ఇదేమి గోలయ్యా ‘బాబు’

chandrababu naidu tour in Guntur district holiday declared for private schools - Sakshi

మొన్న పల్నాడులో చినబాబు.. రేపు సత్తెనపల్లిలో చంద్రబాబు పర్యటనలు

ప్రైవేటు పాఠశాలలకు సెలవులు

బస్సులన్నీ నాయకుల సభలకు తరలింపు 

హడలిపోతున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు

ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న తల్లిదండ్రులు

సాక్షి, గుంటూరు: సాధారణంగా జిల్లాలో సీఎం పర్యటనంటే ఏవైణౠ కొత్త పథకాలు ప్రవేశపెట్టి వరాల జల్లు కురిపిస్తారని ప్రజలు ఆశ పడతారు. కానీ ప్రస్తుతం జిల్లాలో సీఎం పర్యటనంటే ప్రజలు అసహనానికి లోనవుతున్నారు. ముఖ్యంగా ప్రైవేట్‌ విద్యా సంస్థలైతే సీఎం, మంత్రి నారా లోకేశ్‌ జిల్లా పర్యటనæ అంటే హడలిపోతున్నారు. సీఎం, చినబాబు పాల్గొనే సభలకు భారీగా జనాలను సమీకరించడం కోసం ప్రైవేట్‌ విద్యా సంస్థల బస్సులు పంపాలంటూ అ«ధికారులే హకుం జారీ  చేస్తున్నారు.   

మొన్నటికి మొన్న పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేశ్‌ పల్నాడు పర్యటన సందర్భంగా పల్నాడులోని పలు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఆయా బస్సులను జన సమీకరణకు తీసుకెళ్లారు. చినబాబు పర్యటన ముగిసి కొద్ది రోజులు కూడా కాక ముందే జిల్లాలో సీఎం పర్యటన ఉండటంతో ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో బుగులు మొదలైంది. సోమవారం సీఎం చంద్రబాబు సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కార్యక్రమానికి భారీగా జనాలను తరలించేందుకు సిద్ధమైనట్లు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. దీంతో అధికార పార్టీ నేతలు ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలపై పడ్డారు. 

గతంలో సైతం సీఎం, మంత్రుల సభలు, పార్టీ కార్యక్రమాలకు పాఠశాలలకు సెలవులు ప్రకటించి బస్సులు తీసుకెళ్లారు. చీటికి మాటికి పాఠశాలలకు అనవసరంగా సెలవులు ప్రకటించడం వల్ల పిల్లల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారుతుందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మండి పడుతున్నారు. గతంలో నారా హమారా.. టీడీపీ హమారా.. మహానాడు, వనం మనం, స్వచ్ఛ భారత్‌కు సంబంధించిన కార్యక్రమాలకు పాఠశాల బస్సులను ఉపయోగించారు. అయితే సీఎం సభలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు స్వచ్ఛందంగా బస్సులను పంపిస్తుండగా, మరికొన్ని విద్యా సంస్థల యాజమాన్యాలను రవాణా శాఖ అధికారులు బెదిరించి బస్సులు తీసుకెళుతున్నారు. 
 
ఆర్టీసీకి బకాయి ఉన్నందునే...
ప్రతి ప్రభుత్వ, పార్టీ కార్యక్రమానికి ఆర్టీసీ బస్సులను విచ్చలవిడిగా వినియోగించుకుంటున్న టీడీపీ నేతలు సంస్థకు బకాయి పడ్డారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఆర్టీసీ బస్సులను వినియోగిస్తే సమస్యలు ఎదురవుతాయని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను బెదిరిస్తున్నట్లు సమాచారం. 

నిబంధనలు తుంగలోకి..
ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు విద్యా సంస్థ వాహనాలను వినియోగించరాదన్న నిబంధనలను తెలుగుదేశం ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది. పాఠశాలలకు సెలవు ప్రకటించి స్కూల్‌ బస్సులను తీసుకెళ్లడంపై విద్యార్థి సంఘాల నాయకులు మండి పడుతున్నాయి. సాధారణంగా స్కూల్‌ బస్సులను ఇతర కార్యక్రమాలకు వినియోగించే సమయంలో రవాణా కార్యాలయం ద్వారా పర్మిట్‌ను పొందాలి. జిల్లాలో అధికార పార్టీ నాయకులు ఈ నిబంధనలు పాటించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇలా బెదిరించి జనాలను తరలిస్తే అటు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, ఇటు ప్రజల ఆగ్రహానికి గురవుతామని తెలుగుదేశం పార్టీలోని కొందరు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top