ప్రాజెక్టుల బాటకు శ్రీకారం

CM YS Jagan Mohan Reddy plan to complete irrigation projects construction works - Sakshi

నిర్మాణంలోని సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రణాళిక

పోలవరం మినహా మిగతా ప్రాజెక్టులకు రూ.25,698 కోట్లతో అంచనా

పోలవరం 41.15 మీటర్ల కాంటూర్‌ వరకు రూ.11,379 కోట్లు, 45.72 మీటర్ల కాంటూర్‌ వరకు రూ.31,825 కోట్లు అవసరమని అంచనా

క్షేత్ర స్థాయిలో పనులు తనిఖీ చేసి, దిశా నిర్దేశం చేయాలని నిర్ణయం

ఇందులో భాగంగా నేడు ‘వెలిగొండ’ పనులపై క్షేత్ర స్థాయి పరిశీలన

27న పోలవరం సందర్శన.. అక్కడే సమీక్షించనున్న సీఎం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో (ఆన్‌ గోయింగ్‌) ఉన్న సాగు నీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని జల వనరుల శాఖకు దిశా నిర్దేశం చేసిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. క్షేత్ర స్థాయిలో వాటి పనులను తనిఖీ చేయడానికి శ్రీకారం చుట్టారు. తనిఖీ అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, పనులకు అడ్డంకిగా మారిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం ద్వారా ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేయడానికి ప్రణాళిక రచించారు. ఇందులో భాగంగా గురువారం వెలిగొండ ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. తనిఖీ అనంతరం ప్రాజెక్టు వద్దే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, ప్రకాశం జిల్లా కలెక్టర్, ఆ ప్రాజెక్టు అధికారులు, సహాయ, పునరావాస విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

తొలి దశను ఈ ఏడాది పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేయనున్నారు. జలయజ్ఞంలో భాగంగా దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004లో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పనులు 2009 వరకూ శరవేగంగా సాగాయి. ఆయన హఠాన్మరణంతో ప్రాజెక్టులకు గ్రహణం పట్టుకుంది. వంశధార, తోటపల్లి, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, చింతలపూడి ఎత్తిపోతల నుంచి గోదావరి డెల్టా, ఏలేరు ఆయకట్టు ఆధునికీకరణ దాకా అన్ని ప్రాజెక్టుల పనులు పడకేశాయి. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో శరవేగంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని జలవనరుల శాఖ అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. (‘పవర్‌’ఫుల్‌ సెక్టార్‌)
 
మూడు ప్రాధాన్యతల కింద వర్గీకరణ 
ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవసరమైన వ్యయం.. కొత్తగా సాగులోకి వచ్చే ఆయకట్టు ఆధారంగా (రూ.500 కోట్ల లోపు వ్యయంతో పూర్తి కావడం, కొత్తగా లక్ష ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చే ప్రాజెక్టులను తొలి ప్రాధాన్యతగా వర్గీకరించారు. రూ.500 కోట్ల కంటే ఎక్కువ వ్యయం.. కొత్తగా 20 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చే ప్రాజెక్టులను ద్వితీయ ప్రాధాన్యతగా చేపట్టాలని ప్రతిపాదించారు. ఈ రెండు విభాగాల్లోకి రాని ప్రాజెక్టులు తృతీయ ప్రాధాన్యత) 32 ప్రాజెక్టులను మూడు ప్రాధాన్యతల కింద జలవనరుల శాఖ అధికారులు వర్గీకరించారు. వాటిని పూర్తి చేయడానికి రూ.25,698 కోట్లు అవసరం అవుతాయని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అధికారులు నివేదించారు. ప్రాధాన్యత క్రమంలో వాటిని పూర్తి చేయడం ద్వారా 10,87,360 ఎకరాలకు నీళ్లందించడంతోపాటు 16,34,821 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చునని అధికారులు సీఎంకు వివరించారు.

పోలవరం ప్రాజెక్టును 41.19 మీటర్ల కాంటూర్‌ వరకు పూర్తి చేయడానికి రూ.11,379 కోట్లు.. 45.72 మీటర్ల కాంటూర్‌ వరకు పూర్తి చేయడానికి రూ.31,825 కోట్లు అవసరమవుతాయని నివేదించారు. పోలవరం మినహా మిగతా ప్రాజెక్టుల్లో.. తొలి ప్రాధాన్యతగా గుర్తించిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రూ.20,872 కోట్లు, ద్వితీయ ప్రాధాన్యత కింద చేపట్టిన ప్రాజెక్టులకు రూ.1,293 కోట్లు, తృతీయ ప్రాధాన్యత కింద చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రూ.3,533 కోట్లు అవసరం అవుతాయని వివరించారు. ఆ మేరకు నిధులు సమకూర్చుతామని.. శరవేగంగా ప్రాజెక్టులను పూర్తి చేయాలని అధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు. కాగా, పోలవరం ప్రాజెక్టు పనులను ఈ నెల 27న సీఎం వైఎస్‌ జగన్‌ క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు. అక్కడే అధికారులతో సమీక్షించి దిశా నిర్ధేశం చేస్తారు.  

శరవేగంగా పూర్తి చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ 
- ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి జలవనరుల శాఖ అధికారులు రూపొందించిన ప్రణాళిక అమలుకు సీఎం వైఎస్‌ జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఆ మేరకు నిధులు సర్దుబాటు చేయాలని ఆర్థిక శాఖకు దిశానిర్దేశం చేశారు. 
- వెలిగొండ ప్రాజెక్టుకు ఇప్పటి దాకా రూ.5,107 కోట్లు ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకా రూ.3,480 కోట్లు అవసరం. ఇది పూర్తయితే కొత్తగా 4,47,300 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. 14,800 ఎకరాలను స్థిరీకరించవచ్చు. ఈ ప్రాజెక్టులో తొలి దశను ప్రథమ ప్రాధాన్యత కింద చేపట్టాలని సర్కార్‌ నిర్ణయించింది. 
- వంశధార ప్రాజెక్టు రెండవ స్టేజ్‌లో ఫేజ్‌–2కు ఇప్పటి దాకా రూ.1,575 కోట్లు వ్యయం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే మరో రూ.464 కోట్లు అవసరం. ఈ ప్రాజెక్టును తొలి ప్రాధాన్యత కింద పూర్తి చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కొత్తగా 45 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు 2.10 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు. 
- తోటపల్లి ప్రాజెక్టుకు ఇప్పటి దాకా రూ.810 కోట్లు వ్యయం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే మరో రూ.201 కోట్లు అవసరం. ఇది పూర్తయితే అదనంగా 62,217 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. 
- తాడిపూడి ఎత్తిపోతల పథకానికి ఇప్పటిదాకా రూ.586 కోట్లు ఖర్చు చేశారు. మరో రూ.380 కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. కొత్తగా 41,600 ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చే ఈ ప్రాజెక్టును ద్వితీయ ప్రాధాన్యత కింద పూర్తి చేయాలని సర్కార్‌ నిర్ణయించింది. 
- గోదావరి డెల్టా ఆధునికీకరించకపోవడం వల్ల ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందడం లేదు. సమృద్ధిగా గోదావరి జలాలు అందుబాటులో ఉన్నా చివరి ఆయకట్టు భూములు నీళ్లందక ఎండిపోవాల్సిన దుస్థితి నెలకొంది. ఆధునికీకరణ పనులు పూర్తయితే డెల్టాలో 10,13,161 ఎకరాల ఆయకట్టుకు సమర్థవంతంగా నీళ్లందించవచ్చు. డెల్టా ఆధునికీకరణకు ఇప్పటిదాకా రూ.1,595.29 కోట్లు ఖర్చు చేశారు. ఈ పనులు పూర్తి కావాలంటే రూ.1,379 కోట్లు అవసరం. వీటిని తృతీయ ప్రాధాన్యత కింద పూర్తి చేయడానికి జల వనరుల శాఖ చర్యలు చేపట్టింది. ఏలేరు, పెన్నా, కృష్ణా డెల్టాల ఆధునికీకరణ పనులను ఇదే రీతిలో పూర్తి చేయాలని నిర్ణయించింది. 

జూలై నాటికి వెలిగొండ తొలి దశ  
శ్రీశైలానికి వరద వచ్చే 45 రోజుల్లో రోజుకు 11,581.68 క్యూసెక్కుల (328 క్యూమెక్కులు) చొప్పున 43.50 టీఎంసీలను తరలించి.. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో 4.47 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించేందుకు దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004లో వెలిగొండ ప్రాజెక్టును చేపట్టారు. తద్వారా 14,800 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి, 15.25 లక్షల మంది దాహార్తిని తీర్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు.  2009 నాటికే సింహభాగం పనులను పూర్తి చేశారు. అప్పటి నుంచి 2019 మే 29 వరకు రెండు సొరంగాల్లో మిగిలిన పనులు.. నల్లమలసాగర్‌ ముంపు గ్రామాలకు పునరావాసం కల్పించడం, 2,884.13 ఎకరాల భూసేకరణ చేయకపోవడం వల్ల ప్రాజెక్టు పూర్తి కాలేదు. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిని ప్రక్షాళన చేయడంలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టు  రెండో సొరంగం పనులకు ‘రివర్స్‌ టెండరింగ్‌’ నిర్వహించి, రూ.61.76 కోట్లను ఖజానాకు మిగిల్చారు.

ప్రాధాన్యత ప్రాజెక్టుగా ప్రకటించి ఈ ఏడాది తొలి దశను పూర్తి చేయాలని ఆదేశించారు. దాంతో పనులు వేగం పుంజుకున్నాయి. మొదటి సొరంగంలో రోజుకు 6.45 మీటర్ల చొప్పున పనులు చేస్తున్నారు. మరో వెయ్యి మీటర్ల మేర సొరంగం పనులు చేయాలి. ఈ పనులు జూలై 15 నాటికి పూర్తవుతాయి. శ్రీశైలం జలాశయం నుంచి సొరంగాలకు నీళ్లు చేరాలంటే హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు పూర్తి చేయాలి. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 865.1 అడుగుల్లో 122.718 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. జలాశయంలో నీటి మట్టం 840 అడుగులకు తగ్గితేగానీ హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు చేపట్టలేని పరిస్థితి. మార్చి 15 నాటికి జలాశయం నీటి నిల్వ తగ్గనుంది. అప్పటి నుంచి వరద ప్రారంభమయ్యేలోగా హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు పూర్తి చేయడానికి ప్రణాళిక రచించారు.  

వచ్చే సీజన్‌లో నల్లమలసాగర్‌కు నీరు 
నల్లమలసాగర్‌ నిర్వాసితుల పునరావాసానికి, భూసేకరణకు రూ.1,220 కోట్లు, తొలి దశ పనులు పూర్తి చేయడానికి రూ.534 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదించారు. ఆ మేరకు నిధులు సర్దుబాటు చేయాలని ఆర్థిక శాఖను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. వచ్చే సీజన్‌లో కృష్ణా వరద ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు చేరి, నీటి మట్టం 840 అడుగులకు చేరుకోగానే మొదటి సొరంగం ద్వారా రోజుకు 85 క్యూమెక్కులు(3001.35 క్యూసెక్కులు) చొప్పున తరలించి.. నల్లమలసాగర్‌లో నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందించాలని సర్కార్‌ నిర్ణయించింది. రెండో దశ పనులు పూర్తి చేయడానికి అవసరమైన రూ.1,880.16 కోట్లను 2020–21, 2021–22 బడ్జెట్‌లలో కేటాయించనుంది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top