ఆర్టీసీ ఉద్యోగులపై చింతమనేని దుర్భాషలు

Chintamaneni Prabhakar Halchal in Hanuman Junction in Krishna - Sakshi

బస్సుపై సీఎం చంద్రబాబు ఫొటో ఎందుకు చిరిగిందంటూ చిందులు

ఇదేమిటని ప్రశ్నించిన స్థానికుడిపై దాడి

జాతీయ రహదారిపై ఆందోళనకు దిగిన స్థానికులు

ఎమ్మెల్యే చింతమనేనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

సాక్షి, హనుమాన్‌జంక్షన్‌ (గన్నవరం): జైలు శిక్షపడినా కూడా టీడీపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ తీరు ఏ మాత్రం మారలేదు. వివాదాస్పద ప్రవర్తనతో తరుచూ వార్తల్లో నిలిచే చింతమనేని తాజాగా ఆర్టీసీ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. బస్సుపై ఉన్న చంద్రబాబు ఫొటో ఎందుకు చిరిగిందంటూ డ్రైవర్, కండక్టర్‌లను నడిరోడ్డుపైనే దుర్భాషలాడుతూ చిందులు వేశారు. ఇదేమిటని ప్రశ్నించిన ఓ వ్యక్తిపై దాడి చేశారు. దీంతో కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌లో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. వివరాలు.. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని మంగళవారం స్థానిక అభయాంజనేయ స్వామి దేవస్థానానికి వచ్చారు. అదే సమయంలో నూజివీడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జంక్షన్‌ సెంటర్‌ నుంచి గుడివాడ వైపు వెళుతోంది.

అయితే ఆ బస్సుపై అతికించిన ప్రభుత్వ ప్రచార పోస్టర్‌లోని సీఎం ఫొటో కాస్త చిరిగి ఉండటంతో చింతమనేని వెంటనే తన మనుషులను పంపించి బస్సును అడ్డగించారు. డ్రైవర్‌ వడ్డి శేఖర్, కండక్టర్‌ తోట వాసుబాబును కిందకు దించి.. వారిపై చింతమనేని పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ సొమ్ము తింటూ సీఎం ఫొటో చిరిగినా పట్టించుకోరా.. అంటూ తిట్లపురాణం అందుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న స్థానికుడు గరికపాటి నాగేశ్వరరావు(చంటి) ప్రభుత్వ ఉద్యోగులతో ఇదేం వైఖరి అంటూ చింతమనేనిని ప్రశ్నించాడు. దీంతో ఆయన మరింత రెచ్చిపోయి.. నాగేశ్వరరావుపై ఏడాపెడా చేయి చేసుకోవడంతో అక్కడున్నవారు అవాక్కయ్యారు.

విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే ప్రధాన కూడలికి చేరుకొని జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. చింతమనేనిపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. వీరికి కాపు సంఘం, వైఎస్సార్‌సీపీ నాయకులు మద్దతు పలికారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ వి.సతీశ్‌ ఘటనాస్థలికి చేరుకుని సర్ది చెప్పడంతో నిరసనకారులు ఆందోళన విరమించారు. చింతమనేనిపై చర్యలు తీసుకోకపోతే మళ్లీ ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు.

ఎన్ని ఆగడాలో..
సాక్షి, అమరావతి: బండ బూతులు తిట్టడం.. దాడి చేసి కొట్టడం టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనికి పరిపాటిగా మారింది. సామన్యుడి నుంచి ప్రభుత్వ అధికారుల వరకు ఆయన వాత పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా హనుమాన్‌ జంక్షన్‌లో మంగళవారం ఆర్టీసీ సిబ్బందిని నడిరోడ్డుపై దుర్బాషలాడి.. స్థానికులపై దాడికి తెగబడిన చింతమనేని తీరు మరోమారు ప్రజాగ్రహానికి కారణమైంది. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వట్టి వసంత్‌కుమార్‌పై బహిరంగ సభలో ప్రజల సమక్షంలోనే దాడి చేసిన ఘటన ఆయన దుందుడుకు చర్యలకు పరాకాష్ట అని అప్పట్లో ప్రజలు దుమ్మెత్తిపోశారు. అదే కేసులో ఈ ఏడాది ఫిబ్రవరిలో చింతమనేనికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. అనంతరం ఆయన బెయిల్‌పై బయటకొచ్చారు.

ఇక తహసీల్దార్‌ వనజాక్షిపై చింతమనేని చేసిన దౌర్జన్యకాండ గురించి అందరికీ తెలిసిందే. ఆ వ్యవహారంలో వనజాక్షినే తప్పుబట్టి సీఎం చింతమనేనినే కాపాడుకున్నారు. దీంతో మరింత రెచ్చిపోయిన చింతమనేని ఏలూరులో అంగన్‌వాడీ మహిళలను దుర్భాషలాడి కొట్టినంత పనిచేశారు. కొల్లేరు ప్రాంతంలో నిబంధనలకు విరుద్దంగా వేస్తున్న రోడ్డును అడ్డుకున్న ఫారెస్టు అధికారిని కొట్టారు. చింతమనేని విషయంలో చంద్రబాబు తీరు వల్ల పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని టీడీపీ కార్యకర్తలే బాహాటంగా చెబుతున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top