చికెన్‌ ధర ఆల్‌టైం హై! | Sakshi
Sakshi News home page

చికెన్‌ ధర ఆల్‌టైం హై!

Published Fri, May 15 2020 10:14 AM

Chicken Prices Hiked All Time High in Amravati - Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో: చికెన్‌ చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా ధరలు పైకి ఎగబాకుతున్నాయి. రెండు నెలల కిందట చికెన్‌ తింటే కరోనా సోకుతుందన్న ప్రచారంతో కొనేవాడే లేక అత్యల్పంగా కిలో రూ. 50కే పడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రజల్లో అపోహలు తొలగడంతో మాంసం వినియోగం పెరిగింది. అలా పక్షం రోజుల కిందట రూ. 200కు, వారం కిందట రూ. 250కి చేరింది. అదిప్పుడు ఏకంగా రూ. 310కి పెరిగింది. బ్రాయిలర్‌ కోళ్ల చరిత్రలో ఇదే రికార్డు ధర. ఇప్పటివరకు రాష్ట్రంలో కిలో చికెన్‌ అత్యధిక «(రెండేళ్ల కిందట) ధర రూ. 260 పలికింది. ఇదే ఇప్పటివరకు ఉన్న రికార్డు. ఇప్పుడు ఆ రికార్డు చెరిగిపోయింది. కిలో రూ. 310 అనేది దేశంలోకెల్లా అత్యధిక ధర కావడం గమనార్హం.

కోళ్ల పెంపకాన్ని 60 % తగ్గించిన పౌల్ట్రీ రైతులు
గతంలో కరోనా కారణంగా చికెన్‌ ధరలు దారుణంగా క్షీణించడంతో పౌల్ట్రీ రైతులు కుదేలైపోయారు. ఆర్థికంగా నష్టపోయిన వీరు ఫారాల్లో కోళ్ల పెంపకాన్ని 60 శాతానికి పైగా తగ్గించారు. ఆ తర్వాత క్రమంగా చికెన్‌ కొనుగోళ్లు పెరిగాయి. డిమాండ్‌కు సరిపడినంతగా కోళ్ల లభ్యత లేకుండా పోయింది. ఫలితంగా చికెన్‌ ధర కొండెక్కి కూర్చుంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ వల్ల పెద్ద, చిన్న హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, రోడ్డు పక్కన దుకాణాలూ మూతపడ్డాయి. అవి కూడా తెరచి ఉంటే చికెన్‌ ధర మరింత పెరిగేదని చికెన్‌ సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారు. ఉదాహరణకు కృష్ణా జిల్లాలో సాధారణ పరిస్థితుల్లో రోజుకు లక్ష కోళ్లు (దాదాపు 2 లక్షల కిలోల చికెన్‌), ఆదివారాల్లో రెండు లక్షల కోళ్లు అమ్ముడయ్యేవి. ప్రస్తుతం ఫారాల్లో రోజుకు 40 వేల కోళ్లకు మించి లభ్యత ఉండడం లేదని వ్యాపారులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చికెన్‌ ధర మరో రూ. 15–20 వరకు పెరగవచ్చని వీరు చెబుతున్నారు. ఫారాల్లో కోళ్ల లభ్యత పెరిగే వరకు క్రమంగా చికెన్‌ ధరలు పెరిగే అవకాశం ఉందని అమరావతి బ్రాయిలర్‌ కోళ్ల పెంపకందార్ల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ‘సాక్షి’కి చెప్పారు. లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే పొరుగు రాష్ట్రాల నుంచైనా కోళ్లను తీసుకొచ్చే వీలుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
 

Advertisement
Advertisement