బాక్సైట్‌ తవ్వకాలకు నో 

CM YS Jagan Comments On Bauxite excavation In collectors meeting - Sakshi

గిరిజనులకు ఇష్టంలేని పని చేయం 

వారి శాంతి, సంతోషాలే ముఖ్యం 

కలెక్టర్ల సమావేశంలో సీఎం జగన్‌ స్పష్టీకరణ

సాక్షి, అమరావతి : విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్‌ తవ్వకాలను అనుమతించబోమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. బాక్సైట్‌ తవ్వకాలకన్నా గిరిజనుల శాంతి, సంతోషాలే తమ ప్రభుత్వానికి ముఖ్యమని కుండబద్దలు కొట్టారు. శాంతిభద్రతలపై కలెక్టర్లు – ఎస్పీలు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, మంత్రులతో మంగళవారం ప్రజావేదికలో జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి ఈ మేరకు ప్రకటించారు. విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనాన్ని, జీవనోపాధి లేకపోవడాన్ని అనుకూలంగా మార్చుకుని వామపక్ష తీవ్రవాద విస్తరణకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని పోలీసు ఉన్నతాధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. బాక్సైట్‌ తవ్వకాలు జరపాలని ప్రభుత్వం భావిస్తే ముందుగా ఆ ప్రాంత గిరిజనులకు ఉపాధి కల్పించి అవగాహన కల్పించాలని, ఇది పెద్ద సమస్య కాదని వివరిస్తూ బాక్సైట్‌ తవ్వకాలు జరపడం గిరిజనులకు అంతర్గతంగా ఇష్టంలేదని చెప్పుకొచ్చారు. దీనిపై సీఎం స్పందిస్తూ ‘ఏజెన్సీ ప్రాంతంలో నివసించే గిరిజనులకు ఇష్టం లేనప్పుడు బాక్సైట్‌ తవ్వకాలు జరపాల్సిన అవసరం ఏముంది? గిరిజనులు శాంతియుతంగా, సంతోషంగా ఉండటమే మన ప్రభుత్వ లక్ష్యం. బాక్సైట్‌ తవ్వకపోతే రాష్ట్రానికి వచ్చే నష్టమేమీ లేదు. ఇక నుంచి ఏజెన్సీలో మైనింగ్‌కు అనుమతించబోం’ అని స్పష్టం చేశారు.  

గిరిజనుల జీవనోపాధి మెరుగుపరుద్దాం 
మారుమూల గిరిజన, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు ప్రభుత్వ అధికారులు భయంతో వెళ్లడం లేదని పోలీసు ఉన్నతాధికారులు సీఎం దృష్టికి తీసుకురాగా.. ప్రభుత్వం తమ కోసం పని చేస్తుందనే నమ్మకం గిరిజనుల్లో కలిగించాలని చెప్పారు. ‘ఒక్కొక్కరుగా, విడివిడిగా మారుమూల గిరిజన ప్రాంతాలకు వెళ్లలేమని చెబుతున్నప్పుడు వారి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వేర్వేరుగా వెళ్లే వారికి రక్షణ కల్పించాలన్నా కష్టమే. అందువల్ల సంబంధిత అన్ని విభాగాల వారిని కలిపి ఒకేసారి తీసుకెళ్లండి. అన్ని విభాగాల వారందరూ నెలకు ఒకసారైనా వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. కలెక్టరు, ఎస్పీలు ఈ విషయంపై దృష్టి సారించాలి’ అని దిశానిర్దేశం చేశారు. ‘గిరిజనులు గంజాయి సాగు చేయకుండా చూడాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. జీవనోపాధి లేకపోవడం వల్లే గిరిజనులు గంజాయి సాగు చేస్తున్నారనే అభిప్రాయం కూడా ఉంది కదా.. అలాంటప్పుడు కచ్చితంగా జీవనోపాధి కల్పించడం ద్వారా సాంఘిక, ఆర్థిక ప్రగతికి తోడ్పాటు అందించడం సర్కారు బాధ్యత. ఇందుకు ఏమి చేయడానికైనా సర్కారు సిద్ధంగా ఉంది. ఏమి చేయాలో ఆలోచించి నివేదిక ఇవ్వండి’ అని సీఎం ఆదేశించారు.  

చెప్పిన మాటకు కట్టుబడి.. 
ఎట్టి పరిస్థితుల్లో బాక్సైట్‌ తవ్వకాలు జరపబోమని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. 2009 ఎన్నికల ముందు బాక్సైట్‌ వ్యతిరేక పోరాటం చేస్తున్నట్లు ప్రకటించిన చంద్రబాబునాయుడు 2014లో అధికారంలోకి రాగానే కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసి మరీ బాక్సైట్‌ తవ్వకాలకు జీవో జారీ చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ చింతపల్లిలో వైఎస్‌ జగన్‌ గిరిజనులను ఉద్దేశించి మాట్లాడుతూ బాక్సైట్‌ తవ్వకాలను ఎలాంటి పరిస్థితుల్లో అనుమతించబోమన్నారు. నాడు చెప్పిన మాటకు జగన్‌ ఇప్పటికీ కట్టుబడి ఉన్నందున విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.   

ఉత్సాహం ఉరకలేస్తోంది 
‘ఊకదంపుడు ఉపన్యాసాలు లేవు.. అర్థంకాని లెక్కలు, గ్రాఫిక్స్‌ అసలేలేవు. స్తోత్కర్షకు చోటే లేదు. సర్కారు లక్ష్యాలు, ప్రాధామ్యాలు, పాలన ఎలా ఉండాలో సూటిగా, స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మనం పాలకులం కాదు.. ప్రజలకు సేవకులమని చెప్పడం ద్వారా ప్రజల పట్ల ఎంత గౌరవభావం, అభిమానం ఉందో చాటుకున్నారు. చెరగని చిరునవ్వుతో అధికారులను సాంబశివన్నా, శ్యామలన్నా, జవహరన్నా.. అంటూ  గౌరవం, ప్రేమతో సంభోదించారు. సీఎం సమీక్ష అనంతరం ఆయన సూచించిన దిశగా పని చేయాలన్న ఉత్సాహం పెరిగింది’ అని సమీక్షకు హాజరైన పలువురు ఉన్నతాధికారులు చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో సోమ, మంగళవారాల్లో ప్రజావేదికలో జరిగిన కలెక్టర్ల తొలి సదస్సు పూర్తి స్థాయి దిశా, దశా నిర్దేశంతో గతానికి పూర్తి భిన్నంగా జరిగింది. ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలు, మంత్రులు ముఖ్యమని, వారిని ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని సీఎం సూచిస్తూనే.. అవినీతి పనులు చెబితే తిరస్కరించాలంటూ కుండబద్దలు కొట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చి తీరాల్సిందేనని చెప్పడం ద్వారా మాట తప్పరని చాటుకున్నారు.   అధికారులు వేరు, మనం వేరు కాదు.. ఇది మన ప్రభుత్వం.. వారూ మనం కలిసి పని చేయాలన్నారు. తద్వారా అధికారుల్లో మన సీఎం జగన్‌ అని తొలి సమావేశంలోనే ముద్ర వేసుకున్నారు.  

ఆయన మాటలు మాలో స్ఫూర్తి నింపాయి
తాను మరణించినా ప్రతి ఒక్కరి ఇంటా తన ఫొటో ఉండాలన్నదే తన తపన అని జగన్‌ చెప్పుకున్నారు. కలెక్టర్లు కూడా తాము పని చేసిన ప్రాంత ప్రజల్లో వారి పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా సేవలు అందించాలని, మంచి పనులు చేయాలని సీఎం సూచించారు. ‘ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కారానికి వినతుల స్వీకరణ కోసం ప్రతి కార్యాలయంలో ‘స్పందన’ కార్యక్రమం నిర్వహించాలని సీఎం సూచించారు. తీసుకున్న ప్రతి వినతికీ నంబరు ఇవ్వడంతోపాటు ఎన్ని రోజుల్లో సమస్య పరిష్కరిస్తారో కూడా అందులోనే పొందుపరిచి పరిష్కరించాలని చెప్పారు. ఈ మాటలు మాలో స్ఫూర్తి రగలించాయి. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తే ఇంత పట్టుదలతో వినూత్నంగా ఆలోచించి గొప్ప పనులు చేస్తుంటే ఐఏఎస్‌ చేసిన మనం ఎందుకు ప్రజల గుండెల్లో నిలిచిపోయే స్థాయిలో సేవలు అందించకూడదనే పట్టుదల పెరిగింది. నేను పనిచేసే స్థానం నుంచి బదిలీ చేస్తే జిల్లా వారంతా బాధపడేలా పని చేయాలని ఈ రోజే నిర్ణయానికి వచ్చా. ఇందుకు సీఎం ప్రసంగమే స్ఫూర్తి..’ అని ఒక జిల్లా కలెక్టర్‌ ‘సాక్షి’తో అన్నారు. 

ఇలాంటి సంబోదన ఊహించలేదు
‘నేను 20 ఏళ్లుగా రాష్ట్రంలో వివిధ హోదాల్లో పని చేశా. ఇప్పటి వరకు ప్రతి సీఎం పేరుతో పిలవడమే చూశా. జగన్‌ తొలిసారి ‘అన్నా’ అంటూ ఆప్యాయంగా రెండు మూడు సార్లు పిలిచారు. ఇది నాకెంతో సంతోషం కలిగించింది. గతంలో ఒకసారి అప్పటి సీఎం చంద్రబాబు అయితే మా సహచర అధికారిని నీవు ఆ సంస్థ ఎండీవా? నీ మొఖం నాకెప్పుడూ కనిపించలేదే. నిద్రపోతున్నావా.. అని ఆయన తప్పులేకపోయినా అవమానించేలా మాట్లాడారు. ప్రస్తుత సీఎం మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా స్నేహభావంతో నవ్వుతూ, నవ్విస్తూ సమీక్షించారు. సీఎం చేసిన మార్గనిర్దేశం మాలో నూతనోత్సాహం నింపింది. మా సహచరులందరం ఇదే మాట్లాడుకున్నాం.. ఫలితాలు త్వరలో కనిపిస్తాయి.’ అని ఇద్దరు ఎస్పీలు, ఇద్దరు కలెక్టర్లు సాక్షితో అన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top