
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి ఉన్నతాధికారుల పిల్లలకు పునరావాస కేంద్రంగా మారిపోయింది. ముఖ్యమంత్రి విదేశీ యాత్రలకు వేదికగా ఆర్థికాభివృద్ధి మండలి(ఈడీబీ) రూపాంతరం చెందింది. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలకయ్యే వ్యయాన్ని ఈ మండలి నిధుల నుంచే ఖర్చు చేస్తున్నారు. పెట్టుబడులను ఆకర్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలిని ఏర్పాటు చేసింది. ఈ మండలి ద్వారా గత మూడేళ్లలో పైసా కూడా పెట్టుబడులు రాకపోయినప్పటికీ అందులో పని చేస్తున్న ఉన్నతాధికారుల పిల్లలకు వేతనాలకు, విదేశీ యాత్రల కోసం రూ.కోట్లు వెచ్చించారు.
ఆర్థికాభివృద్ధి మండలి చైర్మన్‌గా సాక్షాత్తూ ముఖ్యమంత్రి వ్యవహరిస్తుండడంతోపాటు ఆయనే ఆదేశాలు జారీ చేస్తుండడంతో ఈ దుబార ఖర్చుపై ఆర్థిక శాఖ అధికారులు నోరు మెదపలేకపోతున్నారు. మూడేళ్లుగా ఆర్థికాభివృద్ధి మండలి కార్యాలయం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిథి గృహాంలో కొనసాగుతోంది. అమరావతికి తరలి రావాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పలుమార్లు సూచించనప్పటికీ ఫలితం లేదు. ఈ మండలిలో పనిచేసేందుకు కన్సల్టెంట్ల పేరుతో అర్హతలతో సబంధం లేకుండా ఉన్నతాధికారుల సంతానాన్ని నియమించారు. వారికి రూ.లక్షల్లో వేతనాలు చెల్లిస్తున్నారు. వారు చేస్తున్నదేంటో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే. పెట్టుబడులను తీసుకొస్తామన్న సాకుతో విదేశాల్లో విహరించడం, సమావేశాల పేరుతో ఫైవ్‌స్టార్ హోటళ్లలో బస చేయడం విచ్చలవిడిగా కొనసాగుతోంది. ఆర్థికాభివృద్ధి మండలిలో పని చేయడం అంటే సుఖభోగాలు, విలాసాలతో కూడిన ఉద్యోగంగా మారిపోయిందని ఉన్నతాధికారి చెప్పారు.
ప్రస్తుత బడ్జెట్‌లో రూ.62.67 కోట్లు
ఆర్థికాభివృద్ధి మండలిలో కన్సల్టెంట్ల ముసుగులో చేరిన ఉన్నతాధికారుల పిల్లల జల్సాలకయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. వారి వేతనాలు, విదేశీ యాత్రలకు 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.11.70 కోట్లు ఖర్చయ్యింది. 2017–18లో ఏకంగా రూ.47.31 కోట్లు వ్యయం చేశారు. ఆర్థికాభివృద్ధి మండలికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.62.67 కోట్లు కేటాయించింది. ఆర్థికాభివృద్ధి మండలి చేసే ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు అడగరాదంటూ చట్టాన్ని తీసుకురావడం గమనార్హం.
- రాజ్యాంగ పదవిలో ఉన్న ఓ ఐఏఎస్ అధికారి కుమార్తె రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలిలో పని చేస్తున్నారు. ఆమెకు నెలకు అక్షరాలా రూ.2 లక్షలు వేతనంగా చెల్లిస్తున్నారు. ఆమె తరచూ విదేశీ పర్యటనలకు వెళ్లడం, ఇష్టం వచ్చినప్పుడు ఆఫీసుకు రావడం జరుగుతోంది ఆమె తండ్రి కీలక పదవిలో ఉండడంతో ఇదేమిటని ఎవరూ ప్రశ్నించలేకపోతున్నారు.
- ఓ ఐఆర్‌ఎస్ అధికారి కుమార్తెను నెలకు రూ.లక్ష వేతనంపై ఆర్థికాభివృద్ధి మండలిలో చేర్చుకున్నారు. ఆమె చాలాసార్లు విదేశీ పర్యటనలకు వెళ్లి రావడం తప్ప రూపాయి పెట్టుబడి కూడా తీసుకురాలేదు.
- ఓ ఐఏఎస్ అధికారి కుమార్తెను నెలకు రూ.లక్ష వేతనంతో నియమించారు. ఐటీ పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యతను ఆమెకు కట్టబెట్టారు. కానీ, సాధించింది శూన్యం.
- భార్యాభర్తలైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కుమారుడిని నెలకు రూ.లక్ష వేతనంతో తీసుకున్నారు. అతడు విజయవాడ, హైదరాబాద్ మధ్య తిరగడం తప్ప చేసేదేమీ ఉండదు.
- గతంలో ‘ముఖ్య’నేత భద్రతా విభాగంలో పనిచేసిన ఐపీఎస్ అధికారి కుమార్తెను కూడా నెలకు రూ.లక్షల వేతనంపై ఆర్థికాభివృద్ధి మండలిలోకి తీసుకున్నారు.
- రాజధాని జిల్లాకు చెందిన ఒక మంత్రి బంధువును నెలకు రూ.లక్ష వేతనంతో విజయవాడలో పని చేయడానికి నియమించారు. ఢిల్లీలో పనిచేయడానికి నెలకు రూ.1.80 లక్షల వేతనంతో ఒకరిని నియమించారు. మరో వ్యక్తిని నెలకు రూ.2.50 లక్షల చొప్పున వేతనంతో చేర్చుకున్నారు. ఇతడు పలుసార్లు విదేశాల్లో పర్యటించి వచ్చాడు.
- గతంలో నెలకు రూ.30,000 జీతానికి పనిచేసిన వ్యక్తిని ఆర్థికాభివృద్ధి మండలిలో చేర్చుకుని, ఇప్పుడు నెలకు రూ.1.50 లక్షల వేతనం చెల్లిస్తున్నారు. అలాగే వైస్ చైర్మన్ పేరుతో మండలిలో చేరిన ఓ వ్యక్తికి నెలకు రూ.1.50 లక్షలు అందజేస్తున్నారు.
- పశు సంవర్థక శాఖలో డైరెక్టర్ హోదాలో ఉన్న ఉద్యోగిని డిప్యూటేషన్‌పై ఆర్థికాభివృద్ధి మండలిలో నియమించారు. ఇతడు హైదరాబాద్‌లోనే ఉంటూ తనకు నచ్చినప్పుడే కార్యాలయానికి వస్తుంటాడు.