టమాటా రైతుల సమస్యలపై సీఎం జగన్‌ ఆరా

CM YS Jagan Orders To Officials Over Tomato Growers Problems - Sakshi

సాక్షి, అమరావతి : తక్షణమే మార్కెటింగ్‌ శాఖ నుంచి టమాటా కొనుగోళ్లు మొదలుపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో పత్తికొండ మార్కెట్‌ యార్డులో టమాటా కొనుగోళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. టమాటా రైతుల సమస్యపై శనివారం ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా టమాటా కొనుగోలులో తలెత్తిన సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ క్రమంలో పండ్లు, కూరగాయలను డీ రెగ్యులేట్‌ చేశామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. తద్వారా మార్కెట్‌ ఫీజు లేకుండా.. ఏజెంట్లకు కమిషన్‌ ఇవ్వకుండా రైతులు అమ్ముకోవచ్చని వివరించారు. ఈ నేపథ్యంలో ఏజెంట్లు టమోటా కొనుగోలు నిలిపేశారని పేర్కొన్నారు. పత్తికొండ మార్కెట్లో కాకుండా మార్కెట్‌ బయటకు వచ్చి అమ్మితేనే కొంటామని ఏజెంట్లు రైతులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని సీఎం జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. అయితే మార్కెట్లో మాత్రమే తాము అమ్ముతామని రైతులు ఏజెంట్లకు స్పష్టం చేశారని వెల్లడించారు.

ఈ క్రమంలో ఏది ఏమైనా రైతులు ఇబ్బందులు పడకూడదని సీఎం జగన్‌ అధికారులతో పేర్కొన్నారు. మార్కెట్లో పరిస్థితులను సరిదిద్దడానికి తగిన చర్యలు తీసుకుని వెంటనే మార్కెటింగ్‌ శాఖ నుంచి కొనుగోళ్లు మొదలుపెట్టాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ ఆదేశాలతో పత్తికొండ మార్కెట్‌యార్డులో టమాటా కొనుగోళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. ధరలు తగ్గకుండా వేలంపాటలో పాల్గొంటూ మార్కెటింగ్‌ శాఖ అధికారులు సైతం పాల్గొంటున్నారు. ఇక ఉదయం నుంచి 50 టన్నుల టమాటా అమ్ముడుపోయింది. ఇందులో ధరల స్థిరీకరణ నిధి కింద 5 టన్నుల వరకూ మార్కెటింగ్‌ శాఖ అధికారులు కొనుగోలు చేశారు. దీంతో ప్రస్తుతం వ్యాపారస్తులు సైతం ముందుకు వచ్చి టమాటాను కొనుగోలు చేస్తున్నారని మార్కెటింగ్‌శాఖ కమిషనర్‌ ప్రద్యుమ్న వెల్లడించారు. అదే విధంగా రైతులను ఇబ్బందులకు గురిచేసిన ఏజెంట్లపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top