యూనివర్సిటీ చైర్మన్‌పై చీటింగ్‌ కేసు

Cheating Case Registered On Principal Of OSG University - Sakshi

ఏడుగుండ్లపాడు వద్ద ఉన్న గాయత్రి విశ్వకర్మ యూనివర్సిటీపై  ఆరోపణల వెల్లువ

అసలు మెడికల్‌ కళాశాల మంజూరు కాలేదంటూ ఫిర్యాదు చేసిన భార్య

సాక్షి, మద్దిపాడు (ప్రకాశం): మండలంలోని ఏడుగుండ్లపాడు సమీపంలో ఉన్న ఓంశ్రీ గాయత్రి విశ్వకర్మ యూనివర్సిటీ పేరుతో  ఏర్పాటు చేసిన కళాశాల చైర్మన్‌ చింతాడ గిరినాథ్‌పై ఆయన భార్య చింతాడ అనూరాథ ఫిర్యాదు మేరకు చీటింగ్‌ కేసు నమోదు చేశారు. తమ యూనివర్సిటీకి ప్రభుత్వ పరమైన అనుమతులున్నాయంటూ విద్యార్థులను మోసం చేస్తూ అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని.. ఫేక్‌ సర్టిఫికెట్లు ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈనేపథ్యంలో ఆమె ఈనెల 12వ తేదీన మద్దిపాడు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎస్‌ఐ ఖాదర్‌బాషాను వివరణ కోరగా ఆయనపై కేసు నమోదు చేశామని విచారణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిర్యాదు ఎదుర్కొంటున్న వ్యక్తి.. మెడికల్‌ కళాశాల వస్తుందని నమ్మబలుకుతూ ఇంటర్‌నెట్‌లో అద్భుతమైన భవనాలను చూపుతూ.. తమకు మెడికల్‌ కళాశాల వచ్చినట్లు అందరినీ మోసం చేస్తున్నారన్నారు.

ఎటువంటి కౌన్సెలింగ్‌ నిర్వహించకుండానే తమ కళాశాలలో మెడిసిన్‌ సీట్లు విద్యార్థులకు అందిస్తామని చెప్పుకొచ్చారని తెలిసింది. అయితే కొత్తగా ప్రకాశం జిల్లాకు మెడికల్‌ కళాశాల మంజూరు కాలేదని, ఒక వేళ డెంటల్‌ కళాశాల ఏదైనా మంజూరు కావచ్చని తెలిసింది. ఈక్రమంలో యూనివర్సిటీ చైర్మన్‌గా చెప్పుకుంటున్న గిరినాథ్‌ విశాఖ పట్నం కేంద్రంగా కన్సల్టెన్సీని ఏర్పాటు చేసుకుని ఎటువంటి కౌన్సెలింగ్‌ లేకుండా మెడికల్‌ సీట్లు ఇప్పిస్తామని ఏజెంట్ల ద్వారా నమ్ముబలుకుతున్నట్లు తెలిసింది. ఒక్కొక్క సీటుకు రూ. 13 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇలాంటి వ్యవహారం నడుస్తుండటంతో ఆయన భార్య ఆతనిపై కేసు పెట్టినట్లు సమాచారం. ఇదిలా ఉంటే తన అనుమతి లేకుండా తన భార్య కళాశాలలో ప్రవేశించి ఆస్తి నష్టం కలిగించారనే గిరినాథ్‌ ఫిర్యాదుతో ఆమెపై మద్దిపాడు పోలీస్‌ స్టేషన్‌లో గతంలో కేసు నమోదు చేసినట్లు సమాచారం.  

భార్యభర్తల మధ్య విభేదాలు రావడంతో ఈ విధంగా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడంతో విద్యార్థులు నష్టపోతారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో గిరినా«థ్‌ మెడికల్‌ కళాశాల పేరుతో జీఎన్‌ఎం, ల్యాబ్‌ టెక్నీషియన్‌ వంటి కోర్సులు నడిపారు. కాగా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసినట్లు దినపత్రికల్లో వార్తలు వచ్చాయి. అసలు ఏడుగుండ్లపాడు వద్ద ఉన్న శ్రీగాయత్రీ విశ్వకర్మ యూనివర్శిటీకి మెడికల్‌ కళాశాల మంజూరైయిందో లేదో అధికారులు తేల్చి చెప్పాల్సి ఉంది. రిమ్స్‌కు అనుమతులు ఇవ్వడానికి సుమారు 6 సంవత్సరాలు పట్టిన నేపథ్యంలో కొత్తగా మరో కళాశాలకు అనుమతులిస్తారా అనే∙చర్చ మొదలైంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top