ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని సమీపంలో ఏర్పాటు కానున్న పోలీసు హబ్‌కు అటవీ భూములు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని సమీపంలో ఏర్పాటు కానున్న పోలీసు హబ్‌కు అటవీ భూములు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు కేంద్ర అటవీ-పర్యావరణ మంత్రిత్వ శాఖ వర్తమానం పంపింది. గుంటూరు జిల్లా తుళ్ళూరుకు కాస్త దూరంలో ఉన్న వెంకటాయపాలెంలో నిరుపయోగంగా ఉన్న (డీ గ్రేడెడ్) 2700 ఎకరాల అటవీ భూమిని గుర్తించిన డీజీపీ కార్యాలయం.. అక్కడ పోలీసు శాఖకు సంబంధించిన ప్రధాన విభాగాల ఏర్పాటుకు ప్రతిపాదించి ఆ భూములను డీ-నోటిఫై చేయాలని కోరుతూ మార్చిలో కేంద్రానికి లేఖ రాసింది. తుళ్ళూరుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెంకటాయపాలెం ప్రాంతంలో రాష్ట్ర డీజీపీ కార్యాలయంతో పాటు నిఘా విభాగం, సీఐడీ, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో, పోలీసు ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్, ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీ (అప్పా), ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. వెంకటాయపాలెంలోని భూముల్ని డీ నోటిఫై చేసేందుకు అంగీకరించిన కేంద్రం.. అంతే విస్తీర్ణం గల భూములను ప్రత్యామ్నాయ ప్రాంతంలో అప్పగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.