క్రిస్మస్‌కు ముస్తాబైన చర్చిలు
నిన్ను వలె పొరుగువానిని ప్రేమించు అన్న విశ్వశాంతి సూక్తిని ప్రజలకు చాటిన దేవుని కుమారుడు జీసస్ క్రైస్ట్ జన్మదినం నేడు.
నెల్లూరు (కల్చరల్) : నిన్ను వలె పొరుగువానిని ప్రేమించు అన్న విశ్వశాంతి సూక్తిని ప్రజలకు చాటిన దేవుని కుమారుడు జీసస్ క్రైస్ట్ జన్మదినం నేడు. జిల్లా వ్యాప్తంగా క్రైస్తవులు ఆయన జయంతి పండగ వేడుకలను స్థానిక చర్చిల్లో వేడుకగా జరుపుకుంటున్నారు. క్రీస్తు జయంతి రోజున క్రిస్మస్ జరుపుకోవడం వెనక పరమార్థం జగతిని జాగృతం చేయడం అని ప్రముఖ క్రైస్తవ ప్రసంగీకులు పేర్కొంటున్నారు.
క్రిస్మస్ పండగ, క్రీస్తు సందేశం ఒక జాతికో, మతానికో, ప్రజలకో పరిమితం కాదని, సమస్త మానవాళి ఆచరించాల్సిన జీవన విధాన సందేశం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కోరుతున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో, ఆరాధనతో గురువారం క్రిస్మస్ పండగను జరుపుకునే అన్ని ప్రధాన చర్చిలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. జిల్లాలో సుమారు 200కు పైగా ఉన్న బాప్టిస్ట్ ఆలయాలు క్రిస్మస్ వేడుకలను, ఆరాధనను జరిపేందుకు సిద్ధమయ్యాయి.
లోన్ స్టార్ బాప్టిస్ట్ చర్చ్ (ఆత్మకూరు బస్టాండ్ సమీపం)
170 ఏళ్ల చరిత్ర కలిగి దక్షిణ భారతదేశపు తెలుగు బాప్టిస్టు సంఘాల్లో తొలి సంఘంగా లోన్ స్టార్ బాప్టిస్ట్ చర్చ్‌ను భావిస్తారు. 1844లో విదేశీ మిషనరీల కృషి ఫలం ఈ చర్చ్‌గా చెప్పొచ్చు. డాక్టర్ డేవిడ్ క్లే, డాక్టర్ జూయెట్, డాక్టర్ డేవిడ్ డౌనీలు మిషనరీలుగా స్థాపించారు. సేవాపరంగా దక్షిణ భారతదేశంలోని తెలుగు ఆరాధకుల కోసం ఒక మదర్ చర్చ్‌ను ప్రారంభించాలన్న ఆలోచన ఈ చర్చ్‌కు అంకురార్పణ అయింది.
ప్రస్తుతం ముగ్గురు కాపరులతో (పాస్టర్స్), మూడు రకాల సేవలతో ఈ ఆలయం నగరానికే తలమానికం అయింది. కంచర్ల ప్రభుదాస్, విజయరత్నం ఇమానుయేల్, థియోపాస్‌లు కాపరులుగా ప్రస్తుతం సేవలు అందిస్తున్నారు. ఈ ఆలయం పరిధిలో సేవా కార్యక్రమాలతో పాటుగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అనేక గ్రామీణ సంఘాలను స్థాపించారు. గురువారం ఉదయం 7.30 గంటలకు ఈ పవిత్రమైన ఆలయంలో క్రిస్మస్ ఆరాధన మొదలవుతుంది. తిరిగి రాత్రి 7.00 గంటలకు క్రిస్మస్ యూైనె టెడ్ ఆరాధనతో ప్రత్యేక ప్రార్థనలు ముగుస్తాయి
బాప్టిస్ట్ చర్చ్ డౌని హాల్ (వీఆర్‌సీ కూడలి)
క్రైస్తవ సమాజంలో బాప్టిస్ట్ సంఘాల పితామహుడిగా డేవిడ్ డౌనీని అభివర్ణించవచ్చు. స్కాట్లాండ్ దేశానికి చెందిన ఈయన 1873లో మనదేశానికి వచ్చారు. బాప్టిస్ట్ సంఘాల మధ్య పని చేసి నెల్లూరు, ఒంగోలు జిల్లాల్లో పలు దేవాలయాలు, ఆసుపత్రులు, విద్యా సంస్థలను నిర్మించడంలో శక్తి వంచన లేకుండా కృషి చేసిన మిషనరీ. 1902లో చాంబర్ అనే దొర ఆర్థిక సహాయంతో నెల్లూరులో ఆలయాన్ని నిర్మించారు. దీనినే ప్రస్తుతం బాప్టిస్ట్ చర్చ్ డౌనీ హాల్‌గా వ్యవహరిస్తున్నారు.
గతంలో ఆంగ్లేయులు ఇక్కడ ఆరాధనలను జరిపేవారు. 1965 నుంచి తెలుగు ఆరాధనలు ప్రారంభమయ్యాయి. క్రీస్తు జనన సందేశాన్ని మాటలు, పాటల రూపంలో తెలిపే ప్రక్రియ క్రీస్తు గాన జయంతి ఈ సంఘ ప్రత్యేకత. కె. జోసఫ్, పి.శామ్యూల్, కె రాజారత్నం, జె రాజారత్నం, ఎం. వందనం చార్టెడ్ మెంబర్స్‌గా తెలుగు ఆరాధనలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం డౌనీ హాల్ కాపరిగా రెవరెండ్ జి పీటర్ సేవలందిస్తున్నారు. వీటితో పాటుగా నగరంలోని ప్రముఖమైన ప్రార్థనాలయాలుగా సంతపేటలోని సెయింట్ జోసెఫ్ కేతడ్రాల్, మూలాపేటలోని 2వ బాప్టిస్ట్ చర్చ్ ప్రసిద్ధి చెందాయి. కేతడ్రాల్‌కు నెల్లూరు బిషప్ రెవరాండం డి. ప్రకాశం, బాప్టిస్ట్ చర్చ్‌కు రెవరాండం సుధాకర్ ఆరాధనా సేవలందిస్తున్నారు.
షాపింగ్‌తో బిజీ బిజీ
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని అన్ని ప్రధాన వస్త్రాలయాలు, బేకరీలు, ఫ్లవర్ స్టాల్స్, ఫ్యాన్సీ షాపులు చాలా బిజీగా మారాయి. ఏ కూడలి చూసినా క్రైస్తవుల షాపింగ్‌లతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రత్యేకంగా సండే మార్కెట్ వినియోగదారులతో కిటకిటలాడుతోంది. కేక్స్, క్యాండిల్స్, బెలూన్స్, డెకరేషన్ ఐటెమ్స్, క్రిస్మస్ ట్రీ విద్యుద్దీపాలంకరణతో అన్ని చర్చ్‌లు వెలుగుల శోభను సంతరించుకున్నాయి. నెల రోజుల నుంచి ఈ సుదినం కోసం ఎదురు చూస్తూ ఆలయాల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు జరుపుతున్నారు.


