
చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఉరవకొండ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఉరవకొండ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ-బీజేపీ పదేపదే చెప్పాయని వై.విశ్వేశ్వరరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్రంలో భాగస్వామ్య పక్షం అయినా.. రాష్ట్రానికి న్యాయం చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని ఆయన విమర్శించారు. స్వప్రయోజనాల కోసమే తప్ప... రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు పని చేయటం లేదని వ్యాఖ్యానించారు.
కాగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏమీ ఉండబోదని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం పరోక్షంగా తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. ప్రత్యేక హోదా కేటగిరీ కలిగిన రాష్ట్రాలకూ తాజా బడ్జెట్‌లో ప్రత్యేక ప్రణాళిక సాయం (ఎస్‌పీఏ) కేటాయించలేదని కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి ఇందర్‌జిత్ సింగ్ నిన్న లోక్ సభలో స్పష్టం చేశారు. అంటే ఇకపై స్పెషల్ కేటగిరీ స్టేటస్ హోదా రాష్ట్రాలకు ఇప్పటివరకు ఉన్న ప్రయోజనాలేవీ ఉండవని పరోక్షంగా చెప్పారు.