్రుల కమిటీకి, సీఎంకి అందించినట్లు తెలుస్తోంది.

ఇందులో మూడు మండలాలకు సంబంధించిన మ్యాపులను కమిటీ ప్రత్యేకంగా అడిగినట్లు సమాచారం. ఉడా పరిధిలోని ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, గుంటూరు రూరల్, మేడికొండూరు, పెదకూరపాడు, అమరావతి, పెదకాకాని, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో సైతం ఇటీవల రెవెన్యూ అధికారులు ప్రత్యేకంగా సర్వే చేశారు. దీంతో పాటు తెనాలి డివిజన్‌లోని ఐదు మండలాల్లోనూ సర్వే జరగడం గమనార్హం. మొత్తం సమాచారం ఆధారంగా భూసేకరణపై మంత్రుల కమిటీ అధ్యక్షుడు నారాయణ, సభ్యుడు గల్లా జయదేవ్ గుంటూరు, కృష్ణా జిల్లా కలెక్టర్లతో చర్చించారు.
 
సీఎంతో సమావేశం : మంత్రులు కలెక్టర్లతో చర్చించాక అందరు కలిసి లేక్‌వ్యూ అతిథి గృహంలో సీఎంతో రాత్రి సమావేశం అయ్యారు. గుంటూరు కలెక్టర్ అందజేసిన నిపేదికపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. ల్యాండ్ పుల్లింగ్ ద్వారా భూసేకరణ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement