
సాక్షి, ఆకివీడు: రాజకీయాలకు అర్థాన్ని చెరిపేశారు. హత్యారాజకీయాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదం. అధికార దాహంతో రాజకీయాలు, పాలన చేయడం అత్యంత దారుణం. రాష్ట్ర విభజనకు చంద్రబాబే కారణం అని అన్నారు ఆకివీడు మండలం కుప్పనపూడికి చెందిన భూదానోద్యమకర్త, సీనియర్ పొలిటీషియన్ కట్రెడ్డి గజపతిరావు. సంఘ సేవకుడు, గాంధేయవాది, సమాజవాది, సీనియర్ ఓటర్‌గా ఉన్న ఆయన ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనపై ఆయన నిప్పులు చెరిగారు. 1952 నుంచి ఇప్పటినుంచి ప్రతి ఎన్నికల్లో ఓటు వేస్తున్న ఆయన అంతరంగాన్ని ‘సాక్షి’ ఎదుట ఆవిష్కరించారు.
బాబు వల్లే రాష్ట్ర విభజన
తెలుగు రాష్ట్రం ముక్కలు కావడానికి చంద్రబాబే కారణం. చంద్రబాబు దారుణాల్లో రాష్ట్రం విడిపోవడం ఒకటి. విభజనకు ముందుగా లేఖ ఇచ్చింది ఆయనే. తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రులు కారుచౌకగా ఆస్తులు కొనుగోలు చేసి, తెలంగాణవాసుల్ని బికారులను చేశారు. ఆంధ్రుల సొమ్మంతా హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టి.. తెలంగాణ ప్రజలు చేతులు కట్టుకునేలా చేయడం వల్లే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది.
హత్యారాజకీయాలు దారుణం
హత్యారాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయి. వీటిని సహించకూడదు. అధికారం కోసం ప్రజలతో మమేకమవ్వాలేగాని, ప్రత్యర్థుల్ని హతమార్చి అధికారంలోకి రావాలనుకోవడం సరికాదు. నా రాజకీయ చరిత్రలో ప్రస్తుతం జరుగుతున్న హత్యారాజకీయాలను గతంలో ఎన్నడూ చూడలేదు.
వైఎస్సార్ మాదిరిగానే జగన్
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన ప్రజల గుండెల్ని హత్తుకుంది. ఆయన పథకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. వాటిని ఎవరు అమలు చేస్తారా అనే ఆతృతలో ప్రజలు ఉన్నారు. వైఎస్సార్ పథకాల్ని జగన్‌మోహన్‌రెడ్డి అమలుజరుపుతారనే నమ్మకం ప్రజలకు ఉంది. ఆరోగ్యశ్రీ ప్రజలకు ఎంతో అవసరం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేద విద్యార్థుల జీవితాలు బాగుపడ్డాయి.
పోలవరం.. అవినీతిమయం
ఎన్నో ఏళ్ల పోలవరం ప్రాజెక్ట్ కలను సాకారం చేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుంది. ఆయన హయాంలోనే కాలువలు తవ్వారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ పేరుతో సొమ్మును దోచేస్తున్నారు. పనుల్లో నాణ్యత లేదు. ప్రాజెక్టు సర్వం నాశనమవుతుంది. ఈ ప్రాంతంలో రోడ్లు పగుళ్లు తీస్తున్నాయి. నాణ్యతలేమి, డొల్లతనం కన్పిస్తుంది. రానున్న రోజుల్లో ఇంకేమి చూడాలోనని భయమేస్తోంది. ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగితే అది భవిష్యత్‌తరానికి శాపంలా పరిణమిస్తోంది. పోలవరం ప్రాజెక్ట్‌ను ఈ ప్రభుత్వ హయాంలో కట్టవద్దని నా మనవి.
అన్నదాతలకు అండగా వైఎస్సార్
రైతు అనే నేను బతికి బట్టకట్టానంటే అదంతా వైఎస్సార్ పుణ్యమే. అప్పుల ఊబిలో బతుకుతూ పంట పొలాలున్నా బీదరికంతో గడిపాను. వ్యవసాయం ఉండి అప్పులతో కుమిలిపోతున్న నాకు మూడు పంటలు పోతే నష్టపరిహారం, బీమా చెల్లించి ఆదుకున్న ఘనుడు వైఎస్సార్. ఆయన దయవల్లే నేను నిలబడగలిగాను. నాలాంటి ఎందరికో ఆయన భరోసా ఇచ్చారు. జగన్ కూడా తండ్రి మాదిరిగా పాలన చేస్తారనే నమ్మకం నాకు ఉంది.
సీఎంవి అసంబద్ధ ప్రేలాపనలు
జగన్‌పై కోడి కత్తితో హత్యాయత్నం చేయడం దారుణం. ప్రజల అదృష్టం వల్ల జగన్ బతికాడు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య దారుణం. దీనిపై విచారణ చేయించాల్సిన సీఎం అసంబద్ధ ప్రేలాపనలు సరికాదు.