బాలుడి మృతి.. ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత 

Child Dead In Shishu Care At Anantapur District - Sakshi

వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బాధితుల దాడి

అనంతపురం నగరంలో ఘటన  

ధర్మవరానికి చెందిన ఇంద్రనీల్‌వర్మ (5) డెంగీ జ్వరంతో బాధపడుతూ అనంతపురంలోని ‘శిశు కేర్‌’ ఆస్పత్రిలో ఆదివారం మృతి చెందగా. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రి నిర్వాహకుడితో పాటు  ఐఎంఏ నాయకుడిపై దాడి చేశారు.

సాక్షి, అనంతపురం: అనంతపురం రామచంద్రనగర్‌ ‘శిశు కేర్‌’ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ బాలుడు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యమే దీనికి కారణమంటూ బాలుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే... ధర్మవరంకు చెందిన లోకేష్, దేవి దంపతుల కుమారుడు ఇంద్రనీల్‌వర్మ (5) జ్వరంతో బాధపడుతుండటంతో ఈ నెల 5న ‘శిశు కేర్‌’ ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు బాలుడు డెంగీ, న్యుమోనియాతో బాధపడుతున్నట్లు చెప్పి చికిత్స ప్రారంభించారు. శనివారం అర్ధరాత్రి మూత్ర విసర్జనకు వెళ్లి వచ్చిన బాలుడు.. కాసేపటికే కళ్లు తేలేయడంతో కుటుంబ సభ్యులు వైద్యుడికి సమాచారం అందించారు. రాత్రి 1:30 సమయంలో డాక్టర్‌ మౌలాలి అహ్మద్‌ బాషా వచ్చి బాలుడిని పరీక్షించి పరిస్థితి విషమంగా ఉండటంతో సర్వజనాస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు.

ఈలోగానే బాలుడు మరణించాడు. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు డాక్టర్‌ అహ్మద్‌ బాషా, ఐఎంఏ ఉపాధ్యక్షుడు మనోరంజన్‌రెడ్డిపై దాడి చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడి కుటుంబ సభ్యులను శాంతింపజేశారు. డాక్టర్‌ అహ్మద్‌ బాషా నిర్లక్ష్యం వహించారన్న కారణంతో డీఎంహెచ్‌వో డాక్టర్‌ కేవీఎన్‌ఎస్‌ అనిల్‌కుమార్‌ షోకాజ్‌ జారీ చేశారు. కాగా, వైద్యులపై దాడిని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ వైద్య మండలి సభ్యుడు డాక్టర్‌ ఎస్‌వీకే ప్రసాద్‌రెడ్డి ఖండించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top