బాలిక మిస్సింగ్‌ కేసు విచారణపై అసంతృప్తి

Chintalapudi si Neglect On Girl Rape Case - Sakshi

పోలీస్‌ ఉన్నతాధికారులు సీరియస్‌

చింతలపూడి ఎస్సై తీరుపై అసహనం

అత్యాచారానికి గురైన బాలిక తండ్రి ఫిర్యాదుతో దర్యాప్తు వేగవంతం

 ఏలూరులో విచారణ చేసిన జంగారెడ్డిగూడెం డీఎస్పీ

ఏలూరు టౌన్‌ : చింతలపూడిలోని సంక్షేమ వసతి గృహం విద్యార్థినిపై ఇద్దరు వ్యక్తులు పది రోజులు అత్యాచారానికి పాల్పడిన ఘటన జిల్లాలో సంచలనం రేపింది. తన కుమార్తె కనిపించటం లేదని బాలిక తండ్రి హస్టల్‌ వార్డెన్‌తో కలిసి ఫిర్యాదు చేసినా చింతలపూడి ఎస్సై పట్టించుకోలేదనే ఆరో పణలు ఉన్నాయి. దీంతో ఈ నెల 27న ఏలూరు రేంజ్‌ డీఐజీ టి.రవికుమార్‌మూర్తికి బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు. ఆయన ఎస్పీ ఎం.రవిప్రకాష్‌కు విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బాలిక అత్యాచార ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని జంగారెడ్డిగూడెం డీఎస్పీని ఎస్పీ ఆదేశించారు.

 ఏలూరు పవర్‌పేటలో బాలిక ను నిర్బంధించిన ఇంటి వద్ద శుక్రవారం రాత్రి జంగారెడ్డిగూడెం డీఎస్పీ విచారణ చేశారు. చింతలపూడి ఎస్సై నిర్లక్ష్యం కారణంగానే బాలిక అత్యాచారానికి గురైందనీ, వెంటనే ఆరా తీసుంటే ఇంత ఘోరం జరిగేది కాదని బాలిక బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సైపై పోలీస్‌ ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక బాలికపై అత్యాచారం చేసిన ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటికే కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ చింతలపూడి హాస్టల్‌ వార్డెన్లు ముగ్గురిని సస్పెండ్‌ చేశారు.

ఏం జరిగింది!
దుగ్గిరాల గ్రామానికి చెందిన దంపతులకు ఇద రు కుమార్తెలు సంతానం. ఆ దంపతుల మధ్య విభేదాలు రావటంతో దూరంగా ఉంటున్నారు. ఇద్దరు కుమార్తెలనూ చింతలపూడిలోని సంక్షేమ వసతి గృహంలో చేర్పించారు. పెద్ద కుమార్తె పదో తరగతి చదువుతుండగా, అక్కడే ఆమె చెల్లి కూడా ఉంటూ చదువుతోంది. ఇంటికి వచ్చిన బాలికను ఈనెల 16 ఉదయం చింతలపూడి హాస్టల్లో తల్లి దించి వెళ్లింది. అదే రోజు హాస్టల్లో అల్పాహారం తీసుకున్న బాలిక హాస్టల్‌ నుంచి బయటకు వెళ్లిపోయింది. 

చింతలపూడి నుంచి ఏలూరు వచ్చేందుకు బస్టాండ్‌లో ఒంటరిగా ఉన్న బాలికను గమనించిన కిరణ్‌ ఆమెను చింతలపూడి ఐటీఐ వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. 17న ఉదయం బాలిక తండ్రికి ఫోన్‌ చేసి మీ కుమార్తె చింతలపూడి బస్టాండ్‌లో ఉందనీ, ఒంటరిగా ఉండడంతో తన ఇంటికి తీసుకువచ్చాననీ చెప్పాడు. అనంతరం ఏలూరు పాతబస్టాండ్‌ వద్దకు బాలికను తీసుకెళ్లిన కిరణ్‌ అతని బంధువు చిట్టిబాబును అక్కడకు రప్పించాడు. ఇద్దరూ కలిసి పవర్‌పేటలోని ఒక ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ బాలికను నిర్బంధించారు. కిరణ్‌ మాట్లాడిన మాటలపై అనుమానంగా వచ్చిన బాలిక తండ్రి చింతలపూడి వెళ్లి హాస్టల్‌ వార్డెన్‌తో కలిసి చింతలపూడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానీ ఎస్సై ఈ ఫిర్యాదును పట్టించుకోలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. అప్పటి నుంచీ బాలిక తండ్రి, బంధువులు వెతుకుతూనే ఉన్నారు. చివరికి ఈనెల 26న బంధువులే బాలికను నిర్బంధించిన ఇంటిని తెలుసుకుని ఏలూరు టూటౌన్‌ పోలీసుల సహాయంతో వారినుంచి రక్షించారు.

 అనంతరం బాలికను చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు. బాలిక అత్యాచారానికి గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ నెల 17న పోలీసులకు ఫిర్యాదు చేస్తే 23 వరకూ కనీసం ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయలేదని తెలుస్తోంది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన అనంతరం కూడా బాలిక ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ఏమాత్రం ప్రయత్నం చేయకపోవటంపై ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం. బాలికపై అత్యాచారం, ఫిర్యాదుపై పోలీసుల నిర్లక్ష్యంపై జంగారెడ్డిగూడెం డీఎస్పీ విచారణ చేసి నివేదిక సమర్పించిన అనంతరం చర్యలు ఉంటాయని తెలుస్తోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top