వైఎస్సార్‌ కాపు నేస్తం ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్‌

CM YS Jagan Launched YSR Kapu Nestham In Tadepalli - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కాపు సామాజిక వర్గంలోని మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ’వైఎస్సార్‌ కాపు నేస్తం’  పథకాన్ని బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవుడి దయ, మీ చల్లని దీవెనలతో ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేయగలిగాను. ఈ 13 నెలలో కాలంలో 3.98 కోట్ల మందికి దాదాపు రూ.43 వేల కోట్లకు పైగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది.

ఎక్కడా వివక్షకు తావులేదు
ఎలాంటి వివక్ష, అవినీతికి తావు లేకుండా బ్యాంక్‌ ఖాతాల్లో నగదు జమ చేశాము. గొప్ప మార్పుతో ఈ 13 నెలల పాలన కొనసాగింది. మనకు ఓటు వేయకపోయినా, అర్హత ఉంటే మంచి జరగాలని ఆరాటపడ్డాం. అవినీతికి తావు లేకుండా పథకాలు అమలు చేశాము. కులం, మతం, రాజకీయాలు, పార్టీలు చూడలేదు. ఇవాళ కాపు అక్కా చెల్లెమ్మలు, అన్నదమ్ములకు ఈ ఏడాది ఎంత ఖర్చు చేశామని చూస్తే.. అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, వాహనమిత్ర, చేదోడు, విదేశీ విద్యా దీవెన, కాపు నేస్తం వంటి పథకాల ద్వారా 23 లక్షలకు పైగా లబ్ధిదారులకు అక్షరాలా రూ.4,770 కోట్లు ఇవ్వడం జరిగింది. బియ్యం కార్డు ఉంటే చాలు 45 నుంచి 60 ఏళ్ల వయసున్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన వారికి ఇప్పుడు రూ.15 వేల చొప్పున సహాయం. ఆ విధంగా 5 ఏళ్లలో మొత్తం రూ.75 వేలు చెల్లింపు. పాత అప్పుల కింద బ్యాంకులు జమ చేసుకోకుండా అన్‌ ఇన్‌కమ్‌బర్డ్‌ ఖాతాలో వేస్తున్నాం.

ఆందోళన వద్దు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి
ఇంకా రాని వారు ఎవరైనా ఉంటే ఆందోళన చెందవద్దు. ఎలా ఎగ్గొట్టాలని కాకుండా, ఎలా మేలు చేయాలని ఆలోచించే ప్రభుత్వం.  అర్హుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. మీ పేరు లేకపోతే, మీకు అర్హత ఉంటే, వెంటనే దరఖాస్తు చేసుకోండి.  వచ్చే నెల ఇదే రోజున తప్పనిసరిగా ఆర్థిక సహాయం చేస్తాం. గుండెల మీద చేయి వేసుకుని పాలనలో తేడా చూడండి. గత ప్రభుత్వం ఏం చెప్పింది? ఏం చేసింది? చూడండి. ఏటా రూ.1000 కోట్లు ఇస్తామని చెప్పిన గత ప్రభుత్వం 5 ఏళ్లలో, ఏటా సగటున రూ.400 కోట్లు మాత్రమే ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రూ.4,770 కోట్లు కాపు కులస్తులకు ఇచ్చింది. దేవుడి దయతో, మీ అందరి ఆశీస్సులతో మీకు ఇంకా మంచి చేయాలని భావిస్తున్నాను' అంటూ సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top