ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపొచ్చింది. దీంతో ఆయన మంగళవారం ఉదయాన్నే ఢిల్లీ వెళ్లనున్నారు.
* అధిష్టానం పిలుపు..
* సమైక్య ఉద్యమం, తాజా పరిస్థితులపై చర్చ
* నేడు ఆంటోనీ కమిటీ ముందుకు సీమాంధ్ర ప్రతినిధులు
* అంతకుముందే ముఖ్యమంత్రి కిరణ్‌తో భేటీ కానున్న కమిటీ
* ఢిల్లీ పర్యటనకు దూరంగా సీనియర్ మంత్రులు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపొచ్చింది. దీంతో ఆయన మంగళవారం ఉదయాన్నే ఢిల్లీ వెళ్లనున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో సీమాంధ్రలో పరిస్థితులు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఢిల్లీ పెద్దలు సీఎంను హుటాహుటిన ఢిల్లీకి పిలిపించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటివరకు శాంతియుతంగా సాగుతున్న ఉద్యమంలో ఇటీవలి కాలంలో చెదురుమదురుగా అవాంఛనీయ సంఘటనలు కూడా చోటుచేసుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు, రాజకీయపరమైన తాజా పరిస్థితులపై సీఎంతో పార్టీ పెద్దలు చర్చించనున్నారని తెలుస్తోంది.
విభజన నిర్ణయంపై సీమాంధ్ర ప్రాంతంలో ఇంత తీవ్ర నిరసన ఎదురవుతుందని అంచనా వేయలేకపోయిన పార్టీ పెద్దలు ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సీడబ్ల్యూసీ తీర్మానాన్ని ఆదరాబాదరాగా వెలువరించిన అధిష్టానం... సీమాంధ్రనేతల ప్రతిఘటన నేపథ్యంలో దాని అమలులో మాత్రం నెమ్మదించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఆంటోనీ కమిటీ ఏర్పాటు చేసి ఇరుప్రాంతాల కాంగ్రెస్ నేతలతో భేటీలు నిర్వహిస్తోంది. తెలంగాణ ప్రాంత మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు సోమవారం ఆంటోనీ కమిటీ ముందు హాజరై తమ వాదన వినిపించారు.
సీమాంధ్రప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు మంగళవారం కమిటీని కలవనున్నారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఢిల్లీలో అందుబాటులో ఉండాల్సిందిగా అధిష్టానం ఆదేశించింది. విభజన కారణంగా పలు సమస్యలు తలెత్తుతాయని, భవిష్యత్తులో అవి ప్రమాదకర పరిణామాలకు దారితీస్తాయని సీమాంధ్ర ప్రాంత నేతలు వాదిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు సీమాంధ్రప్రాంత నేతలతో వరుసగా రెండుసార్లు నిర్వహించిన సమావేశంలో వారంతా ఈ సమస్యలను ఏకరవుపెట్టి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు రెండుసార్లూ తీర్మానాలు చేసి పార్టీ అధిష్టానానికి పంపారు. ఈ రెండింటిపైనా సీఎం, పీసీసీ అధ్యక్షులిద్దరూ సంతకాలు చేశారు. ఈ లేఖలు ఆంటోనీ కమిటీకి కూడా పంపించారు. సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మంగళవారం ఆంటోనీ కమిటీని కలవనున్న నేపథ్యంలో అంతకుముందుగానే సీఎం ఆ కమిటీతో భేటీ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు వెలువరిస్తున్న అనుమానాలను ఆయన పార్టీ అధిష్టానానికి, ఆంటోనీ కమిటీకి వివరించనున్నారు. విభజన నిర్ణయం అమలులో తలెత్తే ఇతర క్లిష్ట సమస్యలను కూడా ఆయన పార్టీ పెద్దలకు తెలియచేయనున్నారని తెలుస్తోంది.
ఢిల్లీకి సీమాంధ్ర నేతలు
ఏకే ఆంటోనీ కమిటీ మంగళవారం రాత్రి అపాయింట్‌మెంట్ ఇచ్చిన నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు పలువురు ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. సోమవారం సాయంత్రం మంత్రులు శైలజానాథ్, కన్నా లక్ష్మీనారాయణ, మాజీమంత్రి గాదె వెంకటరెడ్డి హస్తిన వెళ్లారు. గంటా శ్రీనివాసరావు, మహీధర్‌రెడ్డి, కాసు కృష్ణారెడ్డి, పితాని సత్యనారాయణ, తోట త్రిమూర్తులు, పార్థసారథి తదితర మంత్రులు మంగళవారం ఉదయం వెళ్లనున్నారు.
విభజన వల్ల ఎదురయ్యే అంశాలపై సమగ్రమైన వివరాలతో ఒక నోట్‌ను ఆంటోనీ కమిటీకి అందించనున్నారు. అధిష్టానం కనుక తమ మాటను వినిపించుకోలేని పరిస్థితులు కనిపిస్తే మాత్రం అంతిమంగా తమ జిల్లాలను తెలంగాణతో పాటు కలిపి ఉంచాలన్న వాదనను తెరపైకి తేవాలని కర్నూలు, అనంతపురం జిల్లాల నేతలు భావిస్తున్నారు. అయితే మంత్రి శైలజానాథ్, ఎంపీ అనంతవెంకటరామిరెడ్డి సమైక్యవాదులుగా ఉన్నందున వారిద్దరూ ఈ విషయంలో మౌనందాల్చే పరిస్థితి కనిపిస్తోంది.
దూరంగా సీనియర్ మంత్రులు
సమైక్యాంధ్ర ఉద్యమం, రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచేందుకు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ మంత్రులు, నేతలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అదే ప్రాంతానికి చెందిన సీనియర్ మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి తదితరులు దూరంగా ఉండటం విమర్శలకు దారితీస్తోంది. ఒకరిద్దరు మంత్రులు ఈ బాధ్యతలను భుజాలకెత్తుకున్నా... వారు జూనియర్లు కావడంతో పార్టీ అధిష్టానంలో కానీ, ఇటు రాష్ట్ర నేతలపై కానీ అంతగా ప్రభావం పడడం లేదు. అదే సీనియర్లు రంగంలోకి దిగి ఉంటే అధిష్టానం కూడా ఒకింత స్పందించేందుకు అవకాశముంటుందని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. పైగా సీమాంధ్ర నేతలందర్నీ పదేపదే ఢిల్లీకి తీసుకువెళ్లడం తలకు మించిన భారంగా మారింది.
ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమం చేస్తున్నా... కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర కాంగ్రెస్ నేతలు మాత్రం ఎవరైనా ఢిల్లీ యాత్రకయ్యే ఖర్చులు భరిస్తేనే వస్తామన్నట్లుగా వ్యవహరిస్తుండడం బాధ్యతలు తీసుకున్న మంత్రులకు సమస్యగా మారింది. ‘‘మేమెన్ని సార్లని భరిస్తాం. విమాన టిక్కెట్లు తీయడం, ఢిల్లీలో వసతి, భోజన రవాణా ఏర్పాట్లు చేయించడం మావల్ల అయ్యేది కాదు. ఒకటిరెండుసార్లు అంటే ఫర్వాలేదు కానీ వరుసగా అన్నీ మేమే భరించాలంటే కష్టమే. అందుకే ఢిల్లీ యాత్ర ఉంది రండని సమాచారమిస్తున్నాం. సొంత ఖర్చులతో వచ్చేవారు వస్తారు. లేని వారు మానేస్తారు. ఇంతకుమించి మేము కూడా ఏమీ చేయలేం’’ అని ఒక నేత తమ బాధలు వివరించారు.