కొండెక్కిన కోడి ధరలు

Chicken Prices Hikes in Srikakulam - Sakshi

కిలోమాంసం రూ.రెండు వందల పైమాటే..

గుడ్లదీ అదే దారి

మేత ధరల పెరుగుదలే కారణమంటున్న ఫారం యజమానులు

శ్రీకాకుళం: జిల్లాలో కోడి మాంసం ధర అమాంతం పెరిగిపోయింది. పది రోజుల వ్యవధిలో 80 రూపాయలకు పైగా పెరిగిపోయింది. రోజుకు పది రూపాయలు వంతున పెరుగుతూ ప్రస్తుతం కిలో స్కిన్‌లెస్‌ మాంసం ధర రూ.220కి చేరుకుం ది. పది రోజుల కిందట కిలో రూ.140లు మాత్ర మే ఉండటం, ఇంతలోనే అమాంతం ధర పెరగడంతో కొనుగోలుదారులుగగ్గోలుపెడుతున్నారు.

గత ఏడాదికి భిన్నంగా..
వాస్తవంగా ఏటా కార్తీక, ధనుర్మాసాల్లో కోడి మాంసం ధర తగ్గుతుంటుంది. ఈ రెండు మాసాల్లో అయ్యప్ప, భవానీ స్వాములు, మహిళలు పూజా కార్యక్రమాలు అధికంగా చేయడంతో మాంసాహారానికి దూరంగా ఉంటారు. దీంతో డిమాండ్‌ లేక ధర కూడా తక్కువగా ఉంటుంది. ఈ ఏడాది అందుకు భిన్నంగా ధర ఉంది. కోడి మేత ధర విపరీతంగా పెరిగిపోవడంతో కోళ్ల ఫారం యజమానులు నష్టాలు వస్తున్నాయంటూ దిగుబడిని తగ్గించారు. ఫలితంగా మాంసం ధర పెరిగిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం రూ.220లకు విక్రయిస్తున్నా పెరిగిన మేత ధరకు అనుగుణంగా రేటు లేకపోవడంతో నష్టాలు వస్తున్నాయని కోళ్ల ఫారం యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న కొత్త సంవత్సరాది, సంక్రాంతి పండగల నేపథ్యంలో ధర మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. గుడ్డు ధర కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం హోల్‌సేల్‌లో గుడ్డు ధర రూ.4.30 ఉండగా, వర్తకులు ఐదు రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో గుడ్డు వినియోగం ఎక్కువ కావడం వల్ల ఆ ప్రభావం గుడ్డు ధరపై పడిందని వ్యాపారులు చెబుతున్నారు. కారణం ఏదైనా, కోడి మాంసం గుడ్డు ధరలు అన్‌సీజన్‌లో పెరిగిపోవడంతో మాంసప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top