ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ప్రవీణ్‌కుమార్‌

Chagari Praveen Kumar Appointed Andhra Pradesh High Court Chief Justice - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కొత్తగా ఏర్పాటుకానున్న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌ నియమితులయ్యారు. ఏపీ హైకోర్టులో సీనియర్‌ అయిన ప్రవీణ్‌కుమార్‌ను చీఫ్‌ జస్టిస్‌గా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నియమించారు. జనవరి 1, 2019 నుంచి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఏర్పాటవుతుంది. ఇదే రోజు నుంచి జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ గురువారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. (జనవరి 1 నుంచి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు)

1961 ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో ప్రవీణ్‌కుమార్‌ జన్మించారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు లిటిల్‌ ఫ్లవర్‌ హైస్కూల్‌లో చదువుకున్నారు. లిటిల్‌ ఫ్లవర్‌ జూనియర్‌లో కాలేజీలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు. నిజాం కళాశాలలో బీఎస్సీ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ నుంచి లా పట్టా అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌లో 1986, ఫిబ్రవరి 28న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. సి.పద్మనాభరెడ్డి వద్ద న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. క్రిమినల్‌, రాజ్యాంగ సంబంధ కేసులు ఎక్కువగా వాదించారు. 2012, జూన్‌ 29న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013, డిసెంబర్‌ 4న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top