చెలరేగిన చెడ్డీ గ్యాంగ్‌

Cheddi Gang Hulchul In Visakhapatnam - Sakshi

గాజువాక: గాజువాకలో చెడ్డీ గ్యాంగ్‌ చెలరేగింది. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న అపార్ట్‌మెంట్లను టార్గెట్‌ చేసుకున్న ముఠా స్థానిక విశ్వేశ్వరయ్య కాలనీలోని మూడు ఫ్లాట్‌లలో వరుస చోరీలకు పాల్పడి పోలీసులకు సవాలు విసిరింది. మరో రెండు ఫ్లాట్‌లలో దొంగతనానికి విఫల యత్నం చేసింది. ఈ సంఘటన గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో సంచలనమైంది. బుధవారం అర్ధరాత్రి ఈ చోరీ చోటు చేసుకుంది. దసరా సెలవులకు కుటుంబాలతో సహా ఊరెళ్లిన ఐదుగురి ఫ్లాట్‌లను గుర్తించిన దొంగలు ఈ దొంగతనాలకు తెగబడ్డారు. గాజువాక క్రైమ్‌ పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

 విశ్వేశ్వరయ్య కాలనీలో 50 బ్లాక్‌లు గల అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించిన దొంగలు ముందుగా జనం ఉన్న ఫ్లాట్‌లను గుర్తించారు. ఆ ఫ్లాట్‌ల నుంచి నివాసులు బయటకు రాకుండా గెడలు పెట్టారు. అనంతరం అంతకుముందే తాము గుర్తించిన హర్షవర్థన బ్లాక్, అశోక బ్లాక్, సీలేరు సదన్‌లోని ఒక్కో ఫ్లాట్‌లోకి దూరి దొరికినదంతా దోచుకుపోయారు. ప్రతి ఫ్లాట్‌లోను వస్తువులను చిందరవందర చేసేశారు. అనంతరం అదే అపార్టుమెంట్‌లోని శ్రీకృష్ణదేవరాయ బ్లాక్‌లోని రెండు ఫ్లాట్‌లలో చోరీకి యత్నించినప్పటికీ సెంట్రల్‌ లాకింగ్‌ వల్ల తలుపులు తెరుచుకోకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. గురువారం ఉదయం ఫ్లాట్‌ల నుంచి బయటకు వచ్చిన నివాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దీంతో ఇటు గాజువాక, అటు దువ్వాడ పోలీస్‌ స్టేషన్లకు చెందిన పోలీసులు సంబంధిత ఫ్లాట్‌లను పరిశీలించి దొంగతనానికి సంబంధించిన వివరాలను సేకరించడానికి ప్రయత్నించారు. ఫ్లాట్‌ల యజమానులు అందుబాటులో లేకపోవడంతో ఏ ఇంట్లో ఎంత పోయిందన్న సమాచారం లభించలేదు. డాగ్‌ స్క్వాడ్‌తో దొంగల ఆచూకీ కోసం ప్రయత్నించినప్పటికీ సమాచారం లభించలేదు. నిక్కర్లు వేసుకున్న తొమ్మిది మంది ఈ చోరీలకు పాల్పడ్డారని నివాసులు పోలీసులకు తెలిపారు. దీంతో చెడ్డీ గ్యాంగ్‌ పనిగా పోలీసులు భావిస్తున్నారు. 50 యూనిట్లున్న అపార్ట్‌మెంట్‌లో సీసీ కెమెరాలు లేకపోవడంపై పోలీసులు విస్మయం వ్యకం చేశారు. గాజువాక క్రైమ్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top