పీజీ మెడికల్ సీట్ల భర్తీపై ప్రభుత్వం కీలక నిర్ణయం
నేడోరేపో ఉత్తర్వులు జారీ!
సాక్షి, హైదరాబాద్ : పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యవిద్య మేనేజ్‌మెంట్ సీట్ల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేనేజ్‌మెంట్ సీట్లను అఖిల భారతస్థాయిలో భర్తీ చేసుకునే అవకాశం ఉండగా.. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు 85 శాతం సీట్లను రిజర్వ్ చేయాలని నిర్ణయించింది. అఖిలభారత స్థాయిలో కేవలం 15 శాతం సీట్లను మాత్రమే వైద్య కళాశాలల యాజమాన్యాలు భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు నేడో రేపో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. రాష్ట్రంలో మొత్తం 31 పీజీ వైద్య కళాశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి 2,983 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 19 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 1,511 సీట్లలో కన్వీనర్ కోటా కింద 7,70 సీట్లు భర్తీ చేయగా.. మిగిలిన 741 సీట్లను యాజమాన్యాలు అఖిలభారత కోటా కింద భర్తీ చేస్తున్నాయి.
మేనేజ్‌మెంట్ కోటా సీట్లను కూడా 85 శాతం తెలంగాణ విద్యార్థులతోనే భర్తీ చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా చేసిన విజ్ఞప్తి మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేయాలని వైద్యారోగ్య శాఖ కార్యదర్శిని సీఎం ఆదేశించారు. తద్వారా పీజీ సీట్లలో తెలంగాణ విద్యార్థులకు 318 సీట్లతోపాటు 70 పీజీ డెంటల్ సీట్లు కూడా అదనంగా అందుబాటులోకి రానున్నాయి. 56 పీజీ వైద్య సీట్లు ఆలిండియా కోటా కింద రిజర్వ్ కానున్నాయి. రాష్ట్ర విద్యార్థులకు లబ్ధి చేకూర్చే నిర్ణయం తీసుకున్నందుకు సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి దామోదర్ రాజనర్సింహ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో స్పెషలిస్ట్ డాక్టర్ల సంఖ్య పెరుగుతుందని, తద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు.


