ఫిబ్రవరి నుంచి ఇంటి వద్దకే పింఛన్‌

CM YS Jagan Comments in review of panchayatiraj and rural development Departments - Sakshi

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌

సర్వేల పేరుతో నిరుపేదలకు ఇళ్ల పట్టాలు నిరాకరించొద్దు 

అర్హులు ఎంత మంది ఉన్నా పట్టాలు ఇవ్వాల్సిందే  

గ్రామాల్లో మినీ గోడౌన్ల నిర్మాణంపై దృష్టి సారించాలి

సాక్షి, అమరావతి:  ఫిబ్రవరి నుంచి లబ్ధిదారుల ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమం మొదలు కావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వలంటీర్ల ద్వారా నేరుగా చేరవేయాలన్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పనితీరుపై బుధవారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పనులు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణంతో పాటు నాడు– నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలల ప్రహరీ గోడల నిర్మాణం, వాటర్‌ గ్రిడ్‌ అంశాలపై చర్చించారు. వివిధ సర్వేలంటూ ముడిపెట్టి అసలైన నిరుపేదలకు ఇళ్ల పట్టాలను నిరాకరించే పరిస్థితి ఉండకూడదని సీఎం అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయి పరిశీలన చేసి, ఆ మేరకు లబ్ధిదారులను గుర్తించాలన్నారు. అర్హులు ఎంత మంది ఉన్నా పట్టాలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు.  

గ్రామాల్లో మినీ గోడౌన్ల నిర్మాణం  
రైతులు తమ పంటలకు గిట్టుబాబు ధర వచ్చేంత వరకు నిల్వ ఉంచుకునేందుకు వీలుగా ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో మినీ గోడౌన్ల నిర్మాణంపై అధికారులు దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. గ్రామ సచివాలయ భవనాలు, వాటికి అనుబంధంగా నిర్మించే రైతు భరోసా కేంద్రాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నాటికి రైతులకు అవసరమైన వాటన్నింటినీ రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేసేలా ప్రణాళిక బద్దంగా పని చేయాలని సూచించారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురిసినందున గ్రామాల్లో ఎక్కడికక్కడ వ్యవసాయ రంగంలో కూలీలకు పనులు లభిస్తున్నాయని ఈ సందర్భంగా అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అయినప్పటికీ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పని కల్పించడంలో ఈ ఏడాది పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు. ఈ పథకం ద్వారా చేపట్టే ప్రతి పని పకడ్బందీగా, ప్రజలకు ప్రయోజనం కలిగించేదిగా ఉండాలని సీఎం సూచించారు.  

సచివాలయాల్లో ఖాళీలను భర్తీ చేయండి 
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడున్న 11,158 గ్రామ సచివాలయాలకు అదనంగా మరో 300 వరకు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై సీఎం సానుకూలంగా స్పందించారు. ఇందుకు కొత్తగా మరో 3 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు చేయాల్సి ఉంటుందని అధికారులు సీఎం దృష్టికి తీసుకురాగా.. సచివాలయాల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 15,971 ఉద్యోగాలతో పాటే వీటిని భర్తీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top